Raghunandan Rao: రేవంత్ రెడ్డి గారూ... నయవంచన అంటే ఇదీ...: రఘునందన్ రావు చురకలు

Raghunandan Rao fires at congress and revanth reddy

  • పెన్షన్ రూ.4వేలు చేస్తానని ఓట్లేయించుకొని మోసం చేయడాన్ని నయవంచన అంటారని ఎద్దేవా
  • ఇప్పటి వరకు రుణమాఫీ చేయకపోవడాన్ని నయవంచన అంటారని వ్యాఖ్య
  • దేశంలో పేద ప్రజలను వంచించిన పార్టీ కాంగ్రెస్ అని ఆగ్రహం
  • తనను ఓడించేందుకు రేవంత్ రెడ్డి, హరీశ్ రావు కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపణ

రూ.2 వేలుగా ఉన్న పెన్షన్‌ను ఓట్ల కోసం రూ.4 వేలు చేస్తానని చెప్పి... ఓట్లేయించుకున్న తర్వాత హామీ నెరవేర్చకుండా... ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి చేసింది నయవంచన అని మెదక్ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సిద్దిపేటలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ... ఈరోజు గాంధీ భవన్‌లో 'నయవంచన' అంటూ బోర్డు పెట్టుకొని రేవంత్ రెడ్డి బీజేపీపై విమర్శలు గుప్పించాడని... కానీ నయవంచన పదానికి పర్యాయపదమే కాంగ్రెస్ అన్నారు. ప్రజలను మోసం చేసిన మీది నయవంచన అన్నారు.

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశంలోని మెజార్టీ ప్రజలను వంచించింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు.  'నేను సిద్దిపేట గడ్డమీది నుంచి రేవంత్ రెడ్డిని అడుగుతున్నా... డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తానని చెప్పావు... కానీ అయిందా.. ఇప్పటి వరకు కాలేదు. దీనినే నయవంచన అంటారు. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణం చేసి నాలుగు నెలలు అయినా రుణమాఫీ చేయలేదు చూడు.. దీనిని నయవంచన అంటారు రేవంత్ రెడ్డిగారు' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.4వేల పెన్షన్ ఇస్తానని ఇప్పటికీ ఇవ్వలేదని... దీనినే నయవంచన అంటారన్నారు. ఈ దేశంలో పేద ప్రజలను వంచించిన పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు.

పేదింటి ఆడబిడ్డకు రూ.2500 ఇస్తామని చెప్పారని... ఈరోజు వరకు దానిని ఇవ్వలేదని ఇదే నయవంచన అని ఎద్దేవా చేశారు. బీజేపీ మాత్రం ప్రజలను ఎప్పుడూ మోసం చేయలేదన్నారు. కాంగ్రెస్ మాట్లాడితే హామీ అంటారని... కానీ మోదీ మాత్రం గ్యారెంటీ అంటారని పేర్కొన్నారు.

ఇటీవల రేవంత్ రెడ్డి మెదక్ వచ్చినప్పుడు ఏదిపడితే అదే మాట్లాడారని మండిపడ్డారు. తనకు ఇక్కడ గడీలు ఉన్నాయని రేవంత్ రెడ్డి విమర్శించారని... కానీ మా అమ్మానాన్న ఉండే గడీలను రేవంత్ రెడ్డి పేరిట రాసిచ్చేందుకు సిద్ధమని తాను అప్పుడే చెప్పానన్నారు. రైతువేదిక, వైకుంఠధామం... ఇలా అన్నింటికి డబ్బులు ఇచ్చింది మోదీయే అన్నారు. మోసం, నయవంచనకు పర్యాయపదం కాంగ్రెస్ అన్నారు. మెదక్‌లో తన గెలుపును ఆపేందుకు రేవంత్ రెడ్డి, హరీశ్ రావులు ఒక్కటై విమానాల్లో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వారి కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలను కోరారు. మెదక్ జిల్లాకు మోదీ ఏం చేశారో చెప్పేందుకు తాను సిద్ధమన్నారు. అంతేకాదు మోదీ ఇచ్చిన నిధులకు సంబంధించి తాను పుస్తకాన్ని టైప్ చేయించి సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ చేశానన్నారు.

1985లో నిమ్మ నర్సింహారెడ్డి గారు బీజేపీ నుంచి పోటీ చేస్తే 19వేల ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. నాలుగు దశాబ్దాల క్రితమే బీజేపీకి ఇక్కడ మంచి ఓట్లు వచ్చాయన్నారు. బుల్లెట్లకు ఎదురొడ్డి నిలబడ్డ కాషాయ గడ్డ దుబ్బాక అన్నారు. ఇంత గొప్ప చరిత్ర దుబ్బాకకు ఉందన్నారు. ఇప్పటికే భారత ఆర్థిక వ్యవస్థను 5వ స్థానానికి తీసుకు వచ్చారని... 2047 వరకు భారత్‌ను విశ్వగురువుగా చేసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారన్నారు.

నరేంద్రుడి నాయకత్వంలో 500 సంవత్సరాలుగా ఉన్న రాములోరికి ఇప్పుడు గుడి కట్టుకున్నామన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరూ మోదీ మరోసారి గెలవాలని... 400 సీట్లు రావాలని కోరుకుంటున్నారన్నారు. మోదీ మరోసారి గెలిస్తే రాజ్యాంగం మారుస్తారని... రిజర్వేషన్లు తొలగిస్తారని మొరుగుడు ప్రారంభించారని... కానీ ఈడబ్లుఎస్ రిజర్వేషన్లు కూడా మోదీ ఇచ్చారన్నారు. అలాంటి మోదీ రిజర్వేషన్లు తొలగించే వ్యక్తి కాదన్నారు. 27 మంది బీసీలను కేంద్రమంత్రులుగా చేసిన ఘనత మోదీదే అన్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డిలు తమ కేబినెట్లో ఇద్దరు బీసీలకు మాత్రమే మంత్రి పదవులు ఇచ్చారని విమర్శించారు.

Raghunandan Rao
BJP
Lok Sabha Polls
Revanth Reddy
Congress
  • Loading...

More Telugu News