NASA: “హాయ్.. నేనే”.. 2,400 కోట్ల కి.మీ. దూరం నుంచి నాసాకు వోయేజర్‌‌–1 సందేశం

  • కొన్ని నెలల మౌనం తర్వాత మళ్లీ స్పందించిన స్పేస్ క్రాఫ్ట్
  • 46 ఏళ్ల నాటి మెమొరీ చిప్ ను కోడింగ్ ద్వారా సరిచేసిన నాసా సైంటిస్టులు
  • 2012 నుంచి ఇంటర్ స్టెల్లార్ మీడియంలో ప్రయాణిస్తున్న వోయేజర్–1
Hi Its Me NASA Voyager 1 Phones Home From 15 Billion Miles Away

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా.. అనంత విశ్వంలోని రహస్యాలను తెలుసుకొనేందుకు 1977లో ప్రయోగించిన వోయేజర్–1 స్పేస్ షిప్ కొన్ని నెలల మౌనం తర్వాత మళ్లీ స్పందించింది. భూమికి సుమారు 2,400 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి “హాయ్.. నేనే వీ1ను” అంటూ నాసాకు సందేశం పంపింది. నాసా గ్రౌండ్ కంట్రోల్ సెంటర్ కు సమాచారాన్ని చేరవేసింది. ఈ విషయాన్ని నాసా వోయేజర్–1 ‘ఎక్స్’ హ్యాండిల్ ద్వారా ప్రకటించింది.

గత 46 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణిస్తున్న వోయేజర్–1 2023 నవంబర్ 14 తర్వాత కంట్రోల్ సెంటర్ కు సమాచారం పంపడం ఆపేసింది. కానీ స్పేస్ షిప్ కంట్రోలర్ల నుంచి ఆదేశాలు స్వీకరిస్తూనే ఉంది. వోయేజర్–1లోని ఒక మెమొరీ చిప్ సరిగ్గా పనిచేయకపోవడమే ఇందుకు కారణమని నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ బృందాలు ఈ ఏడాది మార్చిలో గుర్తించాయి. ఆ చిప్ ను కోడింగ్ ద్వారా సరిచేశాయి. దీంతో అది తిరిగి సమాచారం పంపడం మొదలు పెట్టింది. “వోయేజర్–1 కీలక డేటాను తిరిగి పంపుతోంది. దాని ప్రస్తుత పనితీరు గురించి వివరించడంతోపాటు అందులోని పరికరాలు ఎలా పనిచేస్తున్నాయో సమాచారం పంపింది. ఇక తదుపరి అడుగు స్పేస్ క్రాఫ్ట్ సేకరించిన సైన్స్ డేటాను పంపేలా చేయడమే” అని నాసా తెలిపింది.

విశ్వాంతరాల్లోకి నిరంతరాయంగా ప్రయాణం
వోయేజర్–1 2012లో ఇంటర్ స్టెల్లార్ మీడియం (నక్షత్రాల మధ్య ఉండే ప్రదేశం)లోకి ప్రవేశించింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి మానవ నిర్మిత స్పేస్ క్రాఫ్ట్ గా రికార్డు సృష్టించింది. ప్రస్తుతం వోయేజర్–1 భూమికి సుమారు 2,400 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. భూమి నుంచి పంపే సందేశాలు వోయేజర్–1కు చేరడానికి ఏకంగా 22.5 గంటల సమయం పడుతోంది. వోయేజర్–1 కవల సోదరుడు, 1977లోనే నాసా ప్రయోగించిన వోయేజర్–2 సైతం 2018లో మన సౌర వ్యవస్థను దాటి ప్రయాణిస్తోంది.

గ్రహాంతరవాసులకు మేమున్నామని చెప్పే సమాచారం వోయేజర్లలో నిక్షిప్తం
రెండు వోయేజర్ స్పేస్ క్రాఫ్ట్ లలోనూ ‘గోల్డెన్ రికార్డ్స్’ ఉన్నాయి. అంటే మన ప్రపంచం తాలూకు కథను గ్రహాంతరవాసులకు తెలియజెప్పేందుకు వీలుగా బంగారు పూత పూసిన 12 అంగుళాల రాగి డిస్క్ లను వాటిలో ఏర్పాటు చేశారు.  ఆ డిస్క్ లలో మన సౌర వ్యవస్థ మ్యాప్, స్పేస్ క్రాఫ్ట్ ప్రయాణ ప్రారంభ తేదీని గ్రహాంతరవాసులు ఎవరైనా తెలుసుకొనేలా రేడియోధార్మికతగల గడియారం, ఆ డిస్క్ లను ఎలా ఆన్ చేయాలో సూచించే చిహ్నాలతో కూడిన సందేశాలు ఉన్నాయి. వోయేజర్ స్పేస్ క్రాఫ్ట్ లలోని పవర్ బ్యాంకులు 2025 తర్వాత ఎప్పుడైనా క్షీణించే అవకాశం ఉందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత  రెండు వోయేజర్లు పాలపుంతలో నిశ్సబ్దంగా ప్రయాణం సాగించనున్నాయి.

More Telugu News