Nara Lokesh: అధికారంలోకి రాగానే విదేశీవిద్యకు జగన్ పేరు తొలగిస్తాం: నారా లోకేశ్

  • తుమ్మపూడిలో లోకేశ్ రచ్చబండ కార్యక్రమం
  • అధికారంలోకి రాగానే జగన్ రద్దుచేసిన పథకాలను తిరిగి తీసుకొస్తామన్న లోకేశ్
  • తనకు అవకాశం ఇస్తే మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలో నంబర్ వన్‌గా మారుస్తానన్న యువనేత
  • సమస్యలను లోకేశ్ దృష్టికి తీసుకెళ్లిన గ్రామస్థులు
We remove Jagan name to foreign study as soon as we come into power says Lokesh

విదేశీ విద్యకు గతంలో తాము అంబేద్కర్ పేరు పెడితే దానిని తొలగించి జగన్ తన పేరు పెట్టుకున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.  తాము అధికారంలోకి రాగానే తిరిగి పేరు మారుస్తామని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ఉదయం మంగళగిరి నియోజకవర్గంలోని తుమ్మపూడిలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో లోకేశ్ మాట్లాడుతూ ప్రజలు ఆశీర్వదిస్తే మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటానని తెలిపారు.

గతంలో రూ. 200 ఉన్న పెన్షన్‌ను చంద్రబాబు రూ. 2 వేలు చేశారని, అన్న కేంటీన్లతో పేదల ఆకలి తీర్చారని, బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు, పెళ్లికానుక, చంద్రన్న బీమా, విదేశీ విద్య వంటి ఎన్నో పథకాలను చంద్రబాబు తీసుకొచ్చారని గుర్తుచేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ రద్దు చేశారని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి రాగానే తిరిగి అవన్నీ ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్‌ను రద్దుచేస్తామంటూ వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వారి మాటలు నమ్మవద్దని, ముస్లింలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని పేర్కొన్నారు.

లోకేశ్ దృష్టికి సమస్యలు
ఈ సందర్భంగా తుమ్మపూడి గ్రామస్థులు తమ సమస్యలను లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గ పరిధిలో ఉన్నత ఉద్యోగాలకు శిక్షణ ఇచ్చేలా ఫ్రీ కోచింగ్ సెంటర్ ఏర్పాటుచేయాలని, పనుల్లేక తాపీపనివారు ఇబ్బందులు పడుతున్నారని, గీతకార్మికులను ఆదుకోవాలని, మంగళగిరి-తెనాలి రహదారి నిర్మించాలని, ముస్లింల శ్మశానవాటికకు రహదారి నిర్మించాలని, డ్రైనేజీ నిర్మించాలని, చిలువూరు గేటు దగ్గర మూసివేసిన ప్రభుత్వ పాఠశాలను తిరిగి ప్రారంభించాలని, ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ అమలుపై నెలకొన్న అపోహలు తొలగించాలని, ఇళ్లులేని పేదలకు స్థలాలు ఇవ్వాలని కోరారు.  వారికి లోకేశ్ స్పష్టమైన హామీ ఇచ్చారు. అలాగే, మద్యం దుకాణాల్లో గీతకార్మికులకు రిజర్వేషన్ కల్పిస్తామని తెలిపారు. 117 జీవో రద్దు చేసి ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తామని, అర్హులైన పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News