Bandi Sanjay: కరీంనగర్ లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరు: బండి సంజయ్

Bandi Sanjay slams Congress and BRS
  • కరీంనగర్ లో రూ.12 వేల కోట్లతో అభివృద్ధి చేశామన్న బండి సంజయ్
  • కరోనా సమయంలో బీజేపీ అనేక సేవలందించిందని వెల్లడి
  • ఆ సమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు బయటికే రాలేదని ఆరోపణ
  • తాము రాముడి పేరు చెప్పుకుని రాజకీయాలు చేయడంలేదని స్పష్టీకరణ
  • కానీ అవతలివారు రాముడి పేరు చెబితే భయపడుతున్నారని ఎద్దేవా

కరీంనగర్ లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కూడా లేరని సిట్టింగ్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కరీంనగర్ లో రూ.12 వేల కోట్లతో అభివృద్ధి చేశామని బండి సంజయ్ వెల్లడించారు. కరోనా సమయంలో ప్రజలకు బీజేపీ అనేక సేవలు అందించిందని తెలిపారు. ఆ సమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు బయటికే రాలేదని ఆరోపించారు. 

బీఆర్ఎస్ లాగే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులను మోసం చేస్తోందని మండిపడ్డారు. రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని అన్నారు. తమ కార్యకర్తలు రాముడి గుడి కోసం ప్రాణత్యాగం చేశారని బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణలో రామరాజ్యం రావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. అలాగని, తాము రాముడి పేరు చెప్పుకుని రాజకీయాలు చేయడం లేదని స్పష్టం చేశారు. కానీ అవతలి వాళ్లు మాత్రం రాముడి పేరు చెప్పగానే భయపడుతున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు. 

"గతంలో బీఆర్ఎస్ వాళ్లు కేసులు పెట్టింది మాపైనే... జైలుకు వెళ్లింది మేమే. కానీ మీరు (ప్రజలు) ఓట్లు వేసింది మాత్రం కాంగ్రెస్ వాళ్లకు" అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. నేడు సిరిసిల్ల నియోజకవర్గంలో బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News