calcutta high court: బెంగాల్ లో 24 వేల స్కూల్ టీచర్ ఉద్యోగాలను రద్దు చేసిన హైకోర్టు

Calcutta HC cancels entire Bengal school recruitment panel 24000 jobs to be axed
  • రిక్రూట్ మెంట్ చట్ట విరుద్ధమని ప్రకటన 
  • ఆ ఉద్యోగులంతా 6 వారాల్లోగా వడ్డీ సహా జీతాలు తిరిగిచ్చేయాలని ఆదేశం
  • 15 రోజుల్లోగా కొత్త రిక్రూట్ మెంట్ మొదలుపెట్టాలని స్పష్టీకరణ
పశ్చిమ బెంగాల్ లో 2016లో నియమితులైన సుమారు 24 వేల మంది టీచర్లు, నాన్ టీచర్లకు కలకత్తా హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో నియామకాల కోసం అనుసరించిన ఎంపిక ప్రక్రియ చట్టవిరుద్ధంగా ఉందని ప్రకటిస్తూ ఆ ఉద్యోగాలు పొందిన వారి అపాయింట్ మెంట్లను రద్దు చేసింది. ఆ టీచర్లంతా ఆరు వారాల్లోగా వారు పొందిన జీతాలను 12 శాతం వడ్డీతో వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది. 

క్యాన్సర్ తో బాధపడుతున్న సోమా దాస్ అనే వ్యక్తికి మాత్రం మినహాయింపు ఇచ్చి ఉద్యోగంలో కొనసాగేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే కొత్త టీచర్ల నియామకాల ప్రక్రియను 15 రోజుల్లోగా చేపట్టాలని బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ కు స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ దెబాంగ్సు బాసక్, మొహమ్మద్ షబ్బర్ రషీదీలతో కూడిన హైకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. కోర్టు తీర్పుతో గ్రూప్ సీ, డీతోపాటు 9, 10, 11, 12 తరగతుల టీచర్లకు చెందిన సుమారు 24 వేల ఉద్యోగాలు రద్దయ్యాయి.

అసలు ఏం జరిగిందంటే..?
పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ ఖాళీగా ఉన్న 24, 640 టీచర్ పోస్టుల భర్తీకి 2016లో రాష్ర్ట స్థాయి ఎంపిక పరీక్ష నిర్వహించింది. అయితే అభ్యర్థుల ఎంపికలో అక్రమాలు జరిగాయని.. అనర్హులు లంచాలిచ్చి ఉద్యోగాలు పొందారని ఆరోపిస్తూ నిరుద్యోగులు రోడ్డెక్కారు. దీనిపై సుప్రీంకోర్టు ఆదేశంతో హైకోర్టు విచారణ ప్రారంభించింది. కుంభకోణం ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని సీబీఐని ఆదేశించింది. రంగంలోకి దిగిన సీబీఐ ఈ స్కాంలో పాత్ర ఉందంటూ 2022లో నాటి విద్యాశాఖ మంత్రి పార్థా చటర్జీతోపాటు బెంగాల్ స్కూల్ సర్వీసు కమిషన్ లో పనిచేసిన కొందరు అధికారులను అరెస్టు చేసింది. పార్థా చటర్జీకి ప్రధాన అనుచరురాలైన అర్పితా ముఖర్జీకి చెందిన కోల్ కతా నివాసాన్ని సీబీఐ తనికీ చేయగా రూ. 21 కోట్ల నగదు, రూ. కోటికిపైగా విలువ చేసే నగలు లభించాయి. ఈ కేసులో సీబీఐ తమ దర్యాప్తు కొనసాగించి 3 నెలల్లోగా నివేదిక సమర్పించాలని హైకోర్టు తాజాగా ఆదేశించింది.
calcutta high court
recruitment scam
teacher jobs
cancel

More Telugu News