Sajjala Ramakrishna Reddy: నిన్న సీఎం జగన్ విడుదల చేసిన మేనిఫెస్టోపై విపక్షాల విమర్శలు... సజ్జల  ఏమన్నారంటే...!

  • కొత్త హామీలేమీ ఇవ్వని సీఎం జగన్
  • వైసీపీ మేనిఫెస్టోలో ఏమీలేదంటూ చంద్రబాబు తదితర నేతలు వ్యాఖ్యలు
  • మేనిఫెస్టోలో ఏం చెప్పామో అది అమలు చేయడం గొప్ప విషయమన్న సజ్జల
  • చంద్రబాబు గతంలో 600కి పైగా హామీలు ఇచ్చి ఎన్ని నెరవేర్చారని ప్రశ్న
Sajjala press meet on YCP manifesto

ఏపీ సీఎం జగన్ నిన్న వైసీపీ మేనిఫెస్టో విడుదల చేయగా, దానిపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. మేనిఫెస్టోకు కట్టుబడి ఉండడం జగన్ కు మాత్రమే సాధ్యమని అన్నారు. 

మేనిఫెస్టో ప్రకటించడమే కాకుండా, అందులో 99 శాతం అమలు చేయడం సాధారణమైన విషయం కాదన్నారు. దాంతో ఈసారి ఎన్నికల మేనిఫెస్టోపై చాలా అంచనాలు ఉన్నాయని తెలిపారు. జగన్ కొత్తగా ఏం చెబుతారు అని కూడా చాలామంది ఎదురుచూశారని వివరించారు. నిన్న జగన్ విడుదల చేసిన వైసీపీ మేనిఫెస్టోపై రాష్ట్రంలో చర్చలు జరుగుతున్నాయని సజ్జల పేర్కొన్నారు.

"మేం అధికారంలోకి రాగానే ఈ తాయిలాలు ఇస్తాం అంటూ హామీలు కుమ్మరించే పత్రం మేనిఫెస్టో అనిపించుకోదు. ఆ మాత్రం దానికి ఓ పత్రికా ప్రకటన ఇచ్చినా సరిపోతుంది. ఐదేళ్లలో అన్ని వర్గాల ప్రజల కోసం ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుంది అనే దాంట్లో మాకు ఉన్న స్పష్టతను చెప్పడమే మేనిఫెస్టో లక్ష్యం. ఆ లక్ష్యాన్ని ప్రతిబింబిస్తోంది కాబట్టే ఇవాళ అందరి చేతుల్లో వైసీపీ మేనిఫెస్టో ఉంది. 

జగన్ ఎన్నికలకు ముందు ఏం చెప్పారో, అధికారంలోకి వచ్చాక అదే చేయడంతో ఇది కదా మేనిఫెస్టో అని ప్రజల్లో వైసీపీపై ఓ నమ్మకం కలిగింది. అందుకే నిన్నటి మేనిఫెస్టోకు ప్రాధాన్యత ఏర్పడింది. అయితే, నిన్నటి మేనిఫెస్టోలో కొత్తగా ఏమీ లేకపోవడం పట్ల పలువురు పలు రకాలుగా అనుకోవచ్చు. అసలు ఈ మేనిఫెస్టోలో ఏమీ లేదు, అంతా డొల్ల అని తీసిపారేసే చంద్రబాబునాయుడు వంటి వారు కూడా ఉంటారు. 

నిన్న మేనిఫెస్టో ప్రకటిస్తుండగానే, మొక్కుబడిగా ఏమేం తిట్టాలో అన్నీ తిట్టారు. చంద్రబాబు తాను సభ్యసమాజంలో ఉన్నాడో లేదో తెలియదు కానీ, జగన్ మోహన్ రెడ్డీ... నిన్ను చంపేస్తే ఏమవుతుంది అంటున్నాడు. మొన్న ఓ మీటింగ్ లో రాయి తీసుకుని కొట్టండి అనగానే, అదే రోజు సాయంత్రం జగన్ పై రాయితో కొట్టారు. చంద్రబాబు మాట్లాడే మాటలు సభ్యసమాజంలో ఉండదగిన విధంగా లేవు. రేపు ఎన్నికల్లో ప్రజలు దీనిపై తీర్పునిస్తారు. 

వందలకొద్దీ హామీలు గుప్పించిన చంద్రబాబు... జగన్ 750 హామీలు ఇచ్చాడని అంటున్నారు... ఆయనకు తలలో చిప్ ఉందో, పోయిందో అర్థం కావడంలేదు. 2014కి ముందు మేనిఫెస్టో పేరుతో 600కి పైగా హామీలు ఇచ్చింది చంద్రబాబే. 10 నిమిషాల్లోనే ఆ మేనిఫెస్టోను వెబ్ సైట్లోంచి తీసేశారు. 

ఇవాళ ఎవరితో అయితే పొత్తు పెట్టుకున్నాడో, ఆ రోజు కూడా వాళ్లతోనే పొత్తుపెట్టుకున్నాడు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని ప్రజలంతా చూశారు. రూ.87 వేల కోట్ల రుణమాఫీ అని చెప్పి ఆయన చేసింది ఐదేళ్లలో రూ.13 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్ల మధ్యనే. ఇక్కడే చంద్రబాబుకు జగన్ కు ఉన్న తేడా స్పష్టమవుతుంది. జగన్ ఏం చెబితే అంతవరకు కచ్చితంగా చేస్తారు... అంతకంటే ఎక్కువగా చేసే అవకాశం ఉంటే తప్పకుండా చేస్తారు. 

మేనిఫెస్టో అంటే ఇలా ఉండాలా...? లేక, ఎన్నికలకు ముందు మూడ్నాలుగు నెలల నుంచి ఊదరగొట్టి, మిమ్మల్ని అందలం ఎక్కిస్తామనేలా మేనిఫెస్టోలు ఉండాలా? ఎవరేంటనేది రేపు ఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తారు" అంటూ సజ్జల వ్యాఖ్యానించారు.

More Telugu News