Google: లోక్ సభ తొలి దశ ఎన్నికల ప్రారంభాన్ని సూచిస్తూ గూగుల్ డూడుల్

  • హోం పేజీపై గూగుల్ అక్షరాల తొలగింపు
  • చూపుడు వేలికి ఇంక్ చుక్క ఉన్న చెయ్యి బొమ్మ ఏర్పాటు
  • దానిపై క్లిక్ చేస్తే ఎన్నికల తాజా సమాచారంతో కూడిన వివరాలు 
Google Doodle Marks First Phase Of Lok Sabha Elections 2024 With Voting Symbol

దేశంలో లోక్ సభ ఎన్నికల తొలి దశ ప్రారంభాన్ని సూచిస్తూ ఇంటర్నెట్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ ఓ డూడుల్ ను విడుదల చేసింది. గూగుల్ హోం పేజీపై ఉండే గూగుల్ అక్షరాల లోగో స్థానంలో చూపుడు వేలిపై ఇంక్ చుక్క ఉన్న చెయ్యి బొమ్మను ఉంచింది. అయితే ఈ డూడుల్ ను డిజైన్ చేసిన వ్యక్తి పేరును గూగుల్ వెల్లడించలేదు. యూజర్లు డూడుల్ పై క్లిక్ చేయగానే దేశంలో ఎన్నికల తాజా సమాచారంతో కూడిన సెర్జ్ రిజల్ట్స్ వచ్చేలా గూగుల్ ఏర్పాటు చేసింది.

జూన్ 4న ఫలితాలు
నేడు మొదలైన తొలి దశ పోలింగ్ లో దేశవ్యాప్తంగా 16.63 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 102 లోక్ సభ స్థానాలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 543 లోక్ సభ స్థానాలకు మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. రెండో దశ పోలింగ్ ఈ నెల 26న జరగనుంది. అలాగే మే 7న మూడో దశ,   మే 13న నాలుగో దశ, మే 20న ఐదో దశ, మే 25న ఆరో దశ, జూన్ 1న ఏడో దశ పోలింగ్ ను ఎన్నికల కమిషన్ నిర్వహించనుంది. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది.

బరిలో హేమాహేమీలు
తొలి దశ ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, భూపేంద్ర యాదవ్, కిరణ్ రిజిజు, సంజీవ్ బలియాన్, జితేంద్ర సింగ్, అర్జున్ రామ్ మేఘ్ వాల్, సర్బానంద సోనోవాల్ ఉన్నారు. అలాగే కాంగ్రెస్ కు చెందిన గౌరవ్ గొగోయ్,  డీఎంకేకు చెందిన కనిమొళి, బీజేపీ తమిళనాడు చీఫ్ కె. అన్నామలై సైతం పోటీలో ఉన్నారు.

ఎక్కువ సీట్ల కోసం ఎన్డీఏ.. పుంజుకోవాలని యూపీఏ
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం గతంలోకన్నా ఎక్కువ సీట్లలో గెలవాలని కోరుకుంటోంది. మరోవైపు విపక్ష ఇండియా కూటమి ఈసారి పుంజుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం పోలింగ్ జరుగుతున్న 102 ఎంపీ సీట్లలో 2019 లోక్ సభ ఎన్నికల్లో యూపీఏ 45 సీట్లలో గెలవగా, ఎన్డీఏ 41 సీట్లలో గెలిచింది.

More Telugu News