LSG Vs MI: ల‌క్నో విజ‌యం.. ముంబై ప్లేఆఫ్ ఆశ‌లు సంక్లిష్టం!

  • ల‌క్నో వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్ వ‌ర్సెస్ ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ మ్యాచ్‌
  • ముంబైను 4 వికెట్ల తేడాతో ఓడించిన‌ ల‌క్నో
  • హాఫ్ సెంచ‌రీ (62) తో రాణించిన స్టొయినిస్
  • ఈ విజ‌యంతో పాయింట్ల ప‌ట్టిక‌లో మూడో స్థానానికి ఎగ‌బాకిన ఎల్ఎస్‌జీ  
LSG won by 4 wickets against MI

ల‌క్నో వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్ తో జ‌రిగిన మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ సునాయాస విజ‌యం సాధించింది. ముంబై నిర్దేశించిన 145 ప‌రుగుల స్వ‌ల్ప‌ లక్ష్యాన్ని 4 బంతులు మిగిలి ఉండ‌గానే ఛేదించింది. ల‌క్నో బ్యాట‌ర్ల‌లో స్టొయినిస్ హాఫ్ సెంచ‌రీ (62) తో రాణించాడు. కెప్టెన్ కేఎల్‌ రాహుల్ 28, దీపక్ హూడా 18 ప‌రుగుల‌తో ప‌ర్వాలేద‌నిపించారు. ముంబై బౌల‌ర్ల‌లో హార్దిక్ పాండ్యా 2 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. తుషార‌, న‌బీ, కోయెట్జీ చెరో వికెట్ తీశారు. 

అంత‌కుముందు టాస్ ఓడి మొద‌ట బ్యాటింగ్‌కి దిగిన ఎంఐ త‌డ‌బ‌డింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 144 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. నెహాల్ వ‌ధేరా 46, ఇషాన్ కిష‌న్ 32, టీమ్ డేవిడ్ 35 ప‌రుగులు చేశారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా గోల్డెన్ డ‌కౌట్ (0) అయ్యాడు. రోహిత్ శ‌ర్మ 4, తిల‌క్ వ‌ర్మ 7, సూర్య‌కుమార్ యాద‌వ్ 10 స్వ‌ల్ప స్కోర్ల‌కే పెవిలియ‌న్ చేరారు. ల‌క్నో బౌల‌ర్ల‌లో మోసిన్ ఖాన్ 2, న‌వీన్ ఉల్ హ‌క్‌, ర‌వి బిష్ణోయ్‌, మ‌యాంక్ యాద‌వ్‌, స్టొయినిస్ త‌లో వికెట్ ప‌డ‌గొట్టారు. 

ఇక 145 ప‌రుగుల స్వ‌ల్ప‌ ల‌క్ష్యఛేద‌న‌లో ల‌క్నో తొలి ఓవ‌ర్ నాలుగో బంతికే అర్షిన్ కుల‌క‌ర్ణి (0) రూపంలో మొద‌టి వికెట్ పారేసుకుంది. కానీ, ఆ త‌ర్వాత మార్క‌స్ స్టొయినిస్‌, కేఎల్ రాహుల్ జోడీ మ‌రో వికెట్ ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌గా ఆడింది. ఈ ద్వ‌యం 58 ప‌రుగుల భాగ‌స్వామ్యం అందించింది. జ‌ట్టు స్కోర్ 59 ప‌రుగుల వ‌ద్ద సార‌ధి రాహుల్ (28) వికెట్ కోల్పోయింది. అనంత‌రం దీప‌క్ హూడా (18) తో క‌లిసి స్టొయినిస్ ఇన్నింగ్స్ ను ముందుకు న‌డిపించాడు. 

ఈ క్ర‌మంలో స్టొయినిస్ హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. ఆ త‌ర్వాత దీప‌క్ హూడా 18, స్టొయినిస్ 62, ట‌ర్న‌ర్ 6 వికెట్ల‌ను వ‌రుస విరామాల్లో కోల్పోయినప్ప‌టికీ ల‌క్నో అప్ప‌టికే టార్గెట్‌కు ద‌గ్గ‌ర‌యింది. నికోల‌స్ పూర‌న్ 14 (నాటౌట్‌) క్రీజులో ఉండి ఎల్ఎస్‌జీకి విజ‌యం అందించాడు. దీంతో ల‌క్నో 19.2 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ విక్ట‌రీలో కీల‌క పాత్ర పోషించిన స్టొయినిస్ ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.    

ఇక ఈ విజ‌యంతో పాయింట్ల ప‌ట్టిక‌లో ల‌క్నో మూడో స్థానానికి ఎగ‌బాకింది. ఇప్ప‌టివ‌ర‌కు 10 మ్యాచులు ఆడిన ఎల్ఎస్‌జీ ఆరు విజ‌యాలు సాధించింది. మ‌రోవైపు ముంబై ఇండియ‌న్స్ ప్లేఆఫ్ ఆశ‌లు సంక్లిష్టం అయ్యాయి. ఇప్ప‌టివ‌ర‌కు 10 మ్యాచుల్లో కేవ‌లం మూడు విజ‌యాల‌తో ఎంఐ తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన నాలుగు మ్యాచుల్లో గెలిచినా ముంబై ప్లేఆఫ్ చేర‌డం దాదాపు అసాధ్యం.

  • Loading...

More Telugu News