donkey business: గాడిద పాలా మాజాకా.. లీటర్ రూ. 5 వేలు పలుకుతున్న ధర!

  • నెలకు రూ. 3 లక్షలు సంపాదిస్తున్న గుజరాత్ పాల వ్యాపారి
  • గాడిద పాలను పొడిగా మార్చి కిలో ఏకంగా రూ. లక్షకు అమ్ముతున్న వైనం
  • కర్ణాటక, కేరళకు సరఫరా.. కాస్మెటిక్ కంపెనీలకు కూడా విక్రయం
gujarat farmer donkey business rakes in rs 3 lakh monthly

‘గంగిపోవు పాలు గరిటెడైనను చాలు.. కడివిడెడైననేమి ఖరము పాలు’ అంటూ యోగి వేమన అప్పట్లో చమత్కరించాడు. అయితే, కాలం మారింది. ఇప్పుడీ సూక్తి వర్తించదు.. అందుకే, ఇప్పుడు 'ఖరము (గాడిద) పాలు గరిటెడైన చాలు..' అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆవు పాలకంటే గాడిద పాలు దాదాపు 70 రెట్లు ఎక్కువ ధర పలుకుతున్నాయి మరి! గుజరాత్ లోని పటాన్ జిల్లాకు చెందిన ధీరేన్ సోలంకి అనే పాల వ్యాపారి గాడిదల డెయిరీ ఫాం నడుపుతూ నెలకు రూ. 3 లక్షలు సంపాదిస్తున్నాడు.  లీటర్ పాలను ఏకంగా రూ. 5 వేలకు అమ్ముతున్నాడు!

ఉద్యోగం మానేసి వ్యాపారం మొదలుపెట్టి..
ధీరేన్ సోలంకి తొలుత చిన్న ప్రైవేటు ఉద్యోగం చేసేవాడు. కానీ చాలీచాలని జీతం ఇంటి అవసరాలకు చాలకపోవడంతో 8 నెలల కిందట గాడిదల పెంపకం వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. రూ. 22 లక్షల పెట్టుబడితో 20 గాడిదలను కొని డెయిరీ ఫాం ప్రారంభించాడు.

సవాళ్లు ఎదురైనా నిలబడి..
అయితే రోజూ గాడిద పాలు సేకరిస్తున్నా పెద్దగా అమ్ముడుపోయేవి కాదు. గుజరాత్ మొత్తం గాలించినా కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపేవారు కాదు. కానీ దక్షిణాదిలో గాడిద పాలకు డిమాండ్ ఉందన్న విషయాన్ని గుర్తించిన ధీరేన్ సోలంకి.. గాడిద పాలను కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నాడు. కొన్ని కాస్మెటిక్ కంపెనీలకు కూడా గాడిద పాలు అమ్ముతున్నాడు. పాలు తాజాగా ఉండేందుకు వాటిని ఫ్రీజర్లలో భద్రపరుస్తున్నాడు. అలాగే గాడిద పాలను పొడిగా మార్చి కేజీ పాలపొడిని ఏకంగా రూ. లక్షకు విక్రయిస్తున్నాడు.

ఈ కామర్స్ సాయంతో  ముందడుగు
గాడిద పాలను దేశవ్యాప్తంగా విక్రయించేందుకు ధీరేన్ సోలంకి ఆన్ లైన్ బాటపట్టాడు. సొంతంగా ఆన్ లైన్ ప్లాట్ ఫాం ఏర్పాటు చేసుకొని గాడిద పాలను అధిక రేట్లకు అమ్ముతున్నాడు. ప్రస్తుతం లీటరు ఆవు పాల కనీస ధర రూ. 65 ఉండగా లీటరు గాడిద పాలు ఏకంగా రూ. 5,000 పలుకుతున్నాయి. నెలకు సుమారు రూ. 3 లక్షలు ఆర్జిస్తున్నాడు. లాభాలు బాగుండటంతో రూ. 38 లక్షలుపెట్టి డెయిరీ ఫాంను విస్తరించాడు. ప్రస్తుతం 42 గాడిదలు డెయిరీ ఫాంలో ఉన్నాయి.

లాభాలెన్నో..
ఆవు, గేదె పాలతో పోలిస్తే గాడిద పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గాడిద పాలలో ఔషధ గుణాలు ఉండటమే అందుకు కారణం. ఇవి తల్లి పాలను పోలి ఉంటాయి. అలాగే ఆవు పాలంటే ఎలర్జీ ఉండే శిశువులకు గాడిద పాలు సరైన ప్రత్యామ్నాయం. పేగుల్లోని మంచి బ్యాక్టీరియా వృద్ధికి, ఇమ్యూనిటీ పెరుగుదలకు దోహదపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిలో డయాబెటీస్ నిరోధక లక్షణాలు కూడా పుష్కలంగా వున్నాయట.

More Telugu News