Sundar Pichai: పనిపై దృష్టిపెట్టండి.. నిరసనలపై కాదు: సుందర్ పిచాయ్

  • బ్లాగ్ పోస్ట్ లో ఉద్యోగులకు గూగుల్ సీఈవో హెచ్చరిక
  • సహోద్యోగులను ఇబ్బంది పెట్టే ప్రవర్తనను ఉపేక్షించేది లేదని స్పష్టీకరణ
  • కంపెనీ ఆవరణలో నిరసనలు చేపట్టిన 28 మందిని ఇటీవలే తొలగించిన గూగుల్
focus on work not protests says sundar pichai

కృత్రిమ మేథ (ఏఐ) రేసులో వెనకబడిన టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ ఈ విషయంలో మరింత శ్రమించేందుకు సిద్ధమవుతోంది. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఈ విషయంలో ఎంతో మొండిగా ఉన్నారు. పనికి ఆటంకం కలిగించే లేదా తోటి ఉద్యోగులను ఇబ్బంది పెట్టే ప్రవర్తనను సంస్థ ఉపేక్షించేది లేదని ఆయన తేల్చిచెప్పారు. ఈ వారం చేసిన ఒక బ్లాగ్ పోస్ట్ లో సుందర్ పిచాయ్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

 “గూగుల్ ఉద్యోగులు పనిపై దృష్టి పెట్టాలి. ఆఫీసు ప్రదేశాన్ని ఉత్పత్తుల తయారీకి ఉపయోగించాలి తప్ప వ్యక్తిగత వేదికగా మార్చుకోరాదు. ఇది ఒక వ్యాపారం. అంతేకానీ సహోద్యోగులకు ఆటంకాలు సృష్టించేందుకు లేదా వారి భద్రతకు భంగం కలిగించేందుకు కంపెనీని వ్యక్తిగత వేదికగా ఉపయోగించుకొనే ప్రదేశం కాదు.  అలాగే పనికి భంగం కలిగించే అంశాలు లేదా రాజకీయాలపై చర్చించే వేదిక కాదు. ఒక కంపెనీగా మనం దృష్టిమరల్చేందుకు ఇది ఏమాత్రం సరైన సందర్భం కాదు” అని ఆ బ్లాగ్ లో సుందర్ పిచాయ్ పేర్కొన్నారు.

గూగుల్ ఉద్యోగులు ఆఫీసుల వద్ద నిరసనలకు దిగడం ఇది తొలిసారి ఏమీ కాదు. కానీ నిరసనలు చేపట్టిన విధానం, చేస్తున్న సందర్భం కంపెనీకి, పిచాయ్ కు ఏమాత్రం రుచించడం లేదు. వివిధ సీక్రెట్ ప్రాజెక్టులపై ప్రభుత్వాలతో కలసి పనిచేసిన చరిత్ర గూగుల్ కు ఉంది. అయితే ఇది కొందరు ఉద్యోగుల కోపానికి కారణం అవుతోంది. చివరకు అది బహిరంగంగానూ వెల్లడవుతోంది.

ఇజ్రాయెల్ తో క్లౌడ్ సేవల కోసం గూగుల్ ఇజ్రాయెల్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు రావడం తదనంతర పరిణామాలు సంస్థలో ఇటీవల కొందరు ఉద్యోగుల తొలగింపునకు దారితీశాయి. ఈ ఒప్పందాన్ని నిరసస్తూ జరిగిన నిరసనల్లో పాల్గొన్న 28 మందిని గూగుల్ తొలగించింది. వారిలో 9 మంది ఉద్యోగులను సస్పెండ్ చేయగా పోలీసులు అరెస్టు చేసినట్లు ‘ద వెర్జ్’ పేర్కొంది.

More Telugu News