TikTok Ban: భారత్ బాటలో అమెరికా.. టిక్‌టాక్‌కు భారీ ఝలక్!

  • మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌తో అమెరికాలోని టిక్‌టాక్ సంబంధాలు తెంచేసుకోవాలంటూ దిగువసభలో బిల్లు
  • టిక్‌టాక్ అమెరికా విభాగాన్ని ఏడాదిలోపు మరో సంస్థకు విక్రయించాలంటూ నిబంధన
  • నిబంధన అతిక్రమిస్తే నిషేధం తప్పదని హెచ్చరిక
  • భారీ మెజారిటీతో బిల్లును ఆమోదించిన దిగువసభ
  • వచ్చే వారం ఎగువసభ ముందుకు రానున్న బిల్లు
  • బిల్లుకు తాము పూర్తి మద్దతు ఇస్తామన్న అమెరికా అధ్యక్షుడు 
US Lawmakers Vote To Ban TikTok If It Doesnt Cut Ties to China

భారత్ బాటలోనే నడుస్తున్న అమెరికా.. ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్‌కు భారీ ఝలక్ ఇచ్చింది. చైనాలోని మాతృ సంస్థ బైట్‌డ్యాన్స్‌తో టిక్‌టాక్ సంబంధాలు తెంచుకోకపోతే యాప్‌పై నిషేధం విధిస్తామని హెచ్చరించింది. టిక్‌టాక్‌ను ఏడాది లోపు మరో సంస్థకు విక్రయించాలంటూ అమెరికా దిగువసభ ఓ బిల్లును ఆమోదించింది. బిల్లుకు 360 మంది సభ్యులు అనుకూలంగా, 58 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ఆరు నెలల నుంచి ఏడాదిలోపు బైట్‌డ్యాన్స్, టిక్‌టాక్ నుంచి పెట్టుబడులు పూర్తిగా ఉపసంహరించుకోవాలని బిల్లులో పేర్కొన్నారు.

‘‘చైనా ప్రతికూల ప్రభావం నుంచి అమెరికన్లను, ముఖ్యంగా అమెరికా చిన్నారులను కాపాడేందుకు ఈ బిల్లు రూపొందించాము. అమెరికన్ల ఫోన్లలో చొరబడ్డ ఓ నిఘా యాప్ ఇది’’ అని బిల్లు రూపకర్త, ప్రతినిధుల సభ సభ్యుడు టెక్సాస్ నేత మైఖేల్ మెక్‌కాల్ అన్నారు. ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్‌లకు మరింత ఆర్థికసాయం అందించేందుకు ఉద్దేశించిన బిల్లులో భాగంగా టిక్‌టాక్‌ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. వచ్చే వారం ఈ బిల్లు ఎగువ సభ ముందుకు రానుంది. తాను ఈ బిల్లుకు పూర్తిగా మద్దతు ఇస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా పేర్కొన్నారు. 

కాగా, ఈ బిల్లును టిక్‌టాక్ ఖండించింది. ఈ బిల్లుతో 170 మిలియన్ల మంది అమెరికన్ల భావప్రకటనా స్వేచ్ఛను అణిచివేస్తున్నారంటూ మండిపడింది. ఏడు మిలియన్ వ్యాపారాలకు ఈ బిల్లు అశనిపాతమని పేర్కొంది. అమెరికా ఆర్థికవ్యవస్థకు ఏటా 24 మిలియన్ డాలర్ల ఆదాయం చేకూర్చే యాప్‌పై వేటు వేస్తున్నారని పేర్కొంది. అయితే, ఈ బిల్లును టిక్‌టాక్ కోర్టులో సవాలు చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. 

స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఈ బిల్లుకు వ్యతిరేకంగా టిక్‌టాక్ భారీగా లాబీయింగ్ చేసింది. యాప్ యూజర్లు చట్టసభ సభ్యులకు ఫోన్ చేసి తమ వ్యతిరేకత తెలియజేయాలని ప్రోత్సహించింది. అయితే, టిక్‌టాక్ ఈ స్థాయిలో లాబీయింగ్‌కు దిగడం అమెరికా చట్టసభ్యులకు ఆగ్రహం తెప్పించిందని సమాచారం. 

చైనాతో ప్రమాదాలపై అమెరికాలో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికన్ల డేటాను టిక్‌టాక్ చైనాకు చేరవేయొచ్చని అనేక మంది భావిస్తున్నారు. చైనా అనుకూల వీడియోలను ప్రోత్సహించి, వ్యతిరేక వీడియోలను కూడా కట్టడి చేయొచ్చని చెబుతున్నారు. టిక్‌టాక్‌తో పొంచి ఉన్న ప్రమాదంపై చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, పలు అమెరికా రాష్ట్రాలు, ప్రభుత్వ ఏజెన్సీలు ఇప్పటికే టిక్‌టాక్ వినియోగంపై ఆంక్షలు విధించాయి. ప్రభుత్వ డివైజుల్లో ఈ యాప్‌ వినియోగించొద్దని పేర్కొంది.

More Telugu News