Mehul Prajapati: కెనడాలో ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి... భారతీయ డేటా సైంటిస్ట్‌కు ఊస్టింగ్

Indian origin data scientist in Canada fired for raiding food banks
  • కెనడాలోని టీడీ బ్యాంకులో డేటా సైంటిస్టుగా మేహుల్ ప్రజాపతి
  • మంచి జీతం ఉన్నా ఫుడ్ బ్యాంకుల నుంచి ఉచిత ఫుడ్స్ తీసుకున్న వైనం
  • ఉచిత ఆహారంతో వందల డాలర్లు పొందుపుచేశానంటూ వీడియో
  • వీడియో వైరల్ కావడంతో విమర్శలు
  • బీదల ఆహారం దోపిడీ చేసినందుకు ఉద్యోగం నుంచి తొలగింపు 
కెనడాలో ఉచిత ఆహారం కోసం కక్కుర్తి పడ్డ ఓ భారతీయుడు చివరకు తన ఉద్యోగం ఊడగొట్టుకున్నాడు. బీదలు, విద్యార్థుల కోసం ఉద్దేశించిన ఫుడ్‌తో భారీగా డబ్బు పొదుపు చేశానంటూ అతడు చేసిన వీడియో చివరకు భస్మాసురహస్తంగా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే, మేహుల్ ప్రజాపతి ఓ డేటా సైంటిస్ట్. కెనడాలోని టీడీ బ్యాంకులో పనిచేస్తున్నాడు. అతడి జీతం ఏడాదికి 98 వేల డాలర్లు. జీవితంలో ఉన్నతస్థితికి చేరుకున్న మేహుల్.. తాను ఉచిత ఆహారంతో ఎంత డబ్బు పొదుపు చేసిందీ చెబుతూ ఓ వీడియో చేశాడు. స్థానికంగా అందుబాటులో ఉన్న ఫుడ్ బ్యాంకుల నుంచి ఆహారం, పచారీ సామాన్లు తీసుకుంటూ వందల కొద్దీ డాలర్లు పొదుపు చేసినట్టు అతడు గర్వంగా చెప్పుకొచ్చాడు. బీదసాదలు, విద్యార్థులను ఆదుకునేందుకు విదేశాల్లో స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు ఫుడ్ బ్యాంక్స్ ఏర్పాటు చేస్తుంటాయి. ఆర్థికకష్టాల్లో ఉన్నవాళ్లు ఇక్కడి ఆహారంతో కడుపునింపుకుంటూ ఉంటారు. స్థానికులు చాలా మంది ఫుడ్ బ్యాంక్స్‌కు వెళ్లడం అవమానంగా భావిస్తారు. విధిలేని పరిస్థితుల్లోనే ఫుడ్ బ్యాంక్స్‌ను ఆశ్రయిస్తారు. 

మంచి ఆదాయం ఉండి కూడా మేహుల్ ఫుడ్ బ్యాంకును ఆశ్రయించడం అనేక మందికి కోపం తెప్పించింది. పేదల కోసం ఉద్దేశించిన ఫుడ్‌ను దొంగిలిస్తున్నాడంటూ అతడిని తిట్టిపోశారు. ఇంతటి సిగ్గుమాలిన పని చేయడం తామెప్పుడూ చూడలేదని అన్నారు. విషయం వైరల్ కావడంతో మేహుల్ పనిచేస్తున్న బ్యాంకు అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ విషయాన్ని ఓ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేసింది. దీంతో, మేహుల్‌కు తగిన శాస్తి జరిగిందంటూ పలువురు హర్షం వ్యక్తం చేశారు. కొందరు మాత్రం అతడి పరిస్థితిపై జాలి పడ్డారు. తెలిసో తెలియకో ఉచిత ఫుడ్ కోసం, వ్యూస్ కోసం కక్కుర్తి పడి చివరకు పరువు పోగొట్టుకున్నాడంటూ విచారం వ్యక్తం చేశారు.
Mehul Prajapati
Canada Foods banks
Free Food
Data Scientist

More Telugu News