Raghunandan Rao: ఫోన్ ట్యాపింగ్‌పై నా ఆరోపణలు నిజమయ్యాయి... మొదటి బాధితుడు రేవంత్ రెడ్డే: రఘునందన్ రావు

  • ఫోన్ ట్యాపింగ్‌పై ముఖ్యమంత్రి సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్
  • ట్యాపింగ్ మొదటి ముద్దాయి కేసీఆర్... రెండో ముద్దాయి నాటి హోంమంత్రి అని ఆరోపణ
  • కామారెడ్డిలో గెలవని కేసీఆర్ 17 లోక్ సభ స్థానాల్లో గెలిపిస్తాడా? అని ఎద్దేవా
Raghunandan Rao says phone tapping first victim was revanth reddy

బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు తాను చాలాసార్లు చెప్పానని... ఈ ఫోన్ ట్యాపింగ్ మొట్టమొదటి బాధితుడు కూడా నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డియేనని మెదక్ లోక్ సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. మంగళవారం ఆయన ఎన్టీవీ 'క్వశ్చన్ అవర్'లో మాట్లాడుతూ... ఫోన్ ట్యాపింగ్ విషయంలో తాను చేసిన ఆరోపణలు నిజం అయ్యాయన్నారు. ఫోన్ ట్యాపింగ్‌పై ముఖ్యమంత్రి సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.

సీబీఐ, ఈడీ వంటి దర్యాఫ్తు సంస్థలపై ఒత్తిడి చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ మొదటి ముద్దాయి కేసీఆర్ అని... రెండో ముద్దాయి నాటి హోంమంత్రి అని ఆరోపించారు. నాటి డీజీపీ, హోంమంత్రిని ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయడం లేదో చెప్పాలని నిలదీశారు. తన ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని మండిపడ్డారు. ఇతర పార్టీల అభ్యర్థుల్లా తన వద్ద వేల కోట్ల రూపాయలు లేవన్నారు. హరీశ్ రావుకు అసలు మెదక్ జిల్లాతో సంబంధం లేదన్నారు.

కామారెడ్డిలో గెలవని కేసీఆర్ ఇక తన పార్టీని 17 లోక్ సభ స్థానాల్లో గెలిపిస్తాడా? అని ఎద్దేవా చేశారు. కరీంనగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తిని బీఆర్ఎస్ తీసుకొచ్చి మెదక్ ప్రాంతంపై రుద్దడం ఎందుకు? అని ప్రశ్నించారు. తాము శ్రీరాముడి పేరుతో ఓట్లు అడిగితే తప్పేమిటని ప్రశ్నించారు. మోదీ హయాంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారన్నారు. మోదీ ప్రభుత్వం జరిగిన రైతు ఉద్యమంపై మాట్లాడుతూ కేవలం పంజాబ్, హర్యానాలో మాత్రమే రైతులు ఉన్నారు కానీ ఇతర రాష్ట్రాల్లో లేరా? అని విమర్శించారు.

జూన్ 4వ తేదీన కమలం వికసించబోతుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను ఇంటికి పంపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టే బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ప్రచారం చేస్తున్నారని... కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. తాము తమ ఓటింగ్ శాతాన్ని 7 నుంచి 14కు పెంచామన్నారు. అలాగే 2019లో ఒక సీటు నుంచి 8 సీట్లకు పెరిగామన్నారు.

More Telugu News