YS Jagan: పోయేకాలం వచ్చినప్పుడు విలన్లందరికీ హీరోలు బచ్చాలుగానే కనిపిస్తారు: సీఎం జగన్

  • గుంటూరు జిల్లా పొన్నూరులో సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభ
  • చంద్రబాబు తనను బచ్చా అంటున్నాడని వెల్లడి
  • తాను బచ్చా అయితే తనన చూసి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నాడన్న సీఎం
  • చంద్రబాబు అంత పుడింగి అయితే పొత్తులు ఎందుకని వ్యాఖ్యలు 
CM Jagan comments on Chandrababu in Ponnur rally

ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ఈ సాయంత్రం గుంటూరు జిల్లా పొన్నూరులో ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు. చంద్రబాబు తనను ఒక బచ్చా అంటున్నాడని, పోయేకాలం వచ్చినప్పుడు విలన్లందరికీ హీరోలు బచ్చాలుగానే కనిపిస్తారని అన్నారు. నేను బచ్చా అయితే... నన్ను చూసి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నాడు? నేను బచ్చా అయితే... నన్ను ఎదుర్కొనేందుకు ఎందుకు పొత్తులు పెట్టుకున్నాడు? అని సీఎం జగన్ ప్రశ్నించారు. 

నువ్వు నన్ను బచ్చా అంటున్నావు... కానీ నేను ఎన్నికలకు ఒంటరిగా వచ్చి ధైర్యంగా పోరాడుతున్నా అని స్పష్టం చేశారు. చంద్రబాబు అంత పుడింగి అయితే పొత్తులు లేకుండా సింగిల్ గా రావొచ్చు కదా అని సవాల్ విసిరారు. 

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏం చేశాడో కూడా చెప్పుకోలేకపోతున్నాడని, చంద్రబాబు అంటే గుర్తుకువచ్చే పథకం ఒక్కటైనా ఉందా అని సీఎం జగన్ విమర్శించారు. నేను అమ్మ ఒడి, పెన్షన్లు, ఆసరా, చేయూత, వాహనమిత్ర వంటి పథకాలు తెచ్చాను... అలాంటివి నువ్వు ఎందుకు చేయలేకపోయావు? అని చంద్రబాబును ప్రశ్నించారు. 

గత ఎన్నికల్లో తమ మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో 99 శాతం అమలు చేశామని, అంతకుముందు చంద్రబాబు రుణమాఫీ చేస్తానని చెప్పాడు... చేశాడా? అని నిలదీశారు. ప్రజల్లో విశ్వసనీయత ఉన్న మీ బిడ్డ ప్రభుత్వంపై విలువలు లేని ఈ చంద్రబాబు ఎలా  నోరుపారేసుకుంటున్నారో చూడండి అంటూ సీఎం జగన్ పొన్నూరు సభలో వ్యాఖ్యానించారు. 

"మీ బిడ్డ ఒంటరిగా వస్తున్నాడు. మీ బిడ్డను ఓడించడానికి చంద్రబాబు, ఆయనకు మద్దతుగా రెండు జాతీయ పార్టీలు, ఒక దత్తపుత్రుడు, ఒక వదినమ్మ, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 చేతులు కలిపాయి. వీళ్లలో ఎవరికీ పేదలకు మంచి చేసిన చరిత్ర లేదు. వీళ్లు ఒక కూటమిగా తయారై, ప్రతి ఇంటికీ మంచి చేసిన మీ జగన్ పై యుద్ధం చేస్తున్నారు. మీ బిడ్డ నమ్ముకున్నది ప్రజలనే. నా పొత్తు ప్రజలతోనే" అని సీఎం జగన్ పేర్కొన్నారు.

More Telugu News