Chandrababu: వైసీపీ వచ్చాక 'హిందూ భక్తుల మనోభావాలపై గొడ్డలి పోట్లు' అనదగ్గ 160 ఘటనలు జరిగాయి: చంద్రబాబు

  • ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
  • 2019లో వైసీపీ వచ్చాక ఆలయాలపై దాడులు జరిగాయన్న చంద్రబాబు
  • అధికారంలోకి వస్తే ఒంటిమిట్ట మాదిరి రామతీర్థంను అభివృద్ధి చేస్తామని వెల్లడి
Chandrababu wishes people on Sri Rama Navami

ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. నవమి అనగానే తనకు కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయంలో చేసిన అభివృద్ధి గుర్తుకు వచ్చిందని తెలిపారు. దాంతోపాటే, మూడేళ్ల కిందట విజయనగరం రామతీర్థం ఆలయంలో శ్రీరాముని విగ్రహం తలను తొలగించిన దారుణ ఘటన కూడా గుర్తుకు వచ్చిందని చంద్రబాబు వివరించారు. 

"2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక దేవాలయాలపై దాడులు పెరిగాయి, రథాలు తగలబడ్డాయి, అర్చకులపై దాడులు జరిగాయి. కలియుగ వైకుంఠ దైవం తిరుమల ఏడుకొండల వాడి పుణ్యక్షేత్రం సహా అనేక హిందూ దేవాలయాల పవిత్రత దెబ్బతీసే అనేక చర్యలు జరిగాయి. కానీ ఏ ఒక్క ఘటనలోనూ నిందితులు అరెస్ట్ కాలేదు. భక్తుల మనోభావాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ప్రయత్నం కూడా చేయలేదు. 

హిందూ భక్తుల మనోభావాలపై గొడ్డలి పోట్లు అనదగ్గ సుమారు 160 ఘటనలు జరిగినా, ప్రభుత్వం అది సమస్య కాదన్నట్టుగా అలక్ష్యం చేయడం భక్తులను మరింత బాధించింది. ఈ క్రమంలోనే రామతీర్థం ఆలయంలో రాముల వారి విగ్రహం తలను విగ్రహం నుంచి తొలగించి అక్కడే ఉన్న కోనేరులో పడేసి వెళ్లిపోయారు. 

ఈ శ్రీరామనవమి రోజు చెబుతున్నా... టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒంటిమిట్ట మాదిరిగా రామతీర్థం దేవాలయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తాం. రాష్ట్రంలో దేవాలయాల రక్షణకు, పవిత్రతను కాపాడేందుకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తాం. ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యాన్ని ప్రజలకు అందిస్తాం" అని చంద్రబాబు వివరించారు.

More Telugu News