Etela Rajender: రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టే అవసరం మాకు లేదు: ఈటల రాజేందర్

We will not targetting revanth reddy government says etala
  • మోదీకి కేసీఆర్ సుపారీ ఇచ్చారన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఈటల ఆగ్రహం
  • ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేనా అని నిలదీత
  • మాల్యా, నీరవ్ మోదీ వంటి అక్రమార్కుల ఆస్తులను సీజ్ చేశామన్న ఈటల
  • బీజేపీ నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని వ్యాఖ్య

రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టే అవసరం తమకు లేదని మల్కాజ్‌గిరి లోక్ సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం ఆయన ఎన్టీవీ క్వశ్చన్ అవర్‌లో మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కవిత బెయిల్ కోసం ప్రధాని మోదీకి కేసీఆర్ సుపారీ ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపణలు చేయడం దారుణమన్నారు. అసలు ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేనా ఇవి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన నాలుకకు నరం లేదని విమర్శించారు. అందుకే పేగులు మెడలో వేసుకుంటా అంటూ మాట్లాడుతున్నారన్నారు.

రేవంత్ రెడ్డి పదవిలోకి రాకముందు ఒకలా... వచ్చాక మరోలా స్పందిస్తున్నారన్నారు. ఆయనతో తనకు మానవ సంబంధాలు ఉన్నాయన్నారు. ఆయనను ముఖ్యమంత్రిగా చూస్తామన్నారు. ఆయన రాష్ట్రానికి సీఎం కాబట్టి ప్రతి వారికి అవసరం అవుతుందన్నారు. రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారని కేసీఆర్ అంటున్నారని... అది ఆయనకే తెలియాలని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ది నాలుకనా? తాటిమట్టనా? అని ప్రశ్నించారు.

మాల్యా, నీరవ్ మోదీ వంటి అక్రమార్కుల ఆస్తులను సీజ్ చేశాం

విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి అక్రమార్కుల ఆస్తులను కేంద్ర ప్రభుత్వం సీజ్ చేసిందన్నారు. బీజేపీ పదేళ్ల పాలనలో ఎలాంటి కుంభకోణాలు లేవన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కార్పోరేట్లకు లక్షల కోట్ల రుణాలు ఇచ్చాయని పేర్కొన్నారు. రూ.11 లక్షల కోట్ల రుణాల వ్యవహారంలో కాంగ్రెస్ సరిగ్గా వ్యవహరించలేదని విమర్శించారు. ఎలక్టోరల్ బాండ్లలో ఎలాంటి అవకతవకలు లేవన్నారు. బీజేపీకి ఎన్ని వచ్చాయి? బీఆర్ఎస్‌కు ఎన్ని వచ్చాయి? అని ప్రశ్నించారు. 

బీజేపీ నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. సర్వేల మీద ఆధారపడి టిక్కెట్ల కేటాయింపులు జరిగాయన్నారు. టిక్కెట్ల కేటాయింపులో ఆర్ఎస్ఎస్ జోక్యం ఉండదని స్పష్టం చేశారు. మల్కాజ్‌గిరికి ఈటల సరిపోతారని భావించడం వల్లే తనకు టిక్కెట్ ఇచ్చారన్నారు. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ ప్రలోభాలకు గురి చేసి గెలిచారని ఆరోపించారు. కానీ తాను మాత్రం డబ్బులను నమ్ముకోలేదన్నారు. నియోజకవర్గంలో ఉండే పరిస్థితిని బట్టి గెలుపు ఓటములు ఉంటాయన్నారు. బీఆర్ఎస్ పార్టీని ఓడించింది తెలంగాణ ప్రజలు అన్నారు. సెంటిమెంట్ మీద ఆధారపడి ఎల్లప్పుడు రాజకీయాలు కొనసాగవన్నారు.

మోదీ మూడోసారి ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారు

సోషల్ మీడియా ఇంజినీరింగ్‌లో బీజేపీ నెంబర్ వన్ అని ఈటల అన్నారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోందన్నారు. సర్వేల ప్రకారం బీజేపీ తెలంగాణలో 12 స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమకు దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం అనే తేడా ఉండదన్నారు. తమకు దేశమంతా ఒక్కటే అన్నారు. బీజేపీలో చేరినంత మాత్రాన నేతలపై కేసులు మాఫీ కావని స్పష్టం చేశారు. విచారణ సంస్థల దర్యాఫ్తు కొనసాగుతుందన్నారు.

  • Loading...

More Telugu News