KCR: తెలంగాణ సాధించిన వ్యక్తిని.. సీఎం రేవంత్ రెడ్డి దూషించవచ్చా?: కేసీఆర్

  • తెలంగాణలో మళ్లీ  బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని ధీమా
  • రోజుకు పదిసార్లు కరెంట్ పోతుందన్న కేసీఆర్
  • కాంగ్రెస్ పార్టీ ఇష్టారీతిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శ
KCR says revanth reddy abusing him

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పట్ల ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, తెలంగాణ సాధించిన వ్యక్తిని దూషించవచ్చా? అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు మద్దతుగా కేసీఆర్ రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి వ్యక్తి మళ్లీ దొరకరన్నారు. గురుకులాలను అద్భుతంగా తీర్చిదిద్దిన వ్యక్తి ఆర్ఎస్ అని ప్రశంసించారు.

ఇరవై నాలుగు గంటలు విద్యుత్ ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి, మంత్రులు చెబుతున్నారని... కానీ రోజుకు పదిసార్లు కరెంట్ పోతుందని విమర్శించారు. ఈరోజు శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో అన్నం తింటుంటే రెండుసార్లు కరెంట్ పోయిందన్నారు. మనం మిషన్ భగీరథతో బ్రహ్మాండంగా ఇంటింటికి నీళ్లు అందించామన్నారు. కానీ కాంగ్రెస్ పాలనలో మళ్లీ బోర్లు వేస్తున్నారని, నీళ్ల ట్యాంకర్లు వస్తున్నాయని విమర్శించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలను కాంగ్రెస్ ఎందుకు అమలు చేయలేకపోతోందని ప్రశ్నించారు. ఈరోజుకు తెలంగాణ పార్టీ పుట్టి 23 సంవత్సరాలయిందని... పిడికెడు మందితో ప్రారంభమైన పార్టీ తెలంగాణను సాధించిందన్నారు. తాను మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణను సాధించుకున్నామని గుర్తు చేశారు. తెలంగాణ సాధించాక బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలను కోడిపిల్లలను సాకుకున్నట్లు అభివృద్ధి చేసుకున్నామని పేర్కొన్నారు. పాలమూరును బాగా అభివృద్ధి చేసుకున్నామన్నారు. ఇక్కడి వరికోతలు, ధాన్యపురాశులు చూస్తే తనకు ఆనందం కలిగిందన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఇష్టారీతిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి మాట తప్పారన్నారు. ఆడబిడ్డకు రూ.2500, తులం బంగారం, అమ్మాయిలకు స్కూటీలు, వరికి రూ.500 బోనస్... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హామీలను పక్కన పెట్టారన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటలు విద్యుత్ ఇచ్చామని... ఇప్పుడు పవర్ కట్‌తో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ పాలనలో ఇప్పటికే 225 మంది రైతులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ మనకు అక్కరకు రాని చుట్టమన్నారు. బీజేపీ హయాంలో అన్ని ధరలు పెరిగాయని విమర్శించారు. తెలంగాణలో జరిగే ఎన్నికల కోసం గుజరాత్ ముఖ్యమంత్రి ఇక్కడకు రావాలా? అని ప్రశ్నించారు.

More Telugu News