RCB: మ్యాచ్ అంటే ఇది... ఒక్క పరుగు తేడాతో ఓడిపోయిన ఆర్సీబీ

  • ఈడెన్ గార్డెన్స్ లో సస్పెన్స్ థ్రిల్లర్
  • చివరి బంతి వరకు సాగిన మ్యాచ్
  • బెంగళూరు జట్టుపై 1 పరుగు తేడాతో నెగ్గిన కోల్ కతా
  • తొలుత 20 ఓవర్లలో 6 వికెట్లకు 222 పరుగులు చేసిన కోల్ కతా
  • 20 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌట్ అయిన ఆర్సీబీ
  • ఆఖరి ఓవర్లో స్టార్క్ ను 3 సిక్సులు బాదిన కర్ణ్ శర్మ
RCB lost to KKR by one run

కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో నేడు అసలు సిసలైన క్రికెట్ సమరం ఆవిష్కృతమైంది. కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ ఓ సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్ లో బెంగళూరు జట్టు కేవలం 1 పరుగు తేడాతో ఓటమిపాలైంది. 

223 పరుగుల లక్ష్యఛేదనలో చివరి ఓవర్ లో బెంగళూరు జట్టుకు 21 పరుగులు అవసరం కాగా... ప్రపంచ అగ్రశ్రేణి బౌలర్ మిచెల్ స్టార్క్ విసిరిన ఆ ఓవర్లో కర్ణ్ శర్మ ఏకంగా మూడు సిక్స్ లు కొట్టి కోల్ కతా జట్టును దిగ్భ్రాంతికి గురిచేశాడు. 

అయితే 2 బంతుల్లో 3 పరుగులు చేస్తే గెలుస్తారనగా, మరో భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో కర్ణ్ శర్మ కాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు. చివరి బంతికి 3 పరుగులు కొడితే గెలుస్తారనగా, బెంగళూరు జట్టు చివరి బ్యాట్స్ మన్ లాకీ ఫెర్గుసన్ రెండో పరుగు తీసే క్రమంలో రనౌట్ అయ్యాడు. మరో పరుగు తీసినా మ్యాచ్ టై అయ్యేది. 

అంతకుముందు, ఈ మ్యాచ్ లో ఆర్సీబీ టాస్ గెలిచి కోల్ కతాకు బ్యాటింగ్ అప్పగించింది. కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 222 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో ఆర్సీబీ 20 ఓవర్లలో 221 పరుగులు చేసింది. బెంగళూరు ఇన్నింగ్స్ లో కోహ్లీ 18, కెప్టెన్ డుప్లెసిస్ 7 పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచారు. 

కోహ్లీ తాను అవుటైన విధానం పట్ల తీవ్ర ఆగ్రహంతో మైదానం వీడాడు. ఫుల్ టాస్ బంతిని నోబాల్ ప్రకటించాలని రివ్యూ తీసుకున్నా వ్యతిరేక ఫలితం రావడంతో కోహ్లీ మండిపడ్డాడు. అంపైర్ తో వాగ్వాదం పెట్టుకున్నాడు. 

డుప్లెసిస్ కూడా తక్కువ స్కోరుకే అవుటైనా... విల్ జాక్స్, రజత్ పాటిదార్ జోడీ అద్భుతంగా ఆడి బెంగళూరు స్కోరుబోర్డును వేగంగా ముందుకు తీసుకెళ్లింది. విల్ జాక్స్ 32 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సులతో 55 పరుగులు చేయగా... రజత్ పాటిదార్ 23 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సులతో 52 పరుగులు చేశాడు. 

ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన సుయాష్ ప్రభుదేశాయ్ 25, దినేశ్ కార్తీక్ 25 పరుగులు చేశారు. దినేశ్ కార్తీక్ అవుటయ్యే సమయానికి ఆర్సీబీ స్కోరు 19 ఓవర్లలో 8 వికెట్లకు 202 పరుగులు. దాంతో బెంగళూరు కథ ముగిసిందని అందరూ భావించారు. 

కానీ లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ కోల్ కతా బౌలర్ స్టార్క్ వేసిన బంతులను ఆఫ్ సైడ్ లో సిక్స్ లు కొట్టి ఔరా అనిపించాడు. కర్ణ్ శర్మ 7 బంతుల్లోనే 20 పరుగులు చేశాడు. దురదృష్టవశాత్తు స్టార్క్ కే క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 

కోల్ కతా బౌలర్లలో ఆండ్రీ రస్సెల్ 3, హర్షిత్ రాణా 2, సునీల్ నరైన్ 2, మిచెల్ స్టార్క్ 1, వరుణ్ చక్రవర్తి 1 వికెట్ తీశారు.

గుజరాత్ పై టాస్ నెగ్గిన పంజాబ్ కింగ్స్

ఐపీఎల్ లో నేడు డబుల్ హెడర్ కాగా... రెండో మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ ఆడుతున్నాయి. ఈ మ్యాచ్ కు ముల్లన్ పూర్ లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా నిలుస్తోంది. ఈ పోరులో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.

More Telugu News