YS Viveka Murder Case: వివేకా భార్య సౌభాగ్యమ్మకు లేఖ రాసిన అవినాశ్ రెడ్డి తల్లి!

YS Lakshmi shot a letter to Viveka wife Sowbhagyamma

  • సీఎం జగన్ కు లేఖ రాసిన వివేకా భార్య సౌభాగ్యమ్మ
  • తండ్రి వైఎస్ చనిపోతే జగన్ ఎంత బాధపడ్డాడో అందరికీ తెలుసన్న సౌభాగ్యమ్మ
  • మరి తండ్రిని కోల్పోయిన సునీత బాధను ఎందుకు అర్థం చేసుకోవడంలేదని ప్రశ్న
  • జగన్ మనోవేదన ఇప్పుడు గుర్తొచ్చిందా అంటూ వైఎస్ లక్ష్మి లేఖ
  • నాడు జగన్ ను ఒంటరిని చేసిప్పుడు గుర్తుకురాలేదా అంటూ ఆగ్రహం

వివేకా భార్య సౌభాగ్యమ్మ సీఎం జగన్ కు లేఖ రాయడం తెలిసిందే. మన కుటుంబంలోని వారే వివేకా హత్యకు కారణం కావడం తనను తీవ్ర మనోవేదనకు గురిచేస్తోందని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. 

2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు కొడుకుగా జగన్ ఎంత మనోవేదన అనుభవించాడో అందరికీ తెలుసని, మరి 2019లో తండ్రిని కోల్పోయిన సునీత కూడా ఇదే రీతిలో మనోవేదన అనుభవించి ఉంటుందని ఎందుకు గుర్తించలేకపోతున్నారని సౌభాగ్యమ్మ తన లేఖలో ప్రస్తావించారు. 

వివేకాను చంపిన వారికి, చంపించినవారికి నువ్వు మద్దతుగా ఉండడం ఏంటని సీఎం జగన్ ను ప్రశ్నించారు. నువ్వు సీఎం కావాలని తపించిన చిన్నాన్నను కిరాతకంగా హత్య చేస్తే, ఆ ఘటనను అంత తేలిగ్గా ఎలా తీసుకుంటున్నావని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

కాగా, సీఎం జగన్ కు వివేకా భార్య సౌభాగ్యమ్మ లేఖ రాయడంపై వైఎస్ భాస్కర్ రెడ్డి అర్ధాంగి, అవినాశ్ రెడ్డి తల్లి వైఎస్ లక్ష్మి ఘాటుగా స్పందించారు. సౌభాగ్యమ్మకు లక్ష్మి ఓ లేఖాస్త్రం సంధించారు. 

2009లో తండ్రిని కోల్పోయినప్పుడు జగన్ ఎంత బాధపడ్డాడో ఇప్పుడు గుర్తొస్తోందా? 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ ను చిన్నచూపు చూసినప్పుడు పెద్ద దిక్కుగా నిలవాల్సిన మీరందరూ ఎక్కడున్నారు? మీరందరూ మీ స్వార్థం మీరు చూసుకుని జగన్ ను ఒంటరివాడ్ని చేసిప్పుడు అతడి మనోవేదన గుర్తుకురాలేదా? అని వైఎస్ లక్ష్మి నిలదీశారు. 

అంతేకాదు, 2011లో విజయమ్మపై వివేకాను పోటీ చేయించినప్పుడు జగన్ మనోవేదన గుర్తుకురాలేదా? జగన్ ను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకున్నది ఎంత వాస్తవమో, 2019 మార్చి 14వ తేదీ రాత్రి అవినాశ్ రెడ్డిని ఎంపీగా గెలిపించమంటూ వివేకా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం అంతే వాస్తవం అని వైఎస్ లక్ష్మి వివరించారు. 

"ఈ విషయం మీ కుమార్తె సునీత కూడా వెల్లడించింది. కానీ ఇప్పుడు మాట మార్చుతూ, ఎంపీ టికెట్ కోసమే హత్య జరిగిందని అంటున్నారని మండిపడ్డారు. వైఎస్సార్, జగన్ ప్రత్యర్థులతో మీ కుమార్తె చేతులు కలిపి వారి చేతుల్లో పావుగా మారితే జగన్ మీకు ఏ విధంగా మద్దతు ఇస్తాడు? ఏమాత్రం సంబంధం లేని వాళ్లను ఈ కేసులో ఇరికించాలని ప్రయత్నిస్తుంటే జగన్ మీకు మద్దతు ఇవ్వాలా? 

హత్యకు కారకులు మీతోనే ఉన్నారు... దొంగే దొంగను పట్టుకోమంటే దొంగ ఎప్పటికి దొరుకుతాడు? కోర్టులో కేసు నడుస్తుంటే, హంతకుడు అంటూ మీరే మాట్లాడతారు. ఇప్పటికైనా నీ కుమార్తె సునీత, షర్మిల... జగన్ ప్రత్యర్థుల కుట్ర నుంచి బయటికి వచ్చి న్యాయపోరాటం చేయాలి. మీరు చేస్తున్న ఆరోపణల వల్ల బాధపడుతున్న వారి వేదనను అర్థం చేసుకోండి... నిజం తప్పకుండా బయటికి వస్తుంది" అంటూ వైఎస్ లక్ష్మి తన లేఖలో పేర్కొన్నారు. 

వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి, ఆయన తనయుడు అవినాశ్ రెడ్డి కూడా విచారణ ఎదుర్కొంటుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వైఎస్ లక్ష్మి ఈ లేఖ రాశారు.

YS Viveka Murder Case
Sowbhagyamma
YS Lakshmi
Jagan
YS Bhaskar Reddy
YS Avinash Reddy
YSRCP
  • Loading...

More Telugu News