Narendra Modi: ఫేక్ వీడియోలు సర్క్యులేట్ కావడంపై మోదీ తీవ్ర ఆగ్రహం

PM Modi fires at fake videos
  • విపక్షాలు సోషల్ మీడియాలో నకిలీ వీడియోలను వైరల్ చేస్తున్నాయని విమర్శ
  • తమ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే సత్తాలేక టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నాయని ఆగ్రహం
  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నకిలీ వీడియోలను సృష్టించడంపై ఆందోళన
ఫేక్ వీడియోలు సర్క్యులేట్ కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని ధారాశివ్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ... విపక్షాలు సోషల్ మీడియాలో నకిలీ వీడియోలను వైరల్ చేస్తున్నాయని విమర్శించారు. తమ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే సత్తాలేక టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నకిలీ వీడియోలను సృష్టించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

విపక్షాలు ప్రధానంగా తనను టార్గెట్ చేస్తున్నాయన్నారు. కానీ ఇప్పుడు వారి అబద్ధాలను ఎవరూ నమ్మడం లేదన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తన ఫేస్‌ను ఉపయోగించి తప్పుడు వీడియోలతో వారి ప్రేమ దుకాణాల్లో అమ్మకానికి పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రస్తుత లోక్ సభ ఎన్నికలు జాతి ఆత్మగౌరవం కోసం జరుగుతున్న పోరాటమన్నారు.

బలహీన ప్రభుత్వం ఏర్పడితే అది ఎప్పుడైనా కూలిపోతుందని హెచ్చరించారు. ఆరు దశాబ్దాలు అధికారంలో ఉన్నప్పటికీ దేశం ఎదుర్కొంటున్న నీటి సరఫరా సవాళ్లను కాంగ్రెస్ సమర్ధవంతంగా పరిష్కరించడంలో విఫలమైందన్నారు. గత పదేళ్లలో తమ ప్రభుత్వం నీటి సరఫరా మౌలిక వసతుల మెరుగుకు సమర్ధవంతమైన చర్యలు తీసుకుందన్నారు.
Narendra Modi
Lok Sabha Polls
BJP
Congress

More Telugu News