KTR: మల్కాజ్‌గిరి నుంచి ఈటల గెలుస్తారన్న మల్లారెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్

  • మల్లారెడ్డి రాజకీయ అనుభవంతో అలా మాట్లాడారన్న కేటీఆర్
  • ఈటలను మునగచెట్టు ఎక్కించి కిందపడేయాలనేది వ్యూహమని వ్యాఖ్య
  • మల్లారెడ్డి మాటలోని అంతరార్థం తెలియక కొంతమంది ఆగమవుతున్నారన్న కేటీఆర్
KTR responds on Mallareddy comments on etala winning

మల్కాజ్‌గిరి లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుస్తారన్న ఎమ్మెల్యే మల్లారెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. పార్టీ ఆవిర్భావ వేడుక‌ల సంద‌ర్భంగా ఆయన తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. మ‌ల్లారెడ్డి త‌న రాజ‌కీయం అనుభవంతోనే ఈట‌ల‌పై అలాంటి వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ఈట‌ల రాజేంద‌ర్‌ను మున‌గ చెట్టు ఎక్కించి కింద ప‌డేయాల‌నేది మ‌ల్లారెడ్డి వ్యూహ‌మ‌న్నారు.

ఈ విష‌యంలో మ‌ల్లారెడ్డి త‌న రాజ‌కీయ అనుభ‌వాన్ని చాటుకున్నార‌ని కితాబునిచ్చారు. మ‌ల్కాజ్‌గిరిలో కచ్చితంగా గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే అన్నారు. ఆ విషయం ఈటల రాజేందర్‌కు కూడా తెలుసునన్నారు. మల్లారెడ్డి అన్న మాట అంతరార్థం తెలియక కొంతమంది ఆగమవుతున్నారని ఎద్దేవా చేశారు.

కొంతమంది నాయకులు స్వార్థం కోసం పార్టీని విడిచి వెళుతున్నారని విమర్శించారు. కానీ వారితో కార్యకర్తలు వెళ్లరని తెలిపారు. బీఆర్ఎస్‌లోనే తనకు గౌరవం ఉండేదని... పార్టీ మారిన తర్వాత ఈటల రాజేందర్ చెప్పిన మాటను అందరూ గుర్తుంచుకోవాలన్నారు. పార్టీ మారిన కేకే, రంజిత్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసునన్నారు.

కష్టకాలంలో పార్టీతో ఉన్నవాడే నాయకుడవుతాడన్నారు. పారిపోయిన వాళ్లు లీడర్లు ఎలా అవుతారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి ద్రోహం చేసి వెళ్లిన నాయకులను ఓడించేందుకు ఎక్కువగా కష్టపడతామన్నారు. వారందరినీ కచ్చితంగా ఓడిస్తామని... పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీని బలోపేతం చేస్తామన్నారు. పార్టీ శిక్షణ కార్యక్రమాలతో పాటు పార్టీ నిర్మాణంపైన దృష్టి సారిస్తామన్నారు.

More Telugu News