Chandrababu: ఈ ఢమా బుస్సు నేత ఎక్కడికి పారిపోయినా పట్టుకొస్తా: ఆముదాలవలసలో చంద్రబాబు ఫైర్

  • శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో ప్రజాగళం సభ
  • స్పీకర్ తమ్మినేనిపై విరుచుకుపడిన చంద్రబాబు
  • ఇక్కడున్న ఢమా బుస్సు నేత పనైపోయిందని ఎద్దేవా
  • ఇంత పనికిమాలిన దద్దమ్మను జీవితంలో చూడలేదని విమర్శ  
Chandrababu fires on Speaker Tammineni in Amudalavalasa

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో నిర్వహించిన టీడీపీ ప్రజాగళం సభకు పార్టీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ, ప్రజాగళం అని పిలుపునిస్తే జన సముద్రం ఆవిష్కృతమైందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలు కదం తొక్కుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఇక్కడున్న ఢమా బుస్సు నేత పనైపోయిందని ఎద్దేవా చేశారు. అతని ఆటలు, వేషాలు, డ్రామాలు ఇక 19 రోజులేనని అన్నారు. "మనం కొట్టే దెబ్బకు ఈ ఢమా బుస్సు ఎమ్మెల్యే ఒడిశాకు పారిపోతాడు. పారిపోయినా పట్టుకొస్తా. చేసిన పాపాలు, తప్పులు అతడ్ని వదిలిపెట్టవు, వెంటాడతాయి. ఇలాంటి వ్యక్తిని ప్రజాకోర్టులో శిక్షించాలా, వద్దా? ఇతడు చేసినవి ఒకటి కాదు, రెండు కాదు... ఇలాంటి వాడు స్పీకర్ పదవికి అర్హుడా? 

ఒక అసమర్థ స్పీకర్ ఆ ముఖ్యమంత్రి ఏం చెబితే అది చేశాడు. అతడొక సైకో... ఇతడు కూడా ఒక సైకోలా తయారయ్యాడు. అసెంబ్లీని అప్రదిష్ఠపాల్జేసిన దుర్మార్గుడు ఈ ఢమా బుస్సు ఎమ్మెల్యే. నా రాజకీయ జీవితం వయసు 40 ఏళ్లు. 14 ఏళ్లు సీఎంగా, 15 ఏళ్లు విపక్ష నేతగా ఉన్నాను కానీ... ఇంత పనికిమాలిన దద్దమ్మను నా జీవితంలో చూడలేదు. గౌరవం లేని వ్యక్తి... పూర్తిగా అవినీతిపరుడు. 

ఈ తమ్మినేని ఆముదాలవలసను ఊడ్చేశాడా, లేదా? ఏ పని జరగాలన్నా బంగారు కానుకలు సమర్పిస్తేనే ఆయన ఇంట్లో దేవతలు కనికరిస్తాయి! నాగావళి, వంశధార నదుల్లో ఇసుక విశాఖపట్నం వెళుతోంది. ఈ ఇసుక దొంగ ఎవరు? బదిలీల్లో కూడా స్థాయిని బట్టి లక్ష నుంచి పది లక్షల వరకు రేట్లు ఫిక్స్ చేసి వ్యాపారం చేసే పరిస్థితికి వచ్చాడు. చెప్పేవన్నీ నీతులు... చేసే పనులన్నీ బూతులు... ఇంత దుర్మార్గమైన వ్యక్తిని నా జీవితంలో చూడలేదు. మళ్లీ చెబుతున్నా... నా దృష్టిలో పడిన వాడ్ని నేను అంత తేలిగ్గా వదిలిపెట్టను. 

ఇక, ఇక్కడ కూన రవికుమార్ ఉన్నారు... ఆముదాలవలస బుల్లెట్! ఇవాళ ప్రజా ఉత్సాహాన్ని చూస్తుంటే నాకే కళ్లు తిరుగుతున్నాయి! ఇక్కడికి 45 ఏళ్లుగా చాలాసార్లు వచ్చాను... ఎప్పుడూ చూడని స్పందన కనిపిస్తోంది. దీనికి కారణం ప్రభుత్వంపై వ్యతిరేకత... ఎప్పుడెప్పుడు కసిదీర్చుకోవాలని ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. 

ఇప్పుడు బస్సులో సైకో వస్తున్నాడు. నేను అడుగుతున్నా... నీకు ధైర్యం ఉంటే బస్సు వదిలేసి ఆముదాలవలసకు రా. పబ్లిక్ మీటింగులో ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆ తర్వాత ఓటు అడుగు. బిర్యానీ పెట్టి, హాఫ్ బాటిల్ మందు ఇచ్చి, రూ.500 డబ్బులు ఇచ్చి మనుషులను తోలుకొస్తే ఓట్లేస్తారా? 

ఉత్తరాంధ్రకు ఏం చేశాడో ఈ సైకో ముఖ్యమంత్రి జవాబు చెప్పాలి. ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చాడా? తాగునీరు ఇచ్చాడా? మహేంద్ర తనయ ఆఫ్ షోర్ ప్రాజెక్టుకు నేను రూ.553 కోట్లు ఇస్తే, జగన్ ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడంతో, ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. నేను అధికారంలో ఉంటే వంశధార-నాగావళి అనుసంధానం జరిగేది. అది జరిగి ఉంటే ఆముదాలవలస బాగుపడేది... నా కల అది. కానీ దుర్మార్గుడు అది కూడా నిలిపివేశాడు. 

నేను ఆ రోజు ఉత్తరాంధ్రకు రూ.2 వేల కోట్లు ఖర్చు పెట్టాను. జగన్... నువ్వు ఇక్కడికి వస్తున్నావు కదా... ఎంత ఖర్చు పెట్టావో చెప్పగలవా? ఉత్తరాంధ్రకు పొడిచానన్నావు... ఎంత ఖర్చు చేశావో చెప్పే ధైర్యం ఉందా? ఒక రోడ్డు వేశావా, ఒక పరిశ్రమ వచ్చిందా, ఒక కాలేజీ పెట్టావా?... ఇక నువ్వు చేసింది ఏముందిక? బటన్ నొక్కుతాను బటన్ నొక్కుతాను అంటాడు. బటన్ నొక్కడం కాదు... బటన్ నొక్కి ఎంతిచ్చావు, బటన్ నొక్కి ఎంత బొక్కావో సమాధానం చెప్పు. 

జగన్ ఒక అహంకారి, ఒక బందిపోటు. పవన్ కల్యాణ్ ను ఎన్ని మాటలు మాట్లాడతాడో మీరే చూశారు. పవన్ కల్యాణ్ కు, జగన్ మోహన్ రెడ్డికి పోలిక ఉందా? నెత్తి మీద రూపాయి పెడితే జగన్ ను దమ్మిడీకి కొనేవాడు లేడు. కానీ పవన్ కల్యాణ్ సినిమాల్లో ఒక సూపర్ స్టార్ గా రాణించిన వ్యక్తి. రాజకీయాల్లో కూడా ఒక నిజమైన హీరో. అలాంటి వ్యక్తిని అవమానిస్తారు. చిరంజీవిని కూడా అవమానిస్తున్నాడు. రాజమౌళిని అవమానిస్తాడు. 

ఎంత అహంభావి అంటే అతడికి ఒళ్లంతా కొవ్వెక్కిపోయింది. ఆ కొవ్వు కరిగించే బాధ్యత మీదే. ఇది బలుపు కాదు వాపు అని మే 13న నిరూపించాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. 

ఈ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేశాడు. రూ.13 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఎవరు కడతారు ఈ డబ్బు? జగన్ మోహన్ రెడ్డి కడతాడా? రేపు ఓడిపోతే ఉంటాడా? మళ్లీ దొరుకుతాడా? ఎవరు కట్టాలి ఈ అప్పులు? పన్నుల రూపంలో ప్రజలే కట్టాలి కదా! మరి ప్రజల్లో ఇంకా చైతన్యం రాలేదు, కోపం రాలేదు. ఒక్కో కుటుంబంపై రూ.10 లక్షల అప్పు చేసిన దుర్మార్గుడ్ని వదిలిపెడతారా? 

ఇప్పుడు నేను చెబుతున్నాను... కూటమికి 175కి 175 స్థానాలు వస్తాయి... వై నాట్ పులివెందుల? పులివెందులలో ఏమని అడుగతావు ఓటు? గొడ్డలి చూపించి బెదిరిస్తావా?" అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.

More Telugu News