Pawan Kalyan: బాబూ సజ్జలా... నా సంగతి నీకు తెలియదు: నరసాపురంలో పవన్ కల్యాణ్ ఫైర్

Pawan Kalyan warns Sajjala Ramakrishna Reddy
  • పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వారాహి విజయభేరి సభ
  • హాజరైన పవన్ కల్యాణ్
  • ఈ మధ్యన జగన్ ఎక్కువ మాట్లాడుతున్నాడన్న పవన్
  • జగన్ పేపర్లు లీక్ చేసుకునేటప్పుడు తాను చేగువేరా గురించి చదివానని వెల్లడి
  • సజ్జలా... మీకు డబ్బు, అధికారం ఎక్కువైపోయాయి అంటూ పవర్ ఫుల్ స్పీచ్

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి విచ్చేశారు. నరసాపురంలో వారాహి విజయభేరి సభకు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ... సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ ఈ మధ్యన సభల్లో ఎక్కువ మాట్లాడుతున్నాడని అన్నారు. జగన్ కు ఒకటే చెబుతున్నా... జగన్ నువ్వు శివశివానీ స్కూల్లో టెన్త్, ఇంటర్ పేపర్లు లీక్ చేస్తున్న సమయంలో నేను చేగువేరా గురించి చదువుతున్నా, నోవమ్ చోమ్ స్కీ వంటి పెద్దవాళ్ల గురించి చదువుతున్నా అని వ్యాఖ్యానించారు. 

నా దగ్గర నీ చిల్లర వ్యవహారాలు ఆపేసెయ్... మీరు నన్ను బూతులు తిట్టినా, నన్ను నానా అన్నా నేను పట్టించుకోను... నేను చాలా తెగించినవాడ్ని... నా తెగింపు ఎంతో జగన్ కు తెలియదు... నువ్వు ఎంత అనుకుంటే అందుకు పదింతలు ఎక్కువే ఉంటుందని పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

అన్నీ ఆలోచించిన తర్వాతే రాజకీయాల్లోకి వచ్చానని, తనకు భయాలేమీ లేవని అన్నారు. తాను ఒక సమస్యపై వేలెత్తి చూపించానంటే, ఆ సమస్య పరిష్కారం అయ్యేవరకు వేలెత్తి చూపిస్తూనే ఉంటానని అన్నారు. తాను రాజ్యాంగాన్ని సంపూర్ణంగా నమ్మానని, రాజ్యాంగాన్ని పూర్తిగా నమ్మినవాడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో జనసేన పార్టీ చేసి చూపిస్తుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. 

"నేను బయటికి వస్తే ఆయనకు చెందిన చాలా కుక్కలు బయటికి వస్తాయి. వాళ్ల ధైర్యం ఏమిటంటే పవన్ కల్యాణ్ మా సామాజిక వర్గం వాడు కాబట్టి మేం ఏదైనా అనొచ్చు అనుకుంటున్నారు. ఇలాంటి పిచ్చివాగుడు వాగితే  తన్ని తగలేస్తాను ఒక్కొక్కడ్ని. మేము మేము కాపులం... మేము మేము డాష్ డాష్ అంటే... పట్టకారు పెట్టి నాలుక బయటికి లాగుతా. పోనీలే అని చాలాసార్లు వదిలేస్తుంటా... పిచ్చి మాటలు మాట్లాడకండి. 

ఇవాళ సజ్జల గారు చిరంజీవి గురించి మాట్లాడుతున్నారు... ఎన్డీయే కూటమికి ఏపీలో వెన్నుదన్నుగా నిలిచే స్థాయికి పవన్ కల్యాణ్ ఎదిగాడంటే అది చిరంజీవి పుణ్యమే. చిరంజీవి స్థాయి వ్యక్తిని పట్టుకుని, ఎంతమంది వచ్చినా ఏమీ చేయలేరని సజ్జల అంటున్నారు. సజ్జలకు ఒకటే చెబుతున్నా... మీ అందరికీ డబ్బులు ఎక్కువైపోయాయి, అధికారం ఎక్కువైపోయింది, నోటికి ఏదొస్తే అది మాట్లాడడం అలవాటైపోయింది. 

సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చి చంద్రబాబుకు విషెస్ చెబితే ఆయన్ను కూడా తిట్టేస్తారు వీళ్లు. వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన పాలసీలు బాగున్నాయని చిరంజీవి గారు చెప్పినంతవరకు ఆయన మంచివాడే. కానీ ఇవాళ చిరంజీవి జనసేన పార్టీకి రూ.5 కోట్ల విరాళం ఇచ్చి, కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండని పిలుపు ఇవ్వగానే చెడ్డవారై పోయారా? 

