Jagga Reddy: విభజనతో వారు బాధపడ్డారు... ఆ ఫీలింగ్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా బయటకు రాలేదు: జగ్గారెడ్డి

  • సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం వల్లే ఏపీ సీఎం ఏపీలో ఉండి పరిపాలిస్తున్నారన్న జగ్గారెడ్డి
  • దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి
  • రాహుల్ గాంధీ ప్రధాని అవుతారనే విశ్వాసం ఉందన్న కాంగ్రెస్ నేత
Jagga Reddy says till today ap people not digesting state divide

రాష్ట్రం ఇచ్చినందుకు (విభజనతో) తెలంగాణ ప్రజలు ఆనందిస్తే... ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా బాధపడ్డారని... వారు ఇంకా ఆ ఫీలింగ్ నుంచి బయటకు రాలేదని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. ఎన్టీవీ క్వశ్చన్ అవర్‌లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఆ సమయంలో తాను కూడా ఓసారి, అందరం కలిసి ఉండాలని చెప్పానని గుర్తు చేశారు. కానీ సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం వల్ల మీ రాష్ట్ర ముఖ్యమంత్రి మీ వద్దనే ఉండి పరిపాలన చేస్తున్నారనే విషయాన్ని ఏపీ ప్రజలు గ్రహించాలని కోరారు. మీ సీఎం మీ వద్దే ఉండి పాలిస్తున్నారంటే అందుకు కారణం విభజన అన్నారు. ఇప్పుడు మీ సీఎం మీ ప్రజల మధ్య తిరుగుతున్నారంటే అందుకు సోనియా తెలంగాణ ఇవ్వడం వల్లే అని గుర్తించాలన్నారు. అందుకే, తాను ఏపీ ప్రజలను కోరేది ఒక్కటేనని... అన్నీ గమనించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఏపీలో అధికారం ఇవ్వండని కోరారు. 

తమ ఆశ రాహుల్ గాంధీ అని, ఆయన ప్రధాని అవుతారనే విశ్వాసం తమకు ఉందన్నారు. ఉత్తరాదిన బీజేపీ గ్రాఫ్ క్రమంగా పడిపోతోందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి 150 నుంచి 200 సీట్లు వచ్చినా రాహుల్ ప్రధాని అవుతారన్నారు. కాంగ్రెస్ గెలిస్తే సంపద అంతా ఒక వర్గానికే దోచి పెడుతుందని రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ప్రధాని హోదాలో అలాంటి మాటలు మాట్లాడడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ పార్టీని చూసి బీజేపీ భయపడుతోందని... అందుకే ప్రధాని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు.

More Telugu News