KCR: రేవంత్ రెడ్డితో మిలాఖత్ లేకుంటే 'ఆర్ ట్యాక్స్‌'పై మోదీ విచారణ జరిపించాలి: కేసీఆర్ డిమాండ్

  • రేవంత్ రెడ్డి ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని మోదీ చెప్పారన్న కేసీఆర్
  • నరేంద్ర మోదీ, రేవంత్ రెడ్డి ఒక్కటేనని విమర్శ
  • బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే తెలంగాణకు నీళ్ళు, నిధులు వస్తాయన్న బీఆర్ఎస్ అధినేత
KCR demands enquiry on revanth reddy R Tax

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎలాంటి మిలాఖత్ లేకుంటే ప్రధాని నరేంద్ర మోదీ తను చెప్పిన 'ఆర్ ట్యాక్స్‌'పై ఈడీ, ఆదాయపు పన్ను శాఖతో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డిమాండ్ చేశారు. మంగళవారం కేసీఆర్ కొత్తగూడెంలో కార్నర్ మీటింగ్‌లో మాట్లాడుతూ... ప్రధాని మోదీ ఈరోజు తెలంగాణకు వచ్చారని, మెదక్ సభలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపణలు చేశారని తెలిపారు. ఆయన చెప్పింది నిజమే అయితే... వారు మిలాఖత్ కాకుంటే దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కానీ మోదీకి అది చేతకాదన్నారు. పైకి మాత్రమే తాము వేరు అన్నట్లుగా నాటకాలు ఆడుతున్నారని, కానీ మోదీ, రేవంత్ ఇద్దరూ ఒక్కటేనని విమర్శించారు.

బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే తెలంగాణ నదుల నీళ్లు తెలంగాణకు దక్కుతాయని, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వస్తాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల కథ అయిపోయిందన్నారు. అందుకే బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తన కంఠంలో ప్రాణమున్నంత వరకు తెలంగాణ ప్రజల హక్కుల గురించి పోరాడుతూనే ఉంటానన్నారు. మీ బిడ్డగా ఆనాడు తెలంగాణ రాష్ట్రం తెస్తానని చెప్పానని... తన ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ తీసుకు వచ్చానన్నారు. అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని చూసుకున్నామన్నారు. బీఆర్ఎస్ పాలనలో మతవిద్వేషాలు ఎక్కడా కనిపించలేదన్నారు.

  • Loading...

More Telugu News