Indian Railways: మాపై దుష్ప్రచారం జరుగుతోంది: రైల్వే శాఖ

  • ఏసీ కోచ్‌ల్లో రద్దీపై పలు వీడియోలు వైరల్
  • నిర్వహణ సరిగా లేదంటూ రైల్వేపై విమర్శలు
  • వైరల్ వీడియోలపై రైల్వే శాఖ స్పందన
  • అవన్నీ పాత వీడియోలని, తప్పుదారి పట్టించేవని వివరణ
  • తప్పుడు వీడియోలను షేర్ చేయొద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి
Railways Ministry Dismisses Claims Of Mismanagement Overcrowding Says Dont Share Misleading Videos

రైళ్లల్లో ఏసీ కోచ్‌లల్లో విపరీతమైన రద్దీ ఉందంటూ ఇటీవల తెగ వైరల్ అవుతున్న వీడియోలపై రైల్వే శాఖ తాజాగా స్పందించింది. అవి పాత వీడియోలన్న రైల్వే.. తమ ఇమేజ్‌ను దెబ్బతీసే వీడియోలను షేర్ చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. తమ ప్రతిష్ట దెబ్బతీసేలా ప్రచారం జరుగుతోందని రైల్వే శాఖ ఆరోపించింది. ఏసీ కోచుల్లో రద్దీ విపరీతంగా ఉందంటూ పాత, తప్పుడు వీడియోలను యూజర్లు షేర్ చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. వీడియోలపై ఆరా తీయగా క్షేత్రస్థాయిలో ఎటువంటి తప్పులు జరగలేదని తేలినట్టు పేర్కొంది. తాము ఒక్కో ఘటనపై సామాజిక మాధ్యమాల్లో వివరణ ఇస్తున్నామని కూడా రైల్వే శాఖ పేర్కొంది. 

తమ ప్రతిష్ఠను దిగజార్చేందుకు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోందని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి. వీడియోల్లోని ఘటనలకు సంబంధించి ఆధారాలేవీ లభ్యం కాలేదని పేర్కొన్నాయి. 

కాగా, ఓ వినియోగదారుడి ఫిర్యాదుపై స్పందించిన రైల్వే శాఖ.. ఏసీ కోచ్‌ల్లో తాజా పరిస్థితిపై ప్రకటన విడుదల చేసింది. ‘‘ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఎక్కడా రద్దీ లేదు. దయచేసి మా ప్రతిష్ఠకు భంగం కలిగించొద్దు. సేవాలోపాల పేరిట దయచేసి పాత వీడియోలు షేర్ చేయొద్దు. రైళ్లల్లో ప్రస్తుత పరిస్థితిని గమనించండి. భారతీయ రైల్వే ప్రస్తుతం రికార్డు స్థాయిలో అదనపు రైళ్లను నడిపిస్తోంది’’ అని రైల్వే శాఖ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. 

కైఫియత్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రయాణికుడు రద్దీ భరించలేక కిటీకీ అద్దం పగలగొట్టినట్టు ఉన్న వీడియోపై కూడా రైల్వే స్పందించింది. అసలు ఇలాంటి ఘటనే జరగలేదని తమ అంతర్గత దర్యాప్తులో తేలిందని పేర్కొంది. తప్పుడు వీడియోలు, వదంతులను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

More Telugu News