Harshika Poonacha: కన్నడలో మాట్లాడిందని సినీ నటి హర్షికపై 30 మంది గుంపు దాడి.. ఇండియాలోనే ఉన్నామా? అని ఆవేదన

Kannada actress Harshika Poonacha attacked by mob in Bengaluru
  • రెండ్రోజుల క్రితం రెస్టారెంట్ బయట దాడి జరిగిందన్న హర్షిక
  • కన్నడ మాట్లాడే వారికి గుణపాఠం చెబుతామని గుంపు హెచ్చరించిందన్న నటి
  • భౌతికదాడికి యత్నించారని ఆరోపణ
  • పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆసక్తి చూపలేదని ఆవేదన
  • ముఖ్యమంత్రి సిద్దరామయ్య జోక్యంచేసుకోవాలని విజ్ఞప్తి
  • బుజ్జగింపు రాజకీయాల్లో ఇలానే జరుగుతుందన్న బీజేపీ నేత అశోక
కన్నడ చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నటి హర్షిక పూనచ్చపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కన్నడ మాట్లాడినందుకే తనపై దాడి జరిగిందని నటి ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కర్ణాటక పోలీసులు జోక్యం చేసుకుని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తనపై దాడి తర్వాత బెంగళూరు వీధుల్లోకి రావాలంటేనే భయమేస్తోందని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో నటి ఓ వీడియోను పోస్టు చేశారు. 

రెండ్రోజుల క్రితం కుటుంబంతో కలిసి ఓ రెస్టారెంట్‌లో భోజనం చేసి బయటకు వచ్చాక తమ కారు వద్దకు ఇద్దరు వ్యక్తులు వచ్చి వాగ్వివాదానికి దిగారని, ఆ తర్వాత క్రమంగా వారి సంఖ్య 20 నుంచి 30కి పెరిగిందని చెప్పారు. వారిలో ఇద్దరు తన భర్త ముఖంపై దాడికి ప్రయత్నించారని తెలిపారు. ఆ తర్వాత ఆయన మెడలోని బంగారం గొలుసు లాక్కునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. బంగారు గొలుసు, ఇతర విలువైన వస్తువులు లాక్కునేందుకు చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో కారుపై దాడి ప్రారంభించారని తెలిపారు.

తనను, తన భర్తను శారీరకంగా హింసించే ప్రయత్నం చేశారని అయితే, తమ వాహనంలో మహిళలు, కుటుంబ సభ్యులు ఉండడం వల్ల తన భర్త ఎదురుదాడికి దిగలేదని వివరించారు. కన్నడ భాష మాట్లాడేవారికి తగిన గుణపాఠం చెబుతామని వారు హెచ్చరించారని పేర్కొన్నారు. తామే కాదని, రాష్ట్రంలోని ఎంతోమంది మహిళలు, కుటుంబాలు ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నాయని తెలిపారు.

 శాంతియుతంగా ప్రవర్తించే వారితో గొడవలు పెట్టే హక్కు ఎవరికీ లేదన్న హర్షిక.. ఇలాంటి ఘటనలు చూస్తుంటే మనం పాకిస్థాన్ లేదంటే ఆఫ్ఘనిస్థాన్ వంటి దేశాల్లో జీవిస్తున్నామా? అన్న అనుమానం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక కన్నడ భాషలో మాట్లాడడం కూడా తప్పేనా? అని ప్రశ్నించారు. ఈ ఘటన తనను చాలాకాలంపాటు వేధిస్తుందని తెలిపారు.
 
ఈ ఘటనపై బీజేపీ నేత, ప్రతిపక్ష నాయకుడు ఆర్.అశోక స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో బుజ్జగింపు రాజకీయాల వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.
Harshika Poonacha
Kannada Actress
Bengaluru
Attack

More Telugu News