Gujarat Titans: కీలక మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై గుజరాత్ టైటాన్స్ విక్టరీ

Sai Kishore leads Gujarat Titans to crucial win over clueless Punjab Kings
  • 3 వికెట్ల తేడాతో గెలుపు
  • 143 పరుగుల లక్ష్యం 19.1 ఓవర్లలో ఛేదన
  • 8 పాయింట్లతో 6వ స్థానానికి దూసుకెళ్లిన గుజరాత్ టైటాన్స్
పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరచుకోవడానికి కీలకమైన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయాన్ని సాధించింది. చంఢీగఢ్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 3 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. పంజాబ్ నిర్దేశించిన 143 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని ఆ జట్టు 19.1 ఓవర్లలో ఛేదించింది. 4 వికెట్లు తీసిన స్పిన్నర్ సాయి కిశోర్, బ్యాటింగ్‌లో 17 బంతుల్లో 32 పరుగులు బాదిన రాహుల్ తెవాటియా గుజరాత్ గెలుపులో ముఖ్యపాత్ర పోషించారు.

గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (35), సాయి సుదర్శన్ (31) కీలకమైన పరుగులు రాబట్టారు. మిగతా బ్యాటర్లలో వృద్ధిమాన్ సాహా (13), డేవిడ్ మిల్లర్ (4), ఒమర్జాయ్ (13), షారుఖ్ ఖాన్ (8), రషీద్ ఖాన్ (3), రవి శ్రీనివాసన్ సాయి కిశోర్ (0 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. ఇక పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్-3, లియామ్ లివింగ్‌స్టోన్-2, అర్షదీప్ సింగ్, సామ్ కర్రాన్ చెరో వికెట్ తీశారు.  

కాగా తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు సామ్ కర్రాన్, ప్రభ్‌సిమ్రాన్ చక్కటి ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 33 బంతుల్లోనే 52 పరుగులు జోడించారు. 21 బంతుల్లో 35 పరుగులు బాదిన ప్రభ్‌సిమ్రాన్ దానిని పెద్ద ఇన్నింగ్స్‌గా మార్చడంలో విఫలమయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. గుజరాత్ బౌలర్లలో సాయి కిశోర్ 4 వికెట్లు తీశాడు. మొహిత్ శర్మ, నూర్ అహ్మద్ చెరో 2, రషీద్ ఖాన్ - 1 చొప్పున వికెట్లు తీశారు.

కాగా ఈ విజయంతో శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్‌ టైటాన్స్ మొత్తం నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి చేరుకుంది. ఇక ఇప్పటివరకు 2 మ్యాచ్‌లు మాత్రమే గెలిచిన పంజాబ్ కింగ్స్ తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.
Gujarat Titans
Punjab Kings
IPL 2024
Sai Kishore

More Telugu News