BJP: కిల్ అవుతానా? కిల్లర్ అవుతానా? అని లెక్కలు చూసుకోలేదు: హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత

  • అవినీతి కేవలం రాజకీయాల్లోనే కాదు... అంతటా ఉందని వెల్లడి
  • భాగ్యలక్ష్మీ దేవాలయానికి వెళ్లేది రాజకీయం కోసం కాదు... అమ్మవారి ఆశీర్వాదం కోసమని వ్యాఖ్య
  • అసదుద్దీన్ ఎవరికి భయపడుతున్నారో తెలియదు... తాను మాత్రం బేలగా లేనన్న మాధవీలత
  • 40 ఏళ్లుగా ఎవరూ గెలవలేదని తాను గెలవననుకోవడం సరికాదన్న బీజేపీ ఎంపీ అభ్యర్థి
  • హైదరాబాద్ పేరును మారిస్తే సమర్థిస్తానన్న మాధవీలత
Hyderabad BJP MP candidate madhavilatha

తాను కిల్ అవుతానా? కిల్లర్‌ను అవుతానా? అని లెక్క చూసుకొని తాను రాజకీయాల్లోకి రాలేదని హైదరాబాద్ లోక్ సభ బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత అన్నారు. ఆమె ఎన్టీవీ క్వశ్చన్ అవర్‌లో మాట్లాడుతూ... రాజకీయాలు హాబీగా ఉండాలనేది తన అభిప్రాయమన్నారు. అవినీతి కేవలం రాజకీయాల్లో మాత్రమే కాదని... ప్రతి వ్యవస్థలోనూ ఉందన్నారు. తాను ఓ వర్గం ఓట్ల కోసమే హైదరాబాద్‌లో పోటీ చేస్తున్నాననడం సరికాదన్నారు. పాతబస్తీ ముస్లిం మహిళలకు తాను సేవ చేస్తున్నానన్నారు. ప్రధాని మోదీ చేసిన ప్రతి కార్యక్రమాన్ని తాను ప్రచారంలో ప్రస్తావిస్తున్నానన్నారు.

హిందుత్వాన్ని వ్యతిరేకించేవాళ్లతో తనకు పని లేదన్నారు. భాగ్యలక్ష్మి దేవాలయానికి వెళ్లేది రాజకీయం చేయడానికి కాదని... అమ్మవారి ఆశీర్వాదం కోసమే అన్నారు. హైదరాబాద్ పేరు మార్చడాన్ని తాను సమర్థిస్తానని స్పష్టం చేశారు. పేరు మార్పిడికి, అభివృద్ధికి సంబంధం లేదని తెలిపారు. అసలు హైదరాబాద్‌కు భాగమతి పేరు ఎందుకు పెట్టవద్దు? అని ప్రశ్నించారు. తనకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మద్దతు ఇస్తున్నారని, ఆయన భార్య తనతో కలిసి వస్తున్నారని తెలిపారు. పాతబస్తీలో మజ్లిస్ పార్టీ చేసిందేమిటో చెప్పాలన్నారు.

ఓటు అనేది వ్యక్తిగత అభిప్రాయం అన్నారు. ప్రచారంలో తాను ఏమీ చెప్పకుండానే జనం తమ గోడు చెప్పుకుంటున్నారని తెలిపారు. జనం బాధలు వింటుంటే తనకు మాట పడిపోతోందన్నారు. తాను ఇస్లామిక్ ఎన్జీవోలతో కూడా కలిసి పని చేశానని పేర్కొన్నారు. అసదుద్దీన్ ఎవరిని చూసి భయపడుతున్నాడో తనకైతే తెలియదని... తాను మాత్రం ఎవరికీ భయపడేది లేదని... అంత బేలగా లేనన్నారు. ముప్పై ఏళ్లుగా ఇదే ప్రాంతంలో కట్టుబొట్టుతో తిరుగుతున్నానన్నారు. తాను ఎంపీగా గెలిస్తే చేయాల్సినవి ఎన్నో ఉన్నాయన్నారు.

తాను ఎంపీ టిక్కెట్ కోసం యాగాలు చేయలేదన్నారు. ఒకవేళ ఎంపీగా పోటీ చేయకపోయినా చాలా పనులు ఉన్నట్లు చెప్పారు. తాను ఏపీ, తెలంగాణ, కర్ణాటకలలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నానన్నారు. ఇరవై ఏళ్లుగా తాను చేపడుతున్న సేవా కార్యక్రమాలు టిక్కెట్ వచ్చేలా చేశాయన్నారు. కేంద్రం నుంచి నిధులు వస్తాయని... వాటిని వాడుకోవడంలోనే ఇబ్బందులు కనిపిస్తున్నాయన్నారు. 40 ఏళ్ళుగా పాతబస్తీలో మజ్లిస్ పైన ఎవరూ గెలవలేదు కాబట్టి తానూ గెలవనని అనుకోవడం సరికాదన్నారు. హిందుత్వం సనాతనం.. సెక్యులర్ సనాతనం కాదన్నారు.

More Telugu News