Power Cut: అర‌గంట క‌రెంట్ నిలిపివేత‌.. కీస‌ర డీఈ సస్పెన్షన్!

  • ఏఈఈపై చ‌ర్య‌ల‌కు టీఎస్ఎస్‌పీడీసీఎల్ సీఎండీ ఆదేశాలు
  • అనుమ‌తి లేకుండానే లైన్ క్లియ‌రెన్స్ (ఎల్‌సీ) ఇచ్చార‌ని డీఈ భాస్క‌ర్‌రావుపై చ‌ర్య‌లు
  • క‌రెంట్ కోత‌ల‌పై మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్
  • ఈ విష‌యం కార్పొరేట్ కార్యాల‌యం దృష్టికి వెళ్ల‌డంతో నివేదిక ఇవ్వాల‌ని ఎస్ఈ, సీజీఎంను కోరిన సీఎండీ
Keesara DE Suspended for Power Cut with Line Clearance

అర‌గంట క‌రెంట్ నిలిపివేత కారణంగా హైద‌రాబాద్‌లోని హ‌బ్సిగూడ ప‌రిధిలోని కీస‌ర డివిజ‌న‌ల్ ఇంజినీర్ (డీఈ) ఎల్. భాస్క‌ర్‌రావును తెలంగాణ స్టేట్ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీఎస్ఎస్‌పీడీసీఎల్‌) సంస్థ సీఎండీ ముషార‌ఫ్ ఫ‌రూఖీ శ‌నివారం రాత్రి సస్పెండ్ చేశారు. నాగారం ఆప‌రేష‌న్ అడిష‌న‌ల్ అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈఈ) పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశాలు జారీ చేశారు. 

అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో లైన్ క్లియ‌రెన్స్ (ఎల్‌సీ) తీసుకోవాల‌న్నా.. స‌ర్కిల్ ఎస్ఈ ముంద‌స్తు అనుమ‌తి తీసుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు. 33కేవీ అమ్ముగూడ ఫీడ‌ర్‌పై డీఈ భాస్క‌ర్‌రావు అనుమ‌తి లేకుండానే ఎల్‌సీ ఇచ్చారు. దీంతో ఆ రోజు ఉద‌యం 10.05 నుంచి 10.35 వ‌ర‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. అదే స‌మ‌యంలో నాగారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మ‌ల్లారెడ్డి ఎన్నిక‌ల ప్ర‌చార స‌మావేశం నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలో క‌రెంట్ కోత‌ల‌పై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. 

ఈ విష‌యం కార్పొరేట్ కార్యాల‌యం దృష్టికి వెళ్లింది. దాంతో నివేదిక ఇవ్వాల‌ని ఎస్ఈ, సీజీఎంను సీఎండీ కోర‌డం జ‌రిగింది. ఉన్న‌తాధికారుల నుంచి ముంద‌స్తు అనుమ‌తి లేకుండా అర‌గంట పాటు విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిపేశార‌ని తేలింది. దీనిని తీవ్రంగా భావించిన యాజ‌మాన్యం డీఈ, నాగారం ఏఈఈపై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నిర్ణ‌యించింది. అలాగే ఈ వేస‌విలో వినియోగ‌దారుల‌కు నిరంత‌ర క‌రెంట్ స‌ర‌ఫ‌రాకు అనుస‌రించాల్సిన మార్గ‌ద‌ర్శ‌కాల‌పై కార్పొరేట్ కార్యాల‌యం ఉత్త‌ర్వులు జారీచేసింది.

More Telugu News