Delhi Capitals: ముంబయిని ఊరించి చేజారిన విజయం... భారీస్కోర్ల మ్యాచ్ లో ఢిల్లీ విన్నర్

  • అరుణ్ జైట్లీ స్టేడియంలో పరుగుల వాన
  • ఢిల్లీ, ముంబయి ఇండియన్స్ మ్యాచ్ లో మొత్తం 504 పరుగుల నమోదు
  • మొదట 20 ఓవర్లలో 4 వికెట్లకు 257 పరుగులు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్
  • ఛేదనలో 9 వికెట్లకు 247 పరుగులు చేసిన ముంబయి
  • కేవలం 10 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం
DC beat MI by 10 runs in see saw thriller

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో పరుగుల వర్షం కురిసింది. ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్ మధ్య మ్యాచ్ లో మొత్తం 504 పరుగులు నమోదయ్యాయంటే బ్యాట్స్ మెన్ ఏ రేంజిలో వీరవిహారం చేశారో అర్థమవుతుంది. 

ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 10 పరుగుల తేడాతో విజయం సాధించినప్పటికీ, లక్ష్యానికి చేరువగా వచ్చిన ముంబయి ఇండియన్స్ కూడా తన పోరాటపటిమతో ఆకట్టుకుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 257 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్యఛేదనలో ముంబయి ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 247 పరుగులు నమోదు చేసింది. ఆఖర్లో టిమ్ డేవిడ్ అవుట్ కావడం ముంబయికి మ్యాచ్ ను దూరం చేసింది. 

ముంబయి ఇన్నింగ్స్ లో ఓపెనర్ ఇషాన్ కిషన్ 20, సూర్యకుమార్ యాదవ్ 26 పరుగులు  చేశారు. రోహిత్ శర్మ 8 పరుగులకే అవుటై నిరాశకు గురిచేశాడు. దాంతో ముంబయి ఇండియన్స్ 65 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. 

ఈ దశలో తిలక్ వర్మ, కెప్టెన్ హార్దిక్ పాండ్యా జోడి ఎదురుదాడికి దిగింది. హార్దిక్ పాండ్యా 24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 46 పరుగులు చేసి రసిక్ సలామ్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన నేహాల్ వధేరా (4) వెంటనే అవుటైనా... టిమ్ డేవిడ్ రూపంలో తిలక్ వర్మకు మంచి జోడీ దొరికింది. వీరిద్దరూ ఎడాపెడా బాదేయడంతో ముంబయి విజయం ఈజీనే అనిపించింది. 

అయితే, టిమ్ డేవిడ్ ను ముఖేశ్ కుమార్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో ముంబయికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టిమ్ డేవిడ్ 17 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 37 పరుగులు చేశాడు. ఆ తర్వాత తిలక్ వర్మ కూడా రనౌట్ కావడంతో ముంబయి ఆశలు అడుగంటాయి. 

తిలక్ వర్మ 32 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 63 పరుగులు చేశాడు. ఆఖర్లో నబీ (7), పియూష్ చావ్లా (10) పోరాడినా లక్ష్యఛేదన వారి శక్తికి మించిన పనైంది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో రసిక్ సలామ్ 3, ముఖేశ్ కుమార్ 3, ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు తీశారు. 

ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు

ఐపీఎల్ లో ఇవాళ డబుల్ హెడర్ నిర్వహిస్తున్నారు. రెండో మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు లక్నోలోని వాజ్ పేయి స్టేడియం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 5 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ 15, దీపక్ హుడా 13 పరుగులతో ఆడుతున్నారు.

More Telugu News