Bengaluru Rain: ఎట్టకేలకు బెంగళూరులో వర్షం.. వీడియో ఇదిగో!

  • 5 నెలల తర్వాత బెంగళూరును పలకరించిన వరుణుడు
  • శుక్రవారం రాత్రి యలహంకలో కొద్దిసేపు కురిసిన వాన
  • శనివారం సిటీ అంతటా కమ్ముకున్న మేఘాలు
Bengaluru 150 Day Dry Spell Broken

ఎండల తీవ్రతకు నీటి కరవుతో అల్లాడుతున్న బెంగళూరు సిటీని వరుణుడు కరుణించాడు. దాదాపు ఐదు నెలల తర్వాత శుక్రవారం రాత్రి సిటీ శివార్లలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. యలహంక, కెంగెరి సహా పలుచోట్ల కొద్దిపాటి వర్షం కురిసిందని బెంగళూరు వెదర్ మ్యాన్ ట్వీట్ చేశారు. శనివారం సిటీని మేఘాలు కమ్ముకున్నాయని, మరిన్నిచోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు. శుక్రవారం రాత్రి రాజరాజేశ్వరి నగర్ లో 0.29 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని కర్ణాటక స్టేట్ నేచురల్ డిజాస్టర్ మానిటరింగ్ సెంటర్ (కేఎస్ఎన్ డీఎంసీ) ఓ ప్రకటనలో తెలిపింది. దాసరహళ్లిలో 0.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని పేర్కొంది. దీంతో బెంగళూరులో ఎండల తీవ్రత తగ్గుతుందని, శనివారం ఆకాశంలో దట్టమైన మేఘాలు అలముకున్నాయని తెలిపింది.

2024 లో ఇప్పటి వరకూ బెంగళూరులో చుక్క వర్షం కూడా కురవలేదని వాతావరణ శాఖ పేర్కొంది. గతేడాది చివరిలోనూ వర్షం కురవకపోవడంతో బెంగళూరులో నీటికి కటకట ఏర్పడిందని చెప్పింది. సాధారణంగా ఏటా జనవరి, ఫిబ్రవరి నెలల్లో వర్షం కురవకపోయినా మార్చిలో వర్షపాతం నమోదవుతోందని వివరించింది. అయితే, ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది మాత్రం వరుసగా ఐదు నెలలుగా చుక్క వాన కూడా పడలేదని పేర్కొంది. దీంతో బెంగళూరులో ఎండల తీవ్రత విపరీతంగా పెరిగిపోయిందని చెప్పింది. ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల దాకా చేరాయని తాజాగా శుక్రవారం కురిసిన వర్షంతో శనివారం 23 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వివరించింది. రాబోయే రోజుల్లోనూ కాస్త అటూఇటుగా ఇదే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

More Telugu News