Yashasvi Jaiswal: సెంచరీతో చెలరేగిన జైస్వాల్.. ముంబైపై రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ

Yashasvi Jaiswal ton helps Win Rajastan Royals against Mumbai Indians
  • 9 వికెట్ల తేడాతో విజయం సాధించిన రాజస్థాన్
  • 180 పరుగుల లక్ష్యం సునాయాసంగా ఛేదన
  • 59 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేసుకున్న యశస్వి జైస్వాల్
యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ 59 బంతుల్లో సెంచరీ బాదడంతో ముంబై ఇండియన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ మరో సునాయాస విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ముంబై నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 18.4 ఓవర్లలోనే ఛేదించి 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జైస్వాల్ అజేయ సెంచరీతో పాటు జాస్ బట్లర్ (35), సంజూ శాంసన్ (38) చొప్పున పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో స్పిన్నర్ పీయూశ్ చావ్లాకు మాత్రమే ఒక వికెట్ పడింది. మిగతా బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. దీంతో జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్‌పై విజయం సాధించాలనుకున్న ముంబై ఇండియన్స్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. 2012 నుంచి జైపూర్‌లో రాజస్థాన్‌ని ముంబై ఇండియన్స్ ఓడించలేకపోయింది.

ఇక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. తిలక్ వర్మ(64), నెహల్ వధేర (49) రాణించారు. ముంబైకి ఆరంభంలో ఎదురుదెబ్బలు తగిలాయి. మొదటి ఎనిమిది ఓవర్లలోనే ఆ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది. ట్రెంట్ బౌల్ట్ ధాటికి రోహిత్ శర్మ రూపంలో తొలి ఓవర్లోనే వికెట్ పడింది. ఈ మ్యాచ్‌లో సందీప్ శర్మ 5 వికెట్లతో చెలరేగాడు. బౌల్ట్‌కి 2, అవేశ్ ఖాన్, చాహల్‌కు చెరో వికెట్ పడింది. ఈ మ్యాచ్‌లో ఐపీఎల్‌లో 200వ వికెట్‌ మైలురాయిని అందుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో సెంచరీ ద్వారా ఐపీఎల్‌లో అతిపిన్న వయసులోనే 2 సెంచరీలు బాదిన ఆటగాడిగా యశస్వి జైస్వాల్ నిలిచాడు. 23 ఏళ్లు నిండకముందే ఈ ఫీట్‌ని సాధించాడు. కాగా ముంబైపై మ్యాచ్‌లో 59 బంతుల్లోనే జైస్వాల్ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తం 60 బంతులు ఎదుర్కొని 104 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 7 సిక్సర్లు, 9 ఫోర్లు ఉన్నాయి.

Yashasvi Jaiswal
Rajastan Royals
Mumbai Indians
IPL 2024
Cricket

More Telugu News