KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైపై లక్నో విక్టరీ

Rahul and de Kock help Lucknow overpower Chennai by eight wickets
  • 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన లక్నో సూపర్ జెయింట్స్
  • 82 పరుగులతో రాణించిన కెప్టెన్ కేఎల్ రాహుల్
  • సొంత మైదానంలో చెన్నైకి చెక్ పెట్టిన లక్నో
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్, క్వింటన్ డికాక్ అర్ధసెంచరీ దన్నుతో ఐపీఎల్-2024లో లక్నో సూపర్ జెయింట్స్ మరో విజయాన్ని నమోదు చేసింది. వరుస ఓటములతో సతమతమవుతున్న ఆ జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సొంత మైదానంలో 177 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన లక్నో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 19 ఓవర్లలోనే ఛేదించింది. 53 బంతుల్లో 82 పరుగులు బాదిన కెప్టెన్ కేఎల్ రాహుల్ లక్నో గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఇక ఓపెనర్ క్వింటన్ డికాక్‌ కూడా అర్ధ సెంచరీతో (54) రాణించడంతో లక్నో గెలుపు సునాయాసమైంది. 

31 బంతుల్లో 43 పరుగులే చేయాల్సిన కీలక స్థితిలో డికాక్‌ ఔటైనప్పటికీ పూరన్‌ (23 నాటౌట్‌), రాహుల్‌ కలిసి జట్టుని విజయతీరాలకు తీసుకెళ్లారు. 3 ఓవర్లలో 16 పరుగులు చేయాల్సిన సమయంలో రాహుల్‌ ఔట్ అయ్యాడు. అయితే స్టాయినిస్‌ (8 నాటౌట్‌), పూరన్‌ కలిసి సులభంగా ఆ పరుగులు రాబట్టారు. చెన్నై బౌలర్లలో మతీశ పతిరన, ముస్తాఫిజుర్ చెరో వికెట్ తీశారు.

కాగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా 57 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాటర్లలో రహానె (36), మొయిన్‌ అలీ (30), ఎంఎస్ ధోని (28 నాటౌట్‌) చొప్పున కీలకమైన పరుగులు రాబట్టారు. ముఖ్యంగా ఎంఎస్ ధోనీ మరోసారి దూకుడుగా ఆడాడు. 17 ఓవర్లలో 123 పరుగులుగా ఉన్న చెన్నై స్కోరు ధోనీ బాదుడుతో 20 ఓవర్లు ముగిసే సరికి 176 పరుగులకు చేరింది. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా 2 వికెట్లు, మోహ్సిన్ ఖాన్, యశ్ థాకూర్, రవి బిష్ణోయ్, స్టోయినిస్ తలో వికెట్ తీశారు.
KL Rahul
de Kock
IPL 2024
Chennai Super Kings
Lucknow Super Gaints

More Telugu News