IPL 2024: ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే తొలిసారి.. ఒకే మ్యాచ్‌లో ఇద్ద‌రు కెప్టెన్ల‌కు జ‌రిమానా!

  • రుతురాజ్ గైక్వాడ్ (సీఎస్‌కే), కేఎల్‌ రాహుల్ (ఎల్ఎస్‌జీ) కు రూ.12 ల‌క్ష‌ల చొప్పున జ‌రిమానా
  • స్లో ఓవ‌ర్ రేట్ కార‌ణంగానే ఫైన్ వేసిన‌ట్లు బీసీసీఐ ప్ర‌క‌ట‌న‌
  • నిన్న ఏకనా స్టేడియం వేదిక‌గా సీఎస్‌కే, ఎల్ఎస్‌జీ మ‌ధ్య‌ మ్యాచ్‌
  • చెన్నైపై ల‌క్నో ఎనిమిది వికెట్ల తేడాతో సునాయాస విజయం  
KL Rahul and Ruturaj Gaikwad Punished With Heavy Fines After LSG vs CSK IPL 2024 Match

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) చ‌రిత్ర‌లోనే తొలిసారి ఒకే మ్యాచ్‌లో ఇద్ద‌రు కెప్టెన్ల‌కు జ‌రిమానా పడింది. నిన్న‌టి చెన్నై సూప‌ర్ కింగ్స్‌, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ మ్యాచ్‌లో స్లో ఓవ‌ర్ రేట్ న‌మోదైంది. దీంతో రెండు జట్ల కెప్టెన్లు రుతురాజ్ గైక్వాడ్ (సీఎస్‌కే), కేఎల్‌ రాహుల్ (ఎల్ఎస్‌జీ) భారీ జరిమానాలు ఎదుర్కొన్నారు. నిర్ణీత స‌మ‌యానికి బౌలింగ్ కోటాల‌ను పూర్తి చేయ‌క‌పోవ‌డంతో ఇరు జ‌ట్ల సార‌ధుల‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రూ. 12 ల‌క్ష‌ల చొప్పున జ‌రిమానా విధించింది. 

"మినిమమ్ ఓవర్ రేట్‌కు సంబంధించి ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఈ సీజన్‌లో అతని జట్టు చేసిన మొదటి నేరం కావడంతో రాహుల్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించడం జ‌రిగింది" అని బీసీసీఐ త‌న‌ ప్రకటనలో పేర్కొంది. అలాగే చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు కూడా స్లో ఓవర్ రేట్ నేరం కారణంగా రూ. 12 లక్షల జరిమానా విధించిన‌ట్లు తెలిపింది.

ఇక ఈ మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. చెన్నైపై ల‌క్నో ఎనిమిది వికెట్ల తేడాతో సునాయాస విజయం సాధించింది. ఓపెనింగ్ ద్వయం క్వింటన్ డి కాక్ (54), కెప్టెన్ కేఎల్‌ రాహుల్ (82) 132 పరుగుల భాగస్వామ్యంతో జ‌ట్టు గెలుపున‌కు పునాది వేశారు. ఆ త‌ర్వాత‌ నికోలస్ పూరన్ అజేయంగా 23 ప‌రుగులు చేసి ల‌క్ష్యఛేద‌నలో త‌న‌వంతు పాత్ర పోషించాడు. దీంతో 177 పరుగుల లక్ష్యాన్ని ఎల్‌ఎస్‌జీ 19 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

కాగా, ఈ మ్యాచ్‌లో ఓట‌మితో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో 8 పాయింట్ల‌తో మూడవ స్థానంలో ఉంది. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ 7 మ్యాచులు ఆడి 4 విజయాలతో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది.

More Telugu News