Lok Sabha Polls: తొలి దశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంపన్న అభ్యర్థి ఆస్తి విలువ రూ.716 కోట్లు.. బీద అభ్యర్థి వద్ద కేవలం రూ.320

  • రూ.716 కోట్ల ఆస్తితో సంపన్న అభ్యర్థిగా ఉన్న నకుల్ నాథ్
  • తన వద్ద రూ.320 మాత్రమే ఉన్నాయని ప్రకటించిన తూత్తుకుడి స్వతంత్ర అభ్యర్థి పొన్‌రాజ్
  • ఇద్దరు అభ్యర్థుల ఆస్తి విలువ కేవలం రూ.500 అని ప్రకటన
Richest Candidate In 1st Phase Has Rs 716 Crore In Assets

లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో కొనసాగుతోంది. సుమారు 16.6 కోట్ల మంది ఓటు వేయనున్న ఈ దశలో 1625 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో అత్యంత సంపన్న అభ్యర్థి ఆస్తుల విలువ ఏకంగా రూ.716 కోట్లుగా ఉంది. కనిష్ఠంగా ఒక అభ్యర్థి తన వద్ద రూ.320 మాత్రమే ఉన్నాయని ప్రకటించారు. ఏడీఆర్ (అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్) నివేదిక ప్రకారం.. తొలి దశలో పోటీ పడుతున్న 1,625 మంది అభ్యర్థుల ఆస్తులను విశ్లేషించింది. 10 మంది అభ్యర్థులు తమకు ఎలాంటి ఆస్తులు లేవని ప్రకటించారు. పోటీ చేస్తున్నవారిలో 28 శాతం లేదా 450 మంది మంది కోటీశ్వరులుగా ఉన్నారు. వీరంతా కోటి కంటే ఎక్కువ విలువైన ఆస్తులను కలిగివున్నారు.

మధ్యప్రదేశ్‌లోని చింద్వారా నుంచి పోటీ పడుతున్న సిట్టింగ్ ఎంపీ నకుల్ నాథ్ ఆస్తి విలువ రూ.716 కోట్లుగా ఉంది. మాజీ సీఎం కమల్ నాథ్ కుమారుడే నకుల్ నాథ్. ఇక రూ.662 కోట్లతో ఏఐఏడీఎంకే అభ్యర్థి అశోక్ కుమార్ రెండవ సంపన్న అభ్యర్థిగా ఉన్నారు. తమిళనాడులోని ఈరోడ్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. తమిళనాడులోని శివగంగ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి దేవనాథన్ యాదవ్ రూ.304 కోట్ల విలువైన ఆస్తులతో మూడో స్థానంలో నిలిచారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కార్తీ చిదంబరం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. కార్తీ చిదంబరం నికర ఆస్తుల విలువ రూ.96 కోట్లుగా ఉండగా.. తొలి దశ సంపన్న అభ్యర్థుల జాబితాలో 10వ స్థానంలో నిలిచారు.

ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గర్వాల్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి రాజ్యలక్ష్మి షా రూ.206 కోట్లతో నాలుగవ, ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ నుంచి పోటీ చేస్తున్న బీఎస్పీ అభ్యర్థి మాజిద్ అలీ రూ.159 కోట్లతో 5వ స్థానంలో ఉన్నారు.

కాగా ఏకంగా 10 మంది అభ్యర్థులు తమ ఆస్తుల విలువ సున్నా అని ప్రకటించారు. ఇక తమిళనాడులోని తూత్తుకుడి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పొన్‌రాజ్ తన ఆస్తి విలువ కేవలం రూ.320 అని వెల్లడించారు. ఇక మహారాష్ట్రలోని రామ్‌టెక్ నియోజకవర్గం పోటీ చేస్తున్న కార్తీక్ గెండ్లాజీ డోక్, తమిళనాడులోని చెన్నై నార్త్ నుంచి పోటీ చేస్తున్న సూర్యముత్తు తమ వద్ద ఆస్తి విలువ రూ.500 అని ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించారు.

More Telugu News