IPL 2024: ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన టాప్‌-5 బౌల‌ర్లు వీరే

  • 198 వికెట్ల‌తో మొద‌టి స్థానంలో య‌జువేంద్ర చాహ‌ల్
  • రెండో స్థానంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ మాజీ ఆట‌గాడు డ్వేన్ బ్రావో (183)
  • పీయుశ్‌ చావ్లా (181) కు మూడో స్థానం
  • 173 వికెట్లతో నాలుగో స్థానంలో అమిత్ మిశ్రా
  • ఐదో స్థానంలో భువ‌నేశ్వ‌ర్ కుమార్ (173)
Yuzvendra Chahal and Dwayne Bravo List of Players With Highest Number of Wickets in IPL History

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) లో అత్య‌ధిక వికెట్లు తీసిన టాప్‌-5 బౌల‌ర్ల‌లో భార‌త స్పిన్న‌ర్ య‌జువేంద్ర చాహ‌ల్ మొద‌టి స్థానంలో ఉన్నాడు. అలాగే 200 వికెట్ల మైలురాయికి కేవ‌లం రెండు వికెట్ల దూరంలో ఉన్నాడు. ప్ర‌స్తుతం అత‌ని ఖాతాలో 198 వికెట్లు ఉన్నాయి. మొత్తం 151 మ్యాచులు ఆడిన చాహ‌ల్ 7.65 ఎకాన‌మీతో 198 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అలాగే 151 మ్యాచుల్లో 550.5 ఓవ‌ర్లు వేశాడు. ఒక‌వేళ 200 వికెట్లు తీస్తే.. ఐపీఎల్ హిస్ట‌రీలో ఈ ఫీట్‌ను అందుకున్న మొద‌టి బౌల‌ర్‌గా చ‌రిత్ర‌కెక్కుతాడు. 

ఇక చాహ‌ల్ త‌ర్వాత‌  రెండో స్థానంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ మాజీ ఆట‌గాడు డ్వేన్ బ్రావో ఉన్నాడు. 161 మ్యాచుల్లో 183 వికెట్లు తీశాడు. ముంబై ఇండియ‌న్స్‌కు కూడా ఆడిన బ్రావో ఎకాన‌మీ వ‌చ్చేసి 8.38. మూడో స్థానంలో పీయుశ్‌ చావ్లా కొన‌సాగుతున్నాడు. ప్ర‌స్తుతం ముంబైకి ఆడుతున్న చావ్లా త‌న ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 185 మ్యాచులు ఆడాడు. అలాగే 7.96 ఎకాన‌మీతో 181 వికెట్లు తీశాడు. 

పీయూశ్ త‌ర్వాతి స్థానంలో అమిత్ మిశ్రా ఉన్నాడు. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న అత‌డు ఇప్ప‌టివ‌ర‌కు 161 మ్యాచుల్లో 7.36 ఎకాన‌మీతో 173 వికెట్లు ప‌డ‌గొట్టాడు. టాప్‌-5 వికెట్ టేక‌ర్ల‌లో అతి త‌క్కువ బౌలింగ్‌ ఎకాన‌మీ క‌లిగి ఉన్న బౌల‌ర్ అమిత్ మిశ్రానే. 

అమిత్ మిశ్రా త‌ర్వాత ఐదో స్థానంలో ఉన్న బౌల‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్‌. మొత్తం 166 మ్యాచులాడిన భువ‌నేశ్వ‌ర్ 173 వికెట్లు తీశాడు. భువీ ఎకాన‌మీ వ‌చ్చేసి 7.51. కాగా, ఈ టాప్‌-5 బౌల‌ర్ల‌లో ప్రస్తుతం ఒక్క డ్వేన్ బ్రావో మాత్ర‌మే రిటైర్ అయ్యాడు. మిగ‌తా న‌లుగురు ఇంకా ఆట‌లో కొన‌సాగుతున్నారు.

More Telugu News