KTR: కాంగ్రెస్‌, బీజేపీ.. దొందు దొందే: కేటీఆర్

  • అర‌చేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చింద‌న్న బీఆర్ఎస్ నేత‌
  • ప‌దేళ్లుగా రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందో చెప్ప‌కుండా కేవ‌లం జైశ్రీరామ్ అంటోంద‌ని ఎద్దేవా 
  • శ్రీరాముడు బీజేపీ ఎమ్మెల్యేనో, ఎంపీనో కాదంటూ చుర‌క‌లు
  • మ‌త రాజ‌కీయాలు చేస్తున్న కాషాయం పార్టీకి త‌గిన బుద్ధి చెప్పాల‌న్న కేటీఆర్‌
BRS Working President KTR Fire on Congress BJP

కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై మ‌రోసారి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుప‌డ్డారు. అర‌చేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చి అంద‌రినీ మోసం చేసిందంటూ దుయ్య‌బ‌ట్టారు. లోక్‌స‌భ ఎన్నిక‌లు రాగానే ఆగ‌స్టు 15 వ‌ర‌కు రుణ‌మాఫీ చేస్తామ‌ని మ‌ళ్లీ మోసం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని మండిప‌డ్డారు. మంగ‌ళ‌వారం చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్య‌ర్థి కాసాని జ్ఞానేశ్వ‌ర్ నామినేష‌న్ ర్యాలీలో పాల్గొన్న కేటీఆర్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. 

ప్ర‌జ‌లు ఒక‌సారి మోస‌పోతే అది నాయ‌కుల త‌ప్పు అవుతుంది.. రెండోసారి కూడా మోస‌పోతే అది వంద‌కు వంద‌శాతం ప్ర‌జ‌ల‌దే త‌ప్పు అవుతుంద‌ని కేటీఆర్ అన్నారు. అందుకే రెండోసారి మోస‌పోదామా అని ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌జ‌ల‌ను ప్ర‌శ్నించ‌డం జ‌రిగింది. అలాగే బీజేపీపై కూడా ఆయ‌న తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. మ‌త రాజ‌కీయాలు చేస్తున్న కాషాయం పార్టీకి ప్ర‌జ‌లు త‌గిన బుద్ధి చెప్పాల‌న్నారు. 

ప‌దేళ్లుగా రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందో చెప్ప‌కుండా కేవ‌లం జైశ్రీరామ్ అంటోంద‌ని ఎద్దేవా చేశారు. శ్రీరాముడు బీజేపీ ఎమ్మెల్యేనో, ఎంపీనో కాద‌న్నారు. రాముడు అంద‌రివాడు అని పేర్కొన్నారు. 111 జీఓ గురించి అన్ని పార్టీలు మాట్లాడాయ‌ని, కానీ దాన్ని ఎత్తివేసిన ఘ‌న‌త మాత్రం కేసీఆర్‌దేన‌ని గుర్తు చేశారు. కాసాని బ‌ల‌హీన వ‌ర్గాల బాహుబ‌లి అని, ఎస్‌సీలు, ఎస్‌టీలు, బీసీలు ఏక‌మై ఆయ‌న‌ను గెలిపించాల‌ని కోరారు. అలాగే ఒక‌వైపు కాంగ్రెస్ ప్రభుత్వ 100 రోజుల అబ‌ద్ధం ఉంటే, మ‌రోవైపు బీఆర్ఎస్ పదేళ్ల పాల‌న ఫ‌లాలు మీ ముందు ఉన్నాయ‌ని కేటీఆర్ చెప్పుకొచ్చారు. అందుకే ఆలోచించి ఓటు వేసి స‌రైన నాయ‌కుడిని ఎన్నుకోవాల‌ని కోరారు.

More Telugu News