వాళ్లెంతమంది వచ్చినా మేం సింహాలం సింగిల్ గా వస్తాం అంటున్నారు... ఎప్పుడైనా మీ ముఖాలు ఒక్కసారి అద్దంలో చూసుకున్నారా... సింహాల్లా ఉన్నారా మీరు? మీరు గుంటనక్కల సమూహంలా ఉన్నారు తప్ప... మీరా సింహాలు? 

గుంటనక్కలూ, తోడేళ్లు, ముళ్ల పందులూ కలిసి వస్తే, సింహంలా సింగిల్ గా ఎదుర్కొంటాం అని అంటున్నారు... బాబూ సజ్జల రామకృష్ణారెడ్డీ... నా సంగతి నీకు  తెలియదు. జగన్ కు కూడా నేను ప్రతి రోజూ చెబుతున్నా... నువ్వు కులాలను విడగొట్టి బాగుపడలేవు. నువ్వు కులాలను విడగొట్టే కొద్దీ నేను కులాలను ఏకం చేస్తాను" అంటూ వార్నింగ్ ఇచ్చారు. 

పదేళ్ల పాటు అనేక ఎత్తుపల్లాలను ఎదుర్కొన్న జనసేన ఇవాళ బలమైన పార్టీగా ఎన్నికల్లో నిలిచిందని పవన్ కల్యాణ్ అన్నారు. జగన్ వంటి నియంతను ఎదుర్కొనాలంటే ఎంతో బలం, తెగువ కావాలని అభిప్రాయపడ్డారు. తమ కుటుంబం నరసాపురం వంటి చిన్న ప్రాంతం నుంచి వచ్చిందని, సగటు మనిషి తాలూకు ఆవేదన తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని అన్నారు. 

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, తాను ఎంతో శ్రమించి, పెద్దలందరితో చర్చలు జరిపి కూటమిని తీసుకువచ్చానని పవన్ కల్యాణ్ వివరించారు. ఎందుకంటే... జగన్ పాలనలో నాశనమైన రాష్ట్రాన్ని తిరిగి బాగు చేసుకోవాలంటే కేంద్రం సహకారం ఎంతో అవసరం అని, అందుకే మోదీ, అమిత్ షాలతో మాట్లాడి మనం కలిసి పనిచేయాలని వారిని కోరానని వెల్లడించారు. యువత భవిష్యత్తు కోసమే తాను చొరవ తీసుకున్నానని చెప్పారు.

ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు... ఇదే జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి లక్ష్యం అని పవన్ స్పష్టం చేశారు. నదుల అనుసంధానం ద్వారా నీటి కొరత లేకుండా చూస్తామని, సాధ్యమైనంత త్వరగా పోలవరం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రతి చేతికి పని అందించేలా కృషి చేస్తామని అన్నారు. 

మూడు ఉచిత సిలిండర్ల హామీని తాము గత ఎన్నికల సమయంలోనే ఇచ్చామని, ఇప్పుడు కూడా అదే హామీతో వస్తున్నామని చెప్పారు. రైతులకు ఏడాది రూ.20 వేల ఆర్థికసాయం, మహిళలకు ప్రతి నెలా రూ.1500 ఆర్థికసాయం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం వల్ల ఆటో డ్రైవర్ల ఉపాధి దెబ్బతినకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. 

అన్న క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేసి పేదల ఆకలి తీర్చుతామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం బీసీ వర్గాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం నుంచి 24 శాతానికి రిజర్వేషన్లు తగ్గించిందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, ఆ రిజర్వేషన్లను మళ్లీ 34 శాతానికి పునరుద్ధరిస్తామని వెల్లడించారు. 

బీసీ, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లకుండా వారికే అందించేలా చూస్తామని చెప్పారు. వశిష్ట వారధి నిర్మించకుండా ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదని స్థానిక ఎమ్మెల్యేకు చెప్పండి అని జనసేనాని పిలుపునిచ్చారు. 

స్థానిక మహిళలు క్రొయేషియా లేసులు తయారు చేసేవారని, ఇంట్లో అల్లికలు చేసేవారని, ఒకప్పుడు వేలలో ఉండే వారు ఇప్పుడు ప్రోత్సాహం లేక వందల్లో ఉన్నారని పవన్ విచారం వ్యక్తం చేశారు. తాము ప్రభుత్వంలోకి వచ్చాక వారికి మార్కెటింగ్ సదుపాయాలు కల్పించి మహిళా సాధికారతకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

  • Loading...

More Telugu News