Asaduddin Owaisi: ఓట్ల కోసం ముస్లింలను తిట్టడమే మోదీ పని: అసదుద్దీన్ ఓవైసి ఆరోపణ

  • 2002 నుంచి మోదీ ఇదే పద్ధతి పాటిస్తున్నారంటూ విమర్శ
  • ముస్లింలను చొరబాటుదారులుగా చిత్రీకరించారని ఫైర్
  • ప్రతిపక్షాలపై తప్పుడు ఆరోపణలు చేయడమే బీజేపీ శిక్షణలో స్పెషాలిటీ అన్న ఖర్గే
Abuse Muslims And Get Votes Says Asaduddin Owaisi

ఓట్లు పొందాలంటే ముస్లింలను తిట్టడమే ఉత్తమ మార్గం అనేది ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచన అంటూ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. ఇప్పుడే కాదు ఆయన 2002 నుంచే ఈ పద్ధతిని ఫాలో అవుతున్నారని విమర్శించారు. మోదీ అసలు గ్యారంటీ ఓట్ల కోసం ముస్లింలను తిట్టడమేనని ఆరోపించారు. ఈమేరకు ప్రధాని మోదీ వ్యాఖ్యలకు కౌంటర్ గా అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు.

ముస్లింలను చొరబాటుదారులుగా, ఎక్కువ సంతానం ఉన్న వారిగా మోదీ చిత్రీకరించాడంటూ అసదుద్దీన్ విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులను లాక్కుని ముస్లింలకు పంచుతుందంటూ తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. దేశ సంపద గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మోదీ స్నేహితుల ప్రస్తావన తప్పకుండా వస్తుందని గుర్తుచేశారు. దేశ జనాభాలో 40 శాతం మంది దగ్గర ఉన్న సంపద కేవలం 1 శాతం కాగా, మోదీకి ఉన్న కొద్దిమంది సంపన్న స్నేహితుల వద్దే మిగతా సంపద పోగయి ఉందని చెప్పారు. హిందువులను భయాందోళనలకు గురిచేయడం ద్వారా ఓట్లు పొందాలనే ఎత్తుగడే తప్ప మోదీ ఆరోపణలలో నిజంలేదని అసదుద్దీన్ స్పష్టం చేశారు.

ప్రధానమంత్రి సీటును అవమానించడమే: ఖర్గే
రాజస్థాన్ లోని జాలోర్ లో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై చేసిన ఆరోపణలు ప్రధానమంత్రి పదవిని కించపరిచేలా ఉన్నాయని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తి నోటివెంట ఇలాంటి మాటలు రావడం బాధాకరమని, దేశంలో ఇప్పటి వరకూ మరే ప్రధాని కూడా ఇంత బాధ్యతారహితంగా మాట్లాడలేదని మండిపడ్డారు. జాలోర్ లో మోదీ చేసింది కచ్చితంగా విద్వేష ప్రసంగమేనని చెప్పారు. తప్పుడు ఆరోపణలతో ప్రజల దృష్టిని మరల్చేందుకు చేసిన ప్రయత్నమని మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడమే సంఘ్, బీజేపీ శిక్షణలో ప్రత్యేకత అని ఖర్గే ఆరోపించారు. అధికారమే అంతిమ లక్ష్యంగా ప్రతిపక్షాలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఖర్గే మండిపడ్డారు.

More Telugu News