khalistan: కెనడా ప్రధాని సభలో ఖలిస్థాన్ అనుకూల నినాదాలు!

Pro Khalistan slogans raised during PM Justin Trudeau speech in Canada
  • ఆ దేశంలో స్థిరపడిన సిక్కులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న జస్టిన్ ట్రూడో
  • సిక్కుల హక్కులు, స్వేచ్ఛ కోసం ‘నిరసన’ తెలుపుతూనే ఉంటామంటూ వ్యాఖ్యలు
  • సిక్కుల విలువలే కెనడియన్ల విలువలంటూ ప్రశంసలు
  • తమ దేశానికి మరిన్ని విమానాలు నడపాలని భారత్ ను కోరామని వెల్లడి
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సభలో కొందరు ఖలిస్థాన్ అనుకూల నినాదాలు చేశారు. కెనడాలో స్థిరపడిన సిక్కులు టొరంటోలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సభా వేదికపైకి ట్రూడో చేరుకుంటుండగా సభకు వచ్చిన వారిలో కొందరు ఈ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ట్రూడో మాట్లాడుతూ తమ ప్రభుత్వం దేశంలోని సిక్కుల హక్కులు, స్వేచ్ఛ కోసం ‘నిరసన’ తెలుపుతూనే ఉంటుందని వ్యాఖ్యానించారు.

దేశంలోని భిన్న వర్గాల ప్రజల సమాహారం కెనడా బలాల్లో ఒకటని చెప్పారు. ప్రజల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటం వల్లే దేశం ఎంతో బలంగా ఉందన్నారు. సిక్కుల విలువలే కెనడావాసుల విలువలని చెప్పుకొచ్చారు.

గురుద్వారాలు సహా దేశంలోని వివిధ ప్రార్థనా మందిరాల వద్ద భద్రతను పెంచుతున్నామని ట్రూడో వివరించారు. ‘మీరు స్వేచ్ఛగా, ఎలాంటి బెదిరింపులు లేకుండా మీ మతధర్మాన్ని ఆచరించేందుకు కెనడా రాజ్యాంగం అవకాశం కల్పిస్తుంది. మీకు అండగా నిలబడటంతోపాటు మిమ్మల్ని కాపాడుతుంది’ అని ట్రూడో చెప్పారు.

మీ ఆప్తులను తరచూ కలుసుకోవాలని మీలో చాలా మంది కోరుకుంటున్నారని నాకు తెలుసు. కెనడాకు మరిన్ని విమానాలు, మరిన్ని మార్గాల్లో విమాన సర్వీసుల కోసం భారత్ తో సంప్రదింపులు జరిపి ఒప్పందం చేసుకున్నాం. అమృత్ సర్ సహా వివిధ ప్రాంతాల్లో మరిన్ని విమానాలు నడపాలని భారత్ ను కోరతాం’ అని ఆయన హామీ ఇచ్చారు. 

ఖల్సా రోజుగా కూడా పిలిచే వైశాఖి రోజున 1699లో సిక్కు మతం ఆవిర్భవించిందని ఒంటారియోలోని సిక్కులు, గురుద్వారాల కౌన్సిల్ చెబుతోంది. సిక్కుల నూతన సంవత్సరం కూడా ఆ రోజే మొదలవుతుందని అంటోంది.

దీన్ని పురస్కరించుకొని గత కొన్నేళ్లుగా లేక్ షోర్ బోలెవార్డ్ వరకు ర్యాలీ చేపడుతోంది. దేశంలోకెల్లా మూడో అతిపెద్ద ర్యాలీ తమదేనని కౌన్సిల్ పేర్కొంటోంది. ఈ ర్యాలీని వీక్షించేందుకు వేలాది మంది వస్తుంటారని సీబీసీ న్యూస్ తెలిపింది.

భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు క్లిష్టంగా మారిన వేళ జస్టిన్ ట్రూడో చేసిన ప్రసంగం ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించిన హర్ దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురి కావడం ఇరు దేశాల మధ్య వివాదం రాజేసింది.

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) 2020లో నిజ్జర్ ను ఉగ్రవాదిగా ప్రకటించింది. అయితే 2023 జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో ఉన్న గురుద్వారా నుంచి నిజ్జర్ బయటకు వస్తుండగా కొందరు వ్యక్తులు అతన్ని కాల్చి చంపారు.
khalistan
sikh community
india
canada
Justin Trudeau

More Telugu News