Chandrababu: కేజీఎఫ్-3ని చూడాలంటే సర్వేపల్లికి రావాలి: చంద్రబాబు

  • నెల్లూరు జిల్లా పొదలకూరులో ప్రజాగళం సభ
  • ఎండల బాదుడు కంటే వైసీపీ బాదుడే ఎక్కువగా ఉందన్న చంద్రబాబు
  • ప్రజాగ్నిలో మే 13న వైసీపీ మాడి మసైపోతుందని వ్యాఖ్యలు
Chandrababu speech in Podalakuru

టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరులో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.... ఈ ఎండల కారణంగా కలుగుతున్న మంట కంటే, ఈ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న మంటే ఎక్కువగా ఉందని అన్నారు. 

ఎండల బాదుడు కంటే వైసీపీ ప్రభుత్వ బాదుడే ఎక్కువగా ఉందని ఈ సభను చూస్తే అర్థమవుతోందని, రాజకీయ వేడి ముందు వేసవి వేడి కొట్టుకుపోతుందని పేర్కొన్నారు. ఈ అగ్నిలో మే 13న వైసీపీ మసైపోతుందని వ్యాఖ్యానించారు. 

"ఈ ముఖ్యమంత్రికి ఒళ్లంతా అహంకారం. ఎక్కడికక్కడ దోచుకోవడం తప్ప ఇంకేమీ తెలియదు. ఇలాంటి ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాలి. ఇందాక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొన్ని విషయాలు చెప్పారు. నేను ఎప్పుడో కేజీఎఫ్-1, కేజీఎఫ్-2 అని విన్నాను. ఎందుకంటే, నా నియోజకవర్గం కుప్పం పక్కనే కేజీఎఫ్ ఉంటుంది. కుప్పంలో కూడా గోల్డ్ మైన్స్ ఉన్నాయి. 

కానీ కేజీఎఫ్-1, కేజీఎఫ్-2 చూడాలంటే కోలార్ వెళ్లాలి... కేజీఎఫ్-3 చూడాలంటే సర్వేపల్లికి రావాలి. కేజీఎఫ్ అంటే కాకాణి గోవర్ధన్ ఫీల్డ్స్. కాకాణీ... కేజీఎఫ్ ను సృష్టించుకున్నావు... అందులోనే నిన్ను పాతిపెడతా!

అక్రమంగా క్వార్ట్జ్ తవ్వకాలు, సిలికా తవ్వకాలు, గ్రావెల్ తవ్వకాలు... ఈ అవినీతి మంత్రి ఎంత లోతుకు కూరుకుపోయాడంటే... మళ్లీ పైకొచ్చే అవకాశమే లేదు... శాశ్వతంగా గోతిలోనే ఉంటాడు! నువ్వు తవ్విన గోతులే, నువ్వు కొట్టిన కొండలే, నువ్వు దోచిన ఈ సహజ వనరులే నీ రాజకీయ జీవితానికి సమాధి కట్టబోతున్నాయి... ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. 

ఇది కాకాణి ఇలాకా... ఆయన వ్యవసాయ మంత్రిగా ఉన్నారు. ఆయనకు రైతుల కష్టాలు తెలుసా? రైతులకు ఆయన వల్ల మేలు జరిగిందా? ఇలాంటి మంత్రి ఉండడం సర్వేపల్లికి పట్టిన ఖర్మ! 

ఈయన అరాచకాలు, అక్రమ టోల్ గేట్ తో కృష్ణపట్నం నుంచి కంటైనర్ టెర్మినల్ తమిళనాడుకు వెళ్లిపోయింది... తద్వారా 10 వేల మంది ఉపాధి కోల్పోయారు. మితిమీరిన జోక్యం, మితిమీరిన దోపిడీతో ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు. అలాంటి వ్యక్తిపై పోరాడి పోరాడి సోమిరెడ్డి బక్కచిక్కిపోయాడు... అతడు మాత్రం దోచుకుని దోచుకుని ఒళ్లు బలిసిపోయింది. 

ఈ గూడూరు ప్రాంతంలో ఒక్క సిలికా ద్వారానే రూ.4,500 కోట్లు దోపిడీ జరిగింది. లీజుదారులను తరిమేసి టన్నుకు రూ.1400 వసూలు చేస్తున్నారు. క్వార్ట్జ్ టన్ను రూ.3 వేలు ఉంటే, అక్రమంగా తవ్వేస్తూ రూ.50 వేలకు అమ్ముకుంటున్నారు. క్వార్ట్జ్ లోనూ దాదాపుగా రూ.4 వేల కోట్లు దోచేశారంటే వీళ్లను ఏమనాలి?" అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.

More Telugu News