Amit Shah: రాహుల్ గాంధీ అమేథి నుంచి పోటీ చేయాలి: కేంద్రమంత్రి అమిత్ షా

Amit Shah taunts Rahul Gandhi says he should contest from Amethi
  • బీజేపీ 150 కంటే తక్కువ సీట్లలో గెలుస్తుందన్న రాహుల్ గాంధీకి కేంద్రమంత్రి కౌంటర్
  • ఈవీఎంలపై కాంగ్రెస్ ఆరోపణలు చేయడం మీద స్పందించిన అమిత్ షా
  • తెలంగాణ, ఛత్తీస్‌గడ్, రాజస్థాన్‌లలో ఈవీఎంల ద్వారానే గెలిచారని గుర్తు చేసిన కేంద్రమంత్రి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్తర ప్రదేశ్‌లోని అమేథి నుంచి పోటీ చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సూచించారు. గుజరాత్‌లోని గాంధీ‌నగర్‌లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సమయంలో 'ఇండియాటుడే'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... అమేథి నుంచి ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పాలన్నారు. కానీ ఈ విషయం ప్రజలకు, మీడియాకు అర్థమైందన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 150 కంటే తక్కువ సీట్లు గెలుచుకుంటుందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. 'మొదట లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథి నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నాను' అని అమిత్ షా సమాధానం ఇచ్చారు.

2019 లోక్ సభ ఎన్నికల్లో అమేథిలో స్మతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ 55వేల పైచిలుకు మెజార్టీతో ఓడిపోయారు. ఇప్పటికే స్మృతి ఇరానీ నామినేషన్ దాఖలు చేశారు. కానీ కాంగ్రెస్ ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించలేదు. రాహుల్ గాంంధీ కేరళలోని వయనాడ్ నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అమేథి నుంచి పోటీ చేయాలని బీజేపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.

తెలంగాణ, రాజస్థాన్‌లలో ఈవీఎంల ద్వారానే గెలిచారు కదా

ఈవీంఎంలు సరిగ్గా ఉంటే బీజేపీ 180 సీట్ల మార్కును దాటదని ప్రియాంక గాంధీ చేసిన ఆరోపణలపై కూడా అమిత్ షా స్పందించారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు ఈవీఎంలను దుర్వినియోగం చేశారని చెప్పడం గెలిచినప్పుడు వాటిని సరిగ్గా పని చేస్తున్నాయని చెప్పడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని చురక అంటించారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఈవీఎంల ద్వారానే గెలిచింది కదా? అని ప్రశ్నించారు. 

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై అమిత్ షా మండిపడ్డారు. తృణమూల్ కాంగ్రెస్ పాలనలో మహిళలు, గ్రామస్థులు సురక్షితంగా లేరన్నారు. అందుకు సందేశ్‌ఖాలీ నిదర్శనమన్నారు. మోదీ మూడోసారి గెలిచాక రెండేళ్లలో తాము నక్సలిజాన్ని రూపుమాపుతామన్నారు.
Amit Shah
Rahul Gandhi
Congress
BJP
Lok Sabha Polls

More Telugu News