Dommaraju Gukesh: భారత్‌కు దొరికాడు మరో ‘మంత్రి’.. ప్రపంచ చెస్ టోర్నీలో గుకేశ్ సంచలనం

  • టొరొంటోలో క్యాండిడేట్స్ చెస్ టోర్నీ
  • అతిపిన్న వయసులో టైటిల్ సొంతం చేసుకున్న ఆటగాడిగా రికార్డ్
  • నాలుగు దశాబ్దాలుగా భద్రంగా ఉన్న కాస్పరోవ్ రికార్డు బద్దలు
  • క్రౌడ్ ఫండింగ్‌తో వెళ్లి రూ. 78.5 లక్షల ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్న గుకేశ్
Dommaraju Gukesh becomes youngest man to win Candidates

తెలుగు మూలాలున్న తమిళనాడుకు చెందిన భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ (17) ప్రతిష్ఠాత్మక క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో చాంపియన్‌గా నిలిచి అత్యంత పిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నయా చరిత్ర లిఖించాడు. కెనడాలోని టొరొంటోలో ఆదివారం జరిగిన ఆఖరిదైన 14వ రౌండ్‌లో అమెరికా గ్రాండ్‌మాస్టర్ హికారు నకమురాతో గేమ్‌ను డ్రా చేసుకున్న గుకేశ్ మొత్తం 9 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఫలితంగా భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ (2014) తర్వాత ఈ టోర్నీ విజేతగా నిలిచిన రెండో భారత ఆటగాడిగా తన పేరును రికార్డు పుస్తకాల్లో ఎక్కించుకున్నాడు. అంతేకాదు, 40 ఏళ్ల క్రితం రష్యా చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ 22 ఏళ్ల క్రితం చాంపియన్‌గా నిలవగా, ఇప్పుడు గుకేశ్ 17 ఏళ్ల వయసులోనే విజేతగా నిలిచి నాలుగు దశాబ్దాలపాటు చెక్కు చెదరకుండా ఉన్న రికార్డును బద్దలుగొట్టాడు. 

చైనాకు చెందిన వరల్డ్ చాంపియన్ డింగ్ లిరెన్‌తో గుకేశ్ చాలెంజర్ హోదాలో ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌ టైటిల్ పోరులో తలపడతాడు. ఈ పోటీలకు సంబంధించి తేదీలు, వేదికలు ఖరారు కావాల్సి ఉంది. కాగా, విజేతగా నిలిచిన గుకేశ్‌కు రూ. 78.5 లక్షలు ప్రైజ్‌మనీగా దక్కింది. భారత్‌కే చెందిన మరో ఆటగాడు ప్రజ్ఞానంద ఏడు పాయింట్లతో ఐదో స్థానం, ఆరు పాయింట్లతో విదిత్‌కు ఆరోస్థానం దక్కాయి.

ఆర్థిక కష్టాలు వెంటాడినా
12 ఏళ్లకే గ్రాండ్ మాస్టర్ అయిన గుకేశ్‌‌‌ను ఆర్థిక కష్టాలు వెంటాడినా వెనకడుగు వేయలేదు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా టోర్నీలో అడుగుపెట్టాడు. విశ్వనాథన్ ఆనంద్ మెంటార్‌గా బరిలోకి దిగి ఆయన వారసుడిగా అవతరించాడు. క్యాండిడేట్స్ చెస్ టోర్నీ విజేతగా నిలిచిన గుకేశ్ పేరు ఇప్పుడు మార్మోగుతోంది.  ఏడేళ్ల వయసులోనే 64 గళ్ల ఆటలో ఓనమాలు దిద్దిన గుకేశ్ 2015 ఆసియా స్కూల్ చెస్ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్నాడు. 2018లో ఆసియా యూత్ చెస్ చాంపియన్‌షిప్స్‌లో ఐదు పతకాలు సాధించాడు. 11 ఏళ్లకే ఇంటర్నేషనల్ మాస్టర్ హోదా సాధించాడు. 12 ఏళ్ల వయసులో గ్రాండ్‌మాస్టర్ టైటిల్ దక్కించుకున్న గుకేశ్ ఇప్పుడు ఏకంగా క్యాండిడేట్స్ చెస్ టోర్నీ విజేతగా నిలిచి దేశం దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు.

More Telugu News