Chandrababu: ఉత్తరాంధ్రలో క్లీన్ స్వీప్ ఖాయం: చంద్రబాబు

  • శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ప్రజాగళం సభ
  • పాతపట్నం కొత్త చరిత్రను సృష్టించనుందన్న చంద్రబాబు
  • మే 13 మన జీవితాలను మార్చుకునే రోజు అని వెల్లడి
  • పవన్ మంచి వ్యక్తి అని కితాబు
  • రాష్ట్రం కోసం నిర్ణయాలు తీసుకున్నాడని వ్యాఖ్యలు
Chandrababu confidant on alliance clean sweep in Uttarandhra

శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం సభ నిర్వహించారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ, గతంలో చాలాసార్లు ఈ నియోజకవర్గానికి వచ్చానని, కానీ ఈస్థాయి ప్రజాస్పందన ఎప్పుడూ కనిపించలేదని అన్నారు. 

పాతపట్నం ప్రజలు కొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారని కొనియాడారు. ఈ సభకు విశేషంగా తరలివచ్చిన ప్రజలను, వారిలో కనిపిస్తున్న ఉత్సాహాన్ని చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందన్న నమ్మకం కలుగుతోందని పేర్కొన్నారు.

ఫైర్ బ్రాండ్, తండ్రి ఎర్రన్నాయుడికి తగ్గ తనయుడు కింజరాపు రామ్మోహన్ నాయుడును వరుసగా మూడోసారి కూడా పార్లమెంటుకు పంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఒక సామాన్య వ్యక్తి గోవిందరావుకు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన పార్టీ టీడీపీ అని స్పష్టం చేశారు. 

ఎన్నికలకు మరో 19 రోజులే సమయం ఉందని, మన జీవితాలను మార్చుకునే తేదీ మే 13 అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ఎన్నికలు తన కోసం కాదని, లేకపోతే తమ కూటమి పార్టీల కోసం కాదని... ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అని ఉద్ఘాటించారు. 

"ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలన్న ఉద్దేశంతో పొత్తు పెట్టుకున్నాం. పవన్ కల్యాణ్ ఒక మంచి వ్యక్తి. పవన్ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా నిజమైన హీరో పవన్ కల్యాణ్. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకున్న వ్యక్తి పవన్ కల్యాణ్. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చే పార్టీ బీజేపీ. అందుకే ఆ పార్టీతో కూడా పొత్తు పెట్టుకున్నాం. 

నాడు జగన్ మీ వద్దకు వచ్చి ముద్దులు పెట్టి, బుగ్గలు నిమిరి, తలపై చేయి పెట్టేసరికి మీరంతా కరిగిపోయారు... జగన్ ను భారీ మెజారిటీతో గెలిపించారు. కానీ, ఇతడికి అహంకారం నెత్తికెక్కింది. శాశ్వతంగా తానే ముఖ్యమంత్రిగా ఉంటానని అనుకుంటున్నాడు. అధికారంతో విర్రవీగుతున్నాడు. 

ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయడంతో పాలన ప్రారంభించాడు. అమరావతిని నాశనం చేశాడు, పోలవరంను ముంచేశాడు. ఇక్కడి వంశధార ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. రాష్ట్రంలో దోపిడీకి అడ్డు లేకుండా పోయింది. ఇసుకలో దోపిడీ, మద్యంలో దోపిడీ, భూకుంభకోణాలు, ఖనిజ సంపద దోపిడీ చేశారు. రాష్ట్రంలో పేదలు ఎక్కడైనా బాగుపడ్డారా? ప్రజల ఆదాయం పెరిగిందా? ఖర్చులు పెరిగాయా, లేదా? ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయి. 

పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ బొమ్మ ఎందుకు? జగన్ ఏమైనా భూమి ఇచ్చాడా, లేక వాళ్ల నాన్న ఇచ్చాడా? వాళ్ల తాత ఇచ్చాడా? మీ నాన్న ఇచ్చాడు, మీ తాత ఇచ్చాడు, వేసుకుంటే మీ వాళ్ల ఫొటోలు వేసుకోవాలి కానీ జగన్ బొమ్మ ఎందుకు? అంతటితో ఆగలేదు ఈ ఉన్మాది... మీ పొలంలో సర్వే రాళ్లపై కూడా సైకో బొమ్మలు వేసుకున్నాడు. చుక్కల భూముల్లో పెద్ద ఫ్రాడ్ జరిగిందా, లేదా? 

చుక్కల భూమి అని పేరు పెట్టి, 22-ఏ అని పేర్కొని పెద్ద ఎత్తున భూములు కొట్టేశారు. ఇవాళ నేను గజపతినగరంలో మహిళలతో సమావేశం నిర్వహిస్తే, భూములు సంగతి చెప్పుకుని కొందరు మహిళలు భోరును ఏడ్చారు. భూమి మీ పేరుమీదే ఉంటుంది... కానీ సైకోలు మీ భూమిని కొట్టేస్తారు... ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

చుక్కల భూమితో ఎలా భూములు కొట్టేస్తున్నారో... అదే తరహాలో రేపు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తోంది. అందులో పట్టాదారు పాసు పుస్తకం ఉండదు, టెన్-1 లేదు, అడంగల్ లేదు, రికార్డులే ఉండవు... మీ రాత జగన్ మోహన్ రెడ్డి రాస్తాడంట. తాడేపల్లి కొంపలో కూర్చుని ఎల్లయ్య భూమి రంగయ్యకు రాసేస్తే మీ పని అయిపోయినట్టే. 

ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ను ఇంటికి పంపించాలన్న ఒక చైతన్యం ప్రజల్లో రావాలి. ఒక చాన్స్ అన్నాడు... ఇప్పుడదే చివరి చాన్స్ అవ్వాలి. రాజకీయాలు నాకేం కొత్త కాదు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్లు విపక్ష నేతగా ఉన్నాను... కానీ ఇవాళ గాడి తప్పిన రాష్ట్రాన్ని మళ్లీ చక్కదిద్దాలన్నదే నా తపన. అందుకు ప్రజల సహకారం కావాలి. 

రాష్ట్రంలో రైతులందరూ అప్పులపాలయ్యారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మేం అధికారంలోకి రాగానే పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తాం, మళ్లీ పంట బీమా అమలు చేస్తాం. ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు కూడా చేయూతనిస్తాం. ప్రతి రైతుకు రూ.20 వేలు సాయం అందిస్తాం. ఆక్వా రంగానికి కూడా ప్రాధాన్యత ఇస్తాం. 

రాష్ట్రంలో విపరీతంగా ధరలు పెరిగిపోయాయి... మేం అధికారంలోకి వచ్చాక ధరలను నియంత్రించి ప్రజలను ఆదుకుంటాం. సైకో జగన్ మద్యపాన నిషేధం చేస్తాను అన్నాడా, లేదా? చేశాడా? మందుబాబులు రోజంతా కష్టపడి పనిచేసి, ఆ కష్టాన్ని మర్చిపోయేందుకు సాయంత్రం ఒక పెగ్గు వేసి, మళ్లీ రేపు పనిచేసేందుకు సిద్ధమవుతారు. ఈ సంగతి జలగ జగన్ కు బాగా అర్థమైపోయింది. 

నేను ఉన్నప్పుడు క్వార్టర్ బాటిల్ రూ.60. ఇప్పుడు రూ.200 చేశాడు జలగ. అది కూడా నాసిరకం మద్యం. అది తాగితే గోవిందా గోవింద! డబ్బుల కోసం కక్కుర్తిపడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు... ఏమనాలి ఇతడ్ని?" అంటూ చంద్రబాబు ప్రసంగించారు.

More Telugu News