KCR: నేను భోజనం చేస్తుంటే రెండుసార్లు కరెంట్ పోయింది.. కేసీఆర్ ట్వీట్

  • తెలంగాణ రాష్ట్రంలో చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయన్న కేసీఆర్
  • గంట క్రితం శ్రీనివాస్ గౌడ్ నివాసంలో భోజనం చేస్తుండగా కరెంట్ పోయిందని వెల్లడి
  • కరెంట్ పోవడం లేదని ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ఊదరగొడుతున్నారని విమర్శ
KCR tweet about power cuts

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ ఎక్స్ ఖాతాను తెరిచిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మహబూబ్ నగర్‌లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో తాను భోజనం చేస్తుండగా రెండుసార్లు కరెంట్ పోయిందని పేర్కొన్నారు. ఎక్స్‌లో చేరిన తర్వాత ఆయన వరుసగా మూడు ట్వీట్లు పెట్టారు.

మొదట, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

తన బస్సు యాత్ర గురించి రెండో ట్వీట్ చేశారు. బస్సు యాత్రను దిగ్విజయం చేస్తున్న నాయకులకు, కార్యకర్తలకు, అభిమాన ప్రజలందరికీ అభినందనలు, ధన్యవాదాలు అని పేర్కొన్నారు. ఇదే ఊపుతో బస్సు యాత్రను ముందుకు కొనసాగిద్దామని... పార్లమెంటు ఎన్నికల్లో గొప్ప విజయం సాదిద్ధామని పిలుపునిచ్చారు.

మూడో ట్వీట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 'తెలంగాణ రాష్ట్రంలో చాలా చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. నేను గంట క్రితం మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి గారు, మరియు మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు రెండు సార్లు కరెంటు పోయింది. ప్రతి రోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కరెంటు పోవడం లేదని ఊదరగొడుతున్నారు. నాతోపాటు ఉన్న మాజీ శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాల్లో రోజుకు పదిసార్లు కరెంటు పోతున్నదని ఈ సందర్భంగా నాకు చెప్పారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలనా వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుంది? రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆలోచించాలి' అని ట్వీట్ చేశారు.

More Telugu News