Jagga Reddy: ఐదేళ్లు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి... మంత్రులూ అలాగే ఉంటారు: జగ్గారెడ్డి

  • తన టైమ్ బాగాలేదు కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయానన్న జగ్గారెడ్డి
  • ప్రభుత్వం పడిపోతుందనే బీజేపీ, బీఆర్ఎస్ కోరిక ఫెయిల్ అవుతుందని వ్యాఖ్య
  • రేవంత్ రెడ్డిని విమర్శించింది నిజమే... కానీ రాహుల్ గాంధీ చెప్పాక కాంగ్రెస్ లైన్లోనే ఉన్నానన్న జగ్గారెడ్డి
Jagga Reddy says Revanth Reddy cm for five years

 ఐదేళ్లు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారని... మంత్రులూ అలాగే ఉంటారని... ఇందులో ఎలాంటి అనుమానం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఎన్టీవీ క్వశ్చన్ అవర్‌లో ఆయన మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తాము మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు మా వ్యూహాలు మాకు ఉన్నాయన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ గేమ్స్ ఆడే ప్రయత్నం చేస్తున్నాయని... కానీ మా గేమ్స్ ముందు వారు ఎంత? అన్నారు.

తన టైమ్ బాగాలేదు కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డిలో ఓడిపోయానన్నారు. అధికారంలో ఉన్నా... లేకపోయినా తాను బలమైన వ్యక్తిని అన్నారు. రాజకీయ నాయకుడు అంటే ఓసారి గెలవవచ్చు... మరోసారి ఓడిపోవచ్చునన్నారు. అయితే అధికారంలో ఉన్నా.. ఎమ్మెల్యేగా గెలవకపోయినా అధికార కార్యక్రమానికి తనను పిలవాలని తాను చెప్పడం వెనుక ఇది కేసీఆర్ నేర్పిన విద్యయే అన్నారు. తాను మరో 40 ఏళ్లు రాజకీయాల్లోనే ఉంటానన్నారు.

తాను గతంలో హరీశ్ రావుతో రాజకీయంగా పోరాడానని... అదే సమయంలో అభివృద్ధి కోసం ఆయనను కలిశానన్నారు. రాజకీయం వేరు... అభివృద్ధి వేరు అన్నారు. హరీశ్ రావు తనను రాజకీయంగా తొక్కేయాలని చూశారని ఆరోపించారు. వ్యతిరేకత వల్లనే బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటుందని తెలిపారు. తాము కలిసికట్టుగా పనిచేసి మెదక్ లోక్ సభ స్థానాన్ని గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీ, బీఆర్ఎస్ కోరిక ఫెయిల్ అవుతుంది

కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందనే బీజేపీ, బీఆర్ఎస్ కోరిక ఫెయిల్ అవుతుందని జగ్గారెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా తొలగించాలని తాను డిమాండ్ చేసిన మాట వాస్తవమేనని... కానీ అది ముగిసిపోయిన ఎపిసోడ్ అన్నారు. తాను కాంగ్రెస్ లైన్‌లో వెళతానన్నారు. తాను రేవంత్ రెడ్డిపై మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీ తనకు ఓ మాట చెప్పారని... మనం అధికారంలోకి రాబోతున్నాం... ఎవరినీ ఏమీ అనవద్దని సూచించారని తెలిపారు. తాను కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత కలిగిన కార్యకర్తను కాబట్టి మా పార్టీ నేత చెప్పింది విన్నానన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండే స్వేచ్ఛ బీజేపీలో ఉండదన్నారు.

ఆనాటి నుంచి తాను రేవంత్ రెడ్డిని ఏమీ అనలేదని తెలిపారు. అయినా అది మా కాంగ్రెస్ ఇంటి పంచాయతీ అని పేర్కొన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాం కాబట్టి హామీలు అమలు చేస్తూ మంచి పాలన అందిస్తామన్నారు. మా పార్టీలో మేం కొట్టుకుంటాం... తిట్టుకుంటాం... మా పైకి ఎవరైనా వస్తే మేమంతా కలిసి తిరగబడతామన్నారు. ఇదే కాంగ్రెస్ పద్ధతి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కాపాడుకుంటామన్నారు.

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు. వారికి పునాదులు, పిల్లర్లు లేవని వ్యాఖ్యానించారు. ఐదేళ్లు సుపరిపాలన అందించి ఆ తర్వాత మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. మా పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్లేవారు ఎవరూ ఉండరన్నారు. తన భార్య నిర్మలకు కాంగ్రెస్ కోటాలో... రేవంత్ రెడ్డి కోటాలో నామినేటెడ్ పదవి వచ్చిందన్నారు. తన వద్ద ఏముందని తన ఫోన్ ట్యాపింగ్ చేస్తారని ప్రశ్నించారు.

More Telugu News