Nara Brahmani: లోకేశ్ గారిది సేవాతత్వం.. అంటూ భర్తపై బ్రాహ్మణి పొగడ్తలు.. వీడియో ఇదిగో!

  • పదిమందికి ఎలా సాయం చేయాలనే తాపత్రయపడుతుంటారని వెల్లడి
  • హెరిటేజ్ ఫుడ్స్ తో నలుగురికి ఉపాధి దొరుకుతుందనే ఆలోచించారన్న బ్రాహ్మణి
  • మంగళగిరి రైతుల కోసం ఓ నిధి ఏర్పాటు చేశారని వివరణ
Nara Brahmani Speech At Mangalagiri women meet

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ పై ఆయన భార్య నారా బ్రాహ్మణి పొగడ్తల వర్షం కురిపించారు. లోకేశ్ ది సేవాతత్వమని, ఎప్పుడూ నలుగురికి ఎలా మేలు చేయాలనే ఆలోచిస్తుంటారని చెప్పుకొచ్చారు. ఈమేరకు మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో బ్రాహ్మణి పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన మహిళలతో మాట్లాడుతూ.. సేవా గుణం, పదిమందికి మేలు చేయాలని తపన పడే తన భర్త నారా లోకేశ్ కు ఓటేసి గెలిపించాలని కోరారు. మహిళలకు ఉపాధి కల్పించే విషయంలో లోకేశ్ కొత్త ఆలోచనలతో ముందుకొస్తున్నారని వివరించారు. హెరిటేజ్ ఫుడ్స్ ప్రారంభించేటపుడు కూడా నలుగురికి ఉపాధి దొరుకుతుందనే లోకేశ్ ఆలోచించాడన్నారు. 

నామమాత్రపు చదువులు, చదువే రాని మహిళలకు ఉపాధి కల్పించేందుకు శాలరీ కోచ్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉపాధి చూపిస్తున్నట్లు బ్రాహ్మణి తెలిపారు. ఈ కార్యక్రమం కూడా లోకేశ్ ఆలోచనతో రూపుదిద్దుకున్నదేనని వివరించారు. రైతుల కోసం గత ప్రభుత్వంలో లోకేశ్ ఓ నిధి ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. దీని ద్వారా రైతులకు ఉచిత బీమా సహా ఎన్నో యాక్టివిటీస్ చేశారని వివరించారు. ఒక్క రైతులు మాత్రమే కాదు.. దీనివల్ల మంగళగిరి ప్రజలందరికీ మేలు జరుగుతుందని చెప్పుకొచ్చారు. స్త్రీ శక్తి ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని బ్రాహ్మణి తెలిపారు. నియోజకవర్గంలోని మహిళలకు 2610 కుట్టు మిషన్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. లోకేశ్‌ ఎమ్మెల్యే అయితే, మరిన్ని కార్యక్రమాలు చేస్తామని బ్రాహ్మణి హామీ ఇచ్చారు. రాష్ట్రానికి పునర్వైభవం తీసుకురావడం ఎవరి వల్ల సాధ్యమవుతుందో ఒక్కసారి ఆలోచించి ఓటు వేయాలని బ్రాహ్మణి కోరారు.

  • Loading...

More Telugu News