Chandrababu: ఇవాళ కూడా పవన్ కల్యాణ్ ను ఇష్టానుసారం తిట్టాడు: చంద్రబాబు

  • రాయదుర్గంలో టీడీపీ ప్రజాగళం సభ
  • సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్
  • తనకే తెలివి ఉందనుకుంటున్నాడా అంటూ ఆగ్రహం
  • అబద్ధాలు చెప్పడం అతడికి పుట్టుకతో వచ్చిన విద్య అని విమర్శలు
Chandrababu speech in Rayadurgam

టీడీపీ అధినేత చంద్రబాబు అనంతపురం జిల్లా రాయదుర్గంలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. తన ప్రసంగంలో ఆయన సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. జనాలకు తెలివి లేదనుకుంటున్నాడా? జగన్ ఒక్కడికే తెలివి ఉందనుకుంటున్నాడా? అని ధ్వజమెత్తారు. ప్రజలకు ఇచ్చిన దాని కంటే ప్రజలపై మోపిన అప్పులే ఎక్కువని, ఇచ్చిన దాని కంటే దోచుకున్నదే ఎక్కువని అన్నారు. మోసం చేయడంలో జగన్ మోహన్ రెడ్డి దిట్ట అని చంద్రబాబు విమర్శించారు. అబద్ధాలు చెప్పడం అతడికి పుట్టుకతో వచ్చిన విద్య అని అన్నారు. 

నిన్ను తిట్టాలంటే నాకు నిమిషం పని

ఈ రాష్ట్రంలో ఎవరికైనా స్వేచ్ఛ ఉందా? ఇవాళ కూడా పవన్ కల్యాణ్ ను ఇష్టానుసారం తిట్టాడు. నా మీద నోరు పారేసుకున్నాడు. నిన్ను బూతులు తిట్టాలంటే నాకు ఒక్క నిమిషం పని... ఇతడి వల్ల తన ముఖ్యమంత్రి పదవి పోతుందని తండ్రి ఇతడిని బెంగళూరుకు తరిమేశాడు. తల్లిదండ్రులకు భారమైన కొడుకు ఇతను. భూమికి, సమాజానికి కూడా భారం. ఈ ఐదేళ్లలో రాష్ట్రం సర్వనాశనం అయింది. ఈయన పరిపాలన విధ్వంసంతోనే ప్రారంభమైంది. ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టి, అమరావతిని కూడా నాశనం చేశాడు.

ఈసారి ప్రజాగ్రహానికి వైసీపీ మసైపోవడం ఖాయం

ఐదేళ్ల సైకో పాలనలో మీరు ఏం నష్టపోయారో చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. వైసీపీ పాలన పట్ల ప్రజల్లో ఉన్న ఆగ్రహానికి ఆ పార్టీ మసైపోవటం ఖాయం. వైసీపీ పాలనలో మీ పొలాలకు నీళ్లోచ్చాయా? మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా? నీళ్లు ఉంటే వ్యవసాయం అభివృద్ది చెందుతుంది, పరిశ్రమలు వస్తాయి. టీడీపీ హయాంలో ఇచ్చిన నీళ్లు తప్ప ఇప్పుడు చుక్క నీళ్లిచ్చారా? 

ప్రపంచాన్ని శాసించే శక్తి తెలుగు జాతికి ఉంది. మన పిల్లల్ని బాగా చదివిస్తే ప్రయోజకులవుతారు. స్కూళ్లకు రంగులు పూస్తే పిల్లలకు చదువులు రావు. టీచర్లను నియమించి స్కూళ్లలో కనీస సదుపాయాలు కల్పించాలి. నేడు 3 కి.మీ దూరంలో ఉన్న పాఠశాలలకు వెళ్లలేక బాలికలు చదువు మానేస్తున్నారు. 5 ఏళ్లలో ఒక్క టీచర్ ఉద్యోగం భర్తీ చేయలేదు. 

రాయలసీమకు జగన్ చేసిందేంటి? 

గత ఎన్నికల్లో సీమలో 52 సీట్లకు గానూ 49 సీట్లలో వైసీపీని గెలిపించారు. మీరు ఎందుకలా చేశారో నాకు అర్థం కాదు. కానీ, మీకు జగన్ ఏం చేశాడు? ఐదేళ్లలో మీ జీవితాల్లో మార్పులేమైనా వచ్చాయా? ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా? టీడీపీ హయాంలో ఏం అభివృద్ది చేశామో నేను చెబుతా...జగన్ ఏం చేశాడో చెప్పగలడా అని సవాల్ విసురుతున్నా? 

రాయలసీమలో ప్రాజెక్టుల కోసం నేను రూ. 12 వేల కోట్లు ఖర్చు చేస్తే జగన్ ఖర్చు చేసింది కేవలం రూ. 2500 కోట్లు మాత్రమే. రాయలసీమకు కృష్ణా జలాలు తీసుకురావాలని ఎన్టీఆర్ హంద్రీనీవా ప్రారంభించారు. నేను హంద్రీ నీవా కోసం 5 ఏళ్లలో రూ.4500 కోట్లు ఖర్చు చేశా. తుంగభద్ర నుంచి నీళ్లు రాకుండా హెచ్ఎన్సీ పూడిపోతే కర్ణాటక సీఎంతో మాట్లాడి దాన్ని ఆధునికీకరణ చేశాం. నేడు దాన్ని అటకెక్కించారు. 

జీడిపల్లి, గొల్లపల్లి రిజర్వాయర్లు పూర్తి చేశాం. అనంతపురంకు కియా తెచ్చాం. నేడు 12 లక్షల కార్లు ఏపీ నుంచి ఉత్పత్తి అయ్యాయి. ఇది మనకు గర్వకారణం. మిమ్మల్ని చూస్తే ఏం గుర్తొస్తుందని జగన్ అంటున్నారు. నన్ను చూస్తే అడుగడుగునా నేను చేసిన అభివృద్ధి కనిపిస్తుంది. జగన్ ని చూస్తే గుర్తొచ్చేది విధ్వంసం. బైరవాని తిప్ప ప్రాజెక్టు పూర్తి చేశాం. మళ్లీ టీడీపీ ప్రభుత్వం వచ్చి ఉంటే ఏడాదిలో నీళ్లు వచ్చేవి. 

రేపు ఓట్ల కోసం వైసీపీ దొంగలు వస్తారు? ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదో చొక్కా పట్టుకుని నిలదీయండి. మళ్లీ రాష్ట్రానికి న్యాయం జరగాలంటే వైసీపీ పోవాలి, ఎన్డీయే ప్రభుత్వం రావాలి.  

ఇదిగో సూపర్ సిక్స్
 
సూపర్ సిక్స్ తో పాటు ప్రధాని మోదీ ప్రకటించిన సంకల్ప్ పత్ర ప్రజలకు ఉపయోగపడేలా విజన్ తయారు చేసుకుంటాం. సంపద సృష్టించి ఆదాయం ప్రజలకు పంచుతాం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కూటమిదే. 

మహాశక్తి కింద ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ. 1500 చొప్పున ఏడాదికి రూ. 18 వేలు నేరుగా బ్యాంకు ఖాతాలో వేస్తాం. తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలున్నా... ఒక్కొక్కరికి ఏడాదికి రూ. 15 వేలు ఇస్తాం. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. 

అన్నదాత కింద రైతుకు ఏడాదికి రూ. 20 వేలు ఇస్తాం. యువగళం కింద యువతకు నెలకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి అందజేస్తాం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.  

అధికారంలోకి రాగానే మొదటి సంతకం డీఎస్సీపైనే పెడతా. నేను, ఎన్టీఆర్ 11 సార్లు డీఎస్సీ నిర్వహించి లక్షలాదిమందిని టీచర్లుగా నియమించాం. జగన్ ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదు. 25 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తాన్నన్నాడు... చేశాడా? నేను రాగానే పోలీసు డిపార్ట్ మెంట్ లో ఖాళీలు భర్తీ చేస్తా. 

గ్రూప్-1లో అక్రమాలకు పాల్పడ్డారు. కమీషన్ల కోసం పరిశ్రమలు తరిమేశారు. మన పిల్లల భవిష్యత్తు కోసం పరిశ్రమలు తెస్తా. వర్క్ ప్రమ్ హోం విధానం తెస్తాం. స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. రైతులకు  గిట్టు భాటు ధర కల్పిస్తాం. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. 90 శాతం సబ్సిడితో డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం. అనంతపురం జిల్లాలో 10 లక్షల పంట కుంటలు తవ్వించాం. వాలంటీర్లు రాజీనామా చేయెద్దు, వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమే నెలకు రూ. 10 వేలు వేతనం ఇస్తాం... అని చంద్రబాబు హామీలు ఇచ్చారు.

More Telugu News