Pawan Kalyan: నాపై వంగా గీత పోటీ చేస్తున్నా... నా పోటీ మాత్రం అతడిపైనే: పవన్ కల్యాణ్

  • కాకినాడ జిల్లా ఉప్పాడలో వారాహి సభ
  • ఈ సీఎం వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నాడని పవన్ ఆగ్రహం
  • జగన్ ఏమైనా లాల్ బహదూర్ శాస్త్రా? అంటూ వ్యాఖ్యలు 
Pawan Kalyan speech in Uppada

జనసేనాని పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లా ఉప్పాడలో వారాహి విజయభేరి సభకు హాజరయ్యారు. ఇవాళ తాను పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశానని చెప్పారు. తన ప్రసంగంలో సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

తాను ప్రజల సమస్యలపై మాట్లాడుతుంటే, ఈ సీఎం వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తాడని మండిపడ్డారు. మహిళలు ఆలోచించాలని, మహిళలను అగౌరవపరిచే సంస్కృతి జగన్ ది అని విమర్శించారు. ఆఖరికి తన సొంత చెల్లి షర్మిలను కూడా అవమానించాడని, రేపు మన ఆడబిడ్డలను కూడా అవమానిస్తాడని అన్నారు. 

"జగన్ ఏమైనా లాల్ బహదూర్ శాస్త్రి గారా? లేక వాజ్ పేయి గారా? ఐదేళ్లుగా బెయిల్ మీద బయటున్న వ్యక్తి జగన్. సొంత చెల్లి జీవితాన్ని రోడ్డుపైకి లాగిన వ్యక్తి జగన్... తన సొంత మనుషులతో చెల్లిని తిట్టించిన వ్యక్తి... 30 వేల మంది మహిళలు అదృశ్యమైతే మాట్లాడని వ్యక్తి జగన్. 

ఇవాళ నేను ఒక పెద్ద హీరో స్థాయిలో ఉన్నాను. సినిమాల్లోనే కాదు ప్రకటనల్లో నటించి కూడా కోట్లు సంపాదించగలను. కానీ సంపాదన కంటే నాకు ప్రజల సమస్యలపై మాట్లాడడమే ఇష్టం. నా నాలుగో పెళ్లాం జగన్ ఈ మధ్య నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నాడు. 

నా వ్యక్తిగత జీవితం అందరికీ తెలిసిందే. నా పర్సనల్ లైఫ్ గురించి ఏనాడూ అబద్ధాలు చెప్పలేదు. ఇబ్బందులు వచ్చాయి... విడిపోయాం... ఎవరి జీవితం వారు చూసుకుంటున్నాం. ఒకరు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని బిడ్డతో ఉన్నారు. మరొకరు బిడ్డల భవిష్యత్ చూసుకుంటున్నారు. రాజకీయాలతో సంబంధం లేని వారి గురించి మాట్లాడకూడదు అనే సంస్కారం లేని వ్యక్తి జగన్.

ఈ రోజు మంగళవారం... పౌర్ణమి... చిత్త నక్షత్రం... హనుమాన్ జయంతి... పైగా శ్రీపాద వల్లభుడి నక్షత్రం ఇది... ఇలాంటి రోజున 70 వేల మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నా  నామినేషన్ ను విజయవంతం చేశారు. అందుకు పిఠాపురం ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. టీడీపీ ఇన్చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ తన గెలుపు కోసం కష్టపడినట్టుగా నా కోసం శ్రమిస్తున్నారు... ఎన్డీయే కూటమి ఎంత బలంగా ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం. 

ఓవైపు సముద్రతీరం... మరోవైపు పచ్చని పంటపొలాలు.. గుండెల్లో పెట్టుకునే యువత... ఇన్ని ఉండి కూడా పిఠాపురం ఇంకా వెనుకబడి ఉండడం నాకు నచ్చలేదు. ఊర్ల కోసం రోడ్లు వేయడం చూశాను కానీ, రోడ్ల కోసం ఊర్లు తీసేయడం చూడలేదు అని వకీల్ సాబ్ సినిమాలో డైలాగ్ పెట్టడానికి కారణం... ఎస్ఈజెడ్ లు. 

అభివృద్ధి చేస్తాం అని ప్రజల నుంచి భూములు తీసుకుంటున్నారు. అభివృద్ధి చేయకుండా, ఉపాధి కల్పించకుండా భూములు లాగేసుకుంటున్నారు. దశాబ్దకాలం పాటు ఏ పదవి లేకుండా, ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా వెళ్లిపోయినా రాజకీయ పార్టీ నడిపింది ఈ దేశంలో నేనొక్కడినే. గత పదేళ్లుగా నా శ్రమనంతా రాష్ట్ర క్షేమం కోసం వెచ్చించాను. 

ఇక్కడి అరబిందో సంస్థ మన పార్టీకి విరాళం ఇస్తామని చెప్పినా నేను తీసుకోలేదు. కానీ ఇక్కడి ప్రజలకు న్యాయం జరగాలి... న్యాయం చేయాల్సిన బాధ్యత భూములు తీసుకున్న వారిపై ఉందన్న ఉద్దేశంతో ఆ విరాళం తీసుకోలేదు. నేను సోషలిస్టును... నేను వకీల్ సాబ్ లో చెప్పిందే నా జీవిత విధానం. 

ఇవాళ నాపై వంగా గీతను పోటీకి పెట్టి ఉండొచ్చు... కానీ నా పోటీ మాత్రం జగన్ పైనే. పిఠాపురంలో నన్ను గెలిపించండి... ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి అనేలా, దేశమంతా పిఠాపురం వైపు చూసేలా చేస్తాను. ఇక్కడి మత్స్యకారులకు న్యాయం జరగాలంటే, బలమైన గొంతుక వినిపించే ఉదయ్ శ్రీనివాస్ ను లోక్ సభకు పంపించాలి. 

ఉప్పాడ చీరకు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చే బాధ్యతను మేం స్వీకరిస్తాం. ఇక్కడ ఇంత సముద్ర తీరం ఉన్నా సాయంత్రం వేళ నడవడానికి పర్యాటక ప్రాంతంగా లేదు. మమ్మల్ని గెలిపించండి... అద్భుతమైన బీచ్ కారిడార్ గా తయారుచేస్తాను. పిఠాపురంను సర్వమత పర్యాటక ప్రాంతంగా ప్రపంచానికి పరిచయం చేస్తాను. మత్స్యకారుల సమస్యలు, చేనేత కార్మికుల కష్టాలు అసెంబ్లీలో వినిపిస్తాను. మీ సమస్యల పరిష్కారం నేను... మీ చేతిలో ఆయుధం నేను. 

ఇక్కడ రూ.422 కోట్లతో హార్బర్ కట్టకుండా మీ పొట్ట కొట్టాడు జగన్. 41 మంది సాక్షి ఉద్యోగులను సలహాదారులుగా చేసి, మీ హార్బర్ కు ఇవ్వాల్సిన డబ్బులు వారికి ఇస్తున్నాడు. సాక్షి పేపర్ కు వందల కోట్ల వ్యయంతో ప్రకటనలు ఇస్తున్నాడు... మీ హార్బర్ కు రూ.422 కోట్లు ఇవ్వలేడా? 

వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి వంగా గీత వస్తే అడగండి... రూ.330 కోట్లు సాక్షి పేపర్ కు ఇచ్చారు... కనీసం రూ.100 కోట్లు మా జెట్టీ నిర్మాణానికి ఎందుకు ఇవ్వరు? అని అడగండి. కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ అర్ధరాత్రి పూట రావడం కాదు... దమ్ముంటే మధ్యాహ్నం పూట వచ్చి ఓట్లు అడగాలి. 

నాకు కేంద్రం పెద్దలతో సత్సంబంధాలు ఉన్నాయి. రేపు మన ఉదయ్ శ్రీనివాస్ జనసేన ఎంపీగా గెలిస్తే నేరుగా వెళ్లి ప్రధాని మోదీ, అమిత్ షాలను కలవగలడు. కానీ, ఈ చలమలశెట్టి సునీల్ కాదు కదా, జగన్ కు కూడా వారి అపాయింట్ మెంట్ దొరకదు"  అంటూ పవన్ కల్యాణ్ విమర్శనాస్త్రాలు సంధించారు.

  • Loading...

More Telugu News