princess diana: వేలంలో భారీ ధర పలకనున్న ప్రిన్సెస్ డయానా తొలి వర్క్ కాంట్రాక్ట్

  • సుమారు రూ. 8.3 లక్షలు లభిస్తాయని వేలం సంస్థ అంచనా
  • 17 ఏళ్ల వయసులో 1979లో ఉద్యోగం కోసం డాక్యుమెంట్ పై సంతకం చేసిన డయానా
  • వెంటనే ఉద్యోగం లభిస్తుందనే ఉద్దేశంతో ఆమె వయసును ఒక ఏడాది పెంచి చూపి ఉండొచ్చన్న బీబీసీ
Princess Dianas FirstEver Work Contract Expected to Fetch

ప్రిన్సెస్ డయానా నాటి వేల్స్ యువరాజుతో పెళ్లికి రెండేళ్ల ముందు ఉద్యోగం కోసం సంతకం చేసిన తొలి వర్క్ కాంట్రాక్ట్ డాక్యుమెంట్ భారీ ధర పలకనుంది. యూకేలో జరగనున్న వేలంలో దీనికి సుమారు రూ. 8.3 లక్షల ధర పలకొచ్చని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. 17 ఏళ్ల వయసులో 1979లో డయానా స్పెన్సర్ పేరిట ఆమె ఈ పత్రాన్ని నింపి సంతకం చేసింది. ఇది నల్ల ఇంక్ తో పూరించినట్లు కనిపిస్తోంది. సాల్వ్ యువర్ ప్రాబ్లమ్ లిమిటెడ్ అనే ఏజెన్సీ తరఫున డయానా ఈ డాక్యుమెంట్ ను సమర్పించింది. బీబీసీ కథనం ప్రకారం అందులో డయానా తన డేట్ ఆఫ్ బర్త్ ను కావాలనే 1961కి బదులు 1960 అని రాసింది. అలా చేయడం వల్ల వెంటనే ఉద్యోగం లభిస్తుందని లేదా ఎక్కువ మొత్తం సంపాదించొచ్చని డయానా భావించి ఉంటారని బీబీసీ పేర్కొంది.

“మొట్టమొదటి ఉద్యోగం సంపాదించడం ఎవరి జీవితంలోనైనా గొప్ప విషయమే. 20వ శతాబ్దంలో ప్రపంచంలోకెల్లా అత్యంత గుర్తింపు పొందిన వారిలో ఒకరిగా ఆ వ్యక్తి గుర్తింపు సాధించడమనే విషయాన్ని పక్కన పెట్టినా ఇదో గొప్ప సందర్భం” అని ఈ డాక్యుమెంట్ ను వేలం వేయనున్న ఆక్షనియం లిమిటెడ్ ప్రతినిధి ఆడ్రూ స్టోవ్ తెలిపారు. ఈ డాక్యుమెంట్ ను దివంగత యువరాణి తొలి అధికారిక వర్క్ కాంట్రాక్ట్ గా భావిస్తున్నామని చెప్పారు. 

డయానా పుట్టిన తేదీలో మార్పు గురించి ఆయన స్పందించారు. “దీన్ని కావాలనే ఆమె చేసి ఉంటుందని మా క్లయింట్ కు చెప్పారు. పుట్టిన సంవత్సరాన్ని మార్చడం వల్ల వయసులో ఓ ఏడాది పెద్దగా ఆమె కనిపించే అవకాశం ఉండేది. దీనివల్ల ఆమెకు ఆ ఏజెన్సీ నుంచి ఉద్యోగం పొందే అవకాశం ఎక్కువగా ఉంది. లేదా కనీసం ఎక్కువ జీతం పొందేందుకు ఆమె ఇలా చేసి ఉండొచ్చు. లేకపోతే అది పొరపాటు కూడా అయ్యి ఉండొచ్చు”అని స్టోవ్ అభిప్రాయపడ్డారు.

అయితే ఈ కాంట్రాక్ట్ లో ఎలాంటి పని కోసం వెతుకుతున్నానో లేదా ఎంత జీతం ఆశిస్తున్నానో డయానా డాక్యుమెంట్ లో పేర్కొనలేదు. వీలైనంత త్వరగా ఉద్యోగం కావాలని మాత్రమే కోరుకున్నారు. లండన్ కు మారే కొన్ని వారాల ముందే ఆమె ఆ డాక్యుమెంట్ ను నింపారు. అందులో తన చిరునామాను కాడొగన్ ప్లేస్ ఎస్ డబ్ల్యూ1గా పేర్కొన్నారు. కెన్సింగ్టన్ లోని తన సొంత ఫ్లాట్ కోల్ హెర్న్ కోర్ట్ కు మారే కొన్ని నెలల ముందు తాత్కాలికంగా ఆమె అక్కడ నివసించారు.

నానీ, చైల్డ్ కేరర్ లాంటి స్వల్పకాల ఉద్యోగాలు చేసేందుకు ఆమె సంతకం చేసిన వర్క్ కాంట్రాక్ట్ గా ఆ డాక్యుమెంట్ ను భావిస్తున్నారు. అంతకుముందు ఆమె అనధికారికంగా తన స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం పనిచేసేవారు.

తన చారిటీ పనులు, వ్యక్తిగత జీవితం ద్వారా డయానా ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణగల మహిళల్లో ఒకరిగా నిలిచారు. 1997 ఆగస్టులో జరిగిన ఓ కారు ప్రమాదంలో ఆమె దుర్మరణం చెందారు. అప్పటికి ఆమె కుమారులు ప్రిన్స్ విలియం వయసు 15 ఏళ్లుకాగా చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ వయసు 12 ఏళ్లు.

More Telugu